×
Ad

Gold Price : బంగారం, వెండి ధరలు కొద్దిరోజుల్లో భారీగా తగ్గబోతున్నాయా..? కానీ, అలా జరగాలి.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు

Gold Price : రాబోయే రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందా. అలా జరగాలంటే అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాలని ఆర్థిక సర్వే అంచనా వేసింది.

Gold Price

Gold Price : బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా.. అసలు ఎవరూ ఊహించని స్థాయికి గోల్డ్, సిల్వర్ రేట్లు దూసుకెళ్లాయి.. దీంతో సరికొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. అయితే, తాజాగా.. ఆర్థిక సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. బంగారం, వెండి ధరలు తగ్గుతాయి.. కానీ, అలా జరగాలని సర్వే అంచనా వేసింది.

Also Read : Wrong UPI Transfer : యూపీఐ రాంగ్ పేమెంట్ చేశారా? మీ డబ్బు రికవరీ అవుతుందా? లేదా? ఇలా అయితే మీకు పైసా కూడా రావు!

బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పెరిగిన విషయం తెలిసిందే. దీంతో కిలో వెండి ధర 4లక్షల మార్క్ ను దాటేసింది. అయితే, ఉదయం భారీగా పెరిగిన ధరలు.. సాయంత్రంకు శాంతించాయి. దీంతో అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాముల) బంగారం ధర 25 డాలర్లు పెరిగి 5,330 డాలర్లకు చేరగా.. ఔన్సు వెండి ధర కూడా ఒక డాలరు అధికమై 114 డాలర్లను మించింది. ఫలితంగా గురువారం రాత్రి 11.55గంటలకు హైదరాబాద్ బులియన్ విపణిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,79,700 వద్ద, కిలో వెండి ధర రూ.3,99,600 వద్ద స్థిరపడ్డాయి.

అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా బంగారం, వెండి ధరలు ఈ ఏడాది అధిక స్థాయుల్లోనే కొనసాగొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 739 పేజీలతో కూడిన 2025-26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ బృందం దీన్ని రూపొందించింది. ప్రతీయేటా బడ్జెట్ కు ముందు ఆవిష్కరించే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందన్నది తెలియజేస్తుంది.

ఆర్థిక సర్వే అంచనాల ప్రకారం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉధ్రిక్తతల మధ్య రక్షణాత్మక పెట్టుబడుల ధోరణితో బంగారం, వెండి ధరల దూకుడు ఇప్పుడప్పుడే తగ్గే పరిస్థితి లేదని అభిప్రాయ పడింది. ఈ ఏడాది అధిక స్థాయుల్లోనే బంగారం, వెండి ధరలు కొనసాగొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే, 2025 స్థాయిలో, ఈ లోహాల ధరల వృద్ధి కొనసాగకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నట్లు పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా శాంతి పవనాలు వీచి, వాణిజ్య యుద్ధాలకు పరిష్కారం లభిస్తేనే బంగారం, వెండి ధరలు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది.