Gold returns: వామ్మో.. బంగారంపై పెట్టుబడి ఎన్ని కోట్లాది రూపాయల లాభాలను తెచ్చిపెట్టిందంటే? ఈ ఒక్క ఉదాహరణ చాలు..

బంగారంపై పెట్టుబడి ఎంతటి లాభాలను ఇస్తుందో ఈ నివేదిక ద్వారా అర్థం చేసుకోవచ్చు.

బంగారంపై పెట్టుబడులు ఏ మేరకు లాభాలను తెచ్చిపెడతాయో చెప్పేందుకు చక్కని ఉదాహరణ ఇది. గత 25 ఏళ్లలో అమెరికా, భారత్ స్టాక్‌ మార్కెట్ల రిటర్న్‌ల కంటే బంగారం అధిక రాబడిని ఇచ్చింది. 2000 ఏడాది నుంచి, ఎస్ అండ్ పీ 500 (యూఎస్‌), నిఫ్టీ 50 (భారత్‌) వంటి ప్రధాన స్టాక్ మార్కెట్ సూచికలతో పోలిస్తే.. పసిడి మంచి రాబడిని ఇచ్చింది.

అక్విటాస్ రిపోర్ట్‌ ప్రకారం.. గత 25 సంవత్సరాలుగా ఈ స్టాక్ మార్కెట్ సూచికలలో పెట్టుబడి పెట్టిన వారి కంటే బంగారంలో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు ఎక్కువ డబ్బు సంపాదించారు.

ఇక, 2000 ఏడాది నుంచి యూఎస్ డాలర్ల పరంగా బంగారం ధర దాదాపు 10 రెట్లు పెరిగింది. ఎస్ అండ్ పీ 500 స్టాక్ ఇండెక్స్ 4.3 రెట్లు పెరిగింది. అంటే గత 25 ఏళ్లలో బంగారం ఎస్ అండ్ పీ 500 రిటర్న్‌ల కంటే రెట్టింపు కంటే ఎక్కువ ఇచ్చింది. ఈ సమయంలో ఇది బలమైన పెట్టుబడిగా నిలిచింది.

ఎస్ అండ్ పీ 500 అనేది అమెరికాలో స్టాక్ మార్కెట్ సూచిక. ఇది 500 అతి పెద్ద కంపెనీల పనితీరు సంబంధించిన గణాంకాలను తెలుపుతుంది. ఈ కంపెనీలు స్టాక్ మార్కెట్లో ఎంత బాగా చేస్తున్నాయో ఇది చూపుతోంది. అంటే కొన్ని కోట్లాది రూపాయల లాభాలను తెచ్చిపెట్టింది.

అదేవిధంగా, భారత్‌లోని రూపాయి మారకం విలువపరంగా బంగారం రిటర్నులు మన దేశ నిఫ్టీ 50 సూచికను కూడా అధిగమించాయి. గత 25 సంవత్సరాల్లో బంగారం విలువ 19.32 రెట్లు పెరిగింది, నిఫ్టీ 50 కేవలం 15.67 రెట్లు పెరిగింది.

బంగారంపై పెట్టుబడి ఎంతటి లాభాలను ఇస్తుందో ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ అనిశ్చితంగా ఉన్నప్పుడు ప్రజలు బంగారాన్ని సురక్షితమైన ఆప్షన్‌గా చూస్తారు. దీర్ఘకాలంపాటు స్థిరమైన వృద్ధి, రాబడిని కోరుకునే పెట్టుబడిదారులకు బంగారం నమ్మదగిన ఆప్షన్‌గా నిలుస్తోంది.

బంగారు ధరలు పైపైకి వెళ్తున్నాయని కమోడిటీ అండ్ కరెన్సీ, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన రీసెర్చ్ అనలిస్ట్ అటెన్ త్రివేది తెలిపారు. ఎంసీఎక్స్‌లో శుక్రవారం బంగారం ధర రూ.475 పెరిగి రూ .86,280కు చేరుకుందని, అలాగే, కామెక్స్ మార్కెట్లో బంగారం ధర 18 డాలర్లు పెరిగి, ఒక ఔన్సుకు 2,935 డాలర్ల చొప్పున ట్రేడవుతోందని తెలిపారు.