Gold And Silver Rates
Gold Price : బంగారం, వెండి ధరలు కొద్దిరోజులుగా రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. తద్వారా ఆల్ టైం గరిష్ఠ రికార్డులను నమోదు చేస్తున్నాయి. దసరా పండుగ వేళ బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమైన ప్రజలకు గోల్డ్ రేట్లు షాకిచ్చాయి. అయితే, ప్రస్తుతం గోల్డ్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. తులం బంగారంపై సుమారు రూ.2వేలు తగ్గింది. అయితే, రాబోయే కాలంలో గోల్డ్ రేటు మరింత తగ్గబోతుందని పేస్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్ట్ అమిత్ గోయెల్ పేర్కొన్నారు.
బంగారం, వెండి ధరలు గతంలో ఎప్పుడూలేని స్థాయికి పెరిగాయి. గత 40 సంవత్సరాలలో డాలర్ ఇండెక్స్ బలహీనపడినప్పుడు మాత్రమే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే, ప్రతి ర్యాలీ తరువాత.. భారీ అమ్మకాల కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పతనమయ్యాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: Today Gold Rate : బంగారం రేట్లు ఢమాల్.. ఈ రేంజ్ లో తగ్గడం ఇదే ఫస్ట్ టైమ్.. ఈ రోజు తులం ఎంతంటే..
రాబోయే కొద్దిరోజుల్లోనే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతాయని అమిత్ గోయెల్ అంచనా వేశారు. ప్రస్తుతం ఉన్న బంగారం ధరల్లో 30 నుంచి 35శాతం ధరలు తగ్గే అవకాశం ఉంటుందని చెప్పారు. 2007-08 మరియు 2011 సంవత్సరాల్లో ప్రధాన ర్యాలీల తరువాత బంగారం ధర 45శాతం పడిపోయిందని గత విషయాలను ఆయన గుర్తు చేశారు. కొద్దికాలంలోనే బంగారం 10గ్రాముల రేటు రూ.77,701కి తగ్గే అవకాశం ఉందని, అదే సమయంలో వెండి కిలో రేటు రూ.77,450కు చేరే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు 2,600 డాలర్ల నుంచి 2,700 డాలర్లకు తగ్గేవరకు వేచి ఉండాలి.. ఆ తరువాత మాత్రమే బంగారంపై కొత్త పెట్టుబడులు ఉత్తమంగా మారుతాయి. అంతకుముందు పెట్టుబడి అయినా ప్రమాదకరంగా ఉంటుందని అన్నారు. వెండి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం వెండి ధరలు ఓవర్ బాట్ జోన్లో ఉన్నాయి. అంటే ఇది సాధారణం కంటే ఎక్కువ. ఈ స్థాయి వద్ద మళ్లీ తగ్గే అవకాశాలే ఎక్కువ. అందువల్ల వెండిపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారు జాగ్రత్తగా ముందే ఆలోచించాలని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.
రాబోయే రెండు మూడు సంవత్సరాలలో అమెరికా నేతృత్వంలో ప్రపంచంలో తీవ్ర మాంద్యాన్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి.. అలాంటప్పుడు, ఒక దశాబ్దంలో మొదటిసారిగా వెండి డిమాండ్ వాస్తవానికి తగ్గిపోతుందని ఆయన అంచనా వేశారు. అయితే, ఫోటోవోల్టాయిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల వంటి రంగాల నుండి పారిశ్రామిక డిమాండ్ కూడా ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని భర్తీ చేయకపోవచ్చు. స్వల్పకాలిక ర్యాలీలు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ, విలువైన లోహాలలో ప్రస్తుత పెరుగుదల నిలకడగా లేదని గోయెల్ అభిప్రాయపడ్డారు.