Gold Crash : బంగారం మార్కెట్‌లో భారీ షాక్.. రికార్డు ధరల నుంచి రూ.51 వేల పతనం.. ఇప్పుడు గోల్డ్ కొనాలా? వద్దా?

Gold Crash: బంగారం భారీగా పతనమైంది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి ఏకంగా రూ. 51వేలు పతనమైంది. వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు, బలపడుతున్న డాలర్, ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గడం వంటి కారణాల వల్ల బంగారం మరింత దిగజారింది..

Gold Crash

Gold Crash:పెట్టుబడిదారులకు భారీ షాక్.. బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఇది సరైన సమయం కాదు.. బంగారం ఒక్కసారిగా పాతాళం దిశగా వెళ్తోంది. 2026 ప్రారంభంలో రికార్డు స్థాయిలను తాకిన బంగారం పెట్టుబడిదారులను ఉత్సాహపరిచింది. కానీ, ఇప్పుడు బంగారం అంతే వేగంతో క్షీణిస్తోంది.

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,92,991 నుంచి 26 శాతానికి పైగా (Gold Crash) పడిపోయింది. అంటే.. సుమారు రూ.1,41,977 వద్దకు చేరింది. బంగారం దెబ్బకు వెండి కూడా ఇదే తరహా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ భారీ పతనం వెనుక అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

ఈ ఏడాదిలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ మళ్లీ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాల మధ్య బలపడుతున్న యూఎస్ డాలర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం నేపథ్యంలో పెట్టుబడిదారులు తమ డబ్బును ఈక్విటీలలోకి మళ్లిస్తున్నారు. దాంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ఏడు నెలల కనిష్ట స్థాయికి సమీపంలో ఉంది. అయితే, బంగారం, వెండి ధరలు ఎందుకు పడిపోతున్నాయి? ఇంకా పడిపోయే అవకాశం ఉందా? లేదా అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

బంగారం పతనానికి కారణాలివే :

సీఎంఈ ఫెడ్‌వాచ్ డేటా ప్రకారం.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు బంగారం పతనానికి ప్రధాన కారణంగా నిలిచాయి. వచ్చే సెప్టెంబర్‌లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం 66శాతం ఉందని మార్కెట్లు అంచనా వేస్తున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి వడ్డీ రాబడి ఇవ్వని ఆస్తుల ఆకర్షణ తగ్గుతుంది. మరోవైపు అమెరికన్ డాలర్ బలపడటంతో అంతర్జాతీయ బంగారం మార్కెట్లలో బంగారం ధరలపై కూడా అదనపు ఒత్తిడి ఏర్పడింది.

ఒత్తిడిలో వెండి :
బంగారం ప్రభావం ఇప్పుడు వెండిపైనా పడింది. వెండి పెట్టుబడి లోహమే కాదు.. పారిశ్రామిక వినియోగానికి కూడా చాలా కీలకం. అయినప్పటికీ ప్రస్తుతం బలపడుతున్న డాలర్, అధిక వడ్డీ రేట్ల భయాలు వెండి ధరలను కూడా దిగజార్చుతున్నాయి. ఇటీవల స్పాట్ సిల్వర్ ధరలు గణనీయంగా తగ్గి తర్వాత స్వల్పంగా కోలుకున్నాయి. ఈ వారం ప్రారంభంలో స్పాట్ సిల్వర్ కూడా ఔన్సుకు సుమారు 56 డాలర్లకు పడిపోయి ఆ తర్వాత కొద్దిగా కోలుకుంది.

Read Also : EPFO Portal Shutdown : పీఎఫ్ విత్‌డ్రా ఈ తేదీల్లో అసలు చేయొద్దు.. ఏకంగా 3 రోజులు సేవలు బంద్.. క్లెయిమ్స్ చేస్తే జరిగేది ఇదే..!

ఇన్వెస్టర్లు ఏం చేయాలి? :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఫెడరల్ రిజర్వ్ కఠిన వైఖరి అలానే కొనసాగితే బంగారం, వెండి ధరలపై మరింత ఒత్తిడి కొనసాగవచ్చు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, బాండ్ యీల్డ్స్, డాలర్ కదలికలతో రాబోయే రోజుల్లో బంగారం ధరల దిశను నిర్ణయించే కీలక అంశాలుగా మారే అవకాశం ఉంది.

ఫెడరల్ రిజర్వ్ అంచనాలలో మార్పే ఈ క్షీణతకు అతిపెద్ద కారణమని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కమోడిటీ రీసెర్చ్ కాయనత్ చైన్‌వాలా అన్నారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 3,959 డాలర్లకు పడిపోయి 7 నెలల కనిష్ట స్థాయికి చేరింది. స్పాట్ సిల్వర్ ధర ఈరోజు ఉదయం ఔన్సుకు 56 యూఎస్ డాలర్లకు తగ్గిందని ఆమె చెప్పారు.

ఏఐ దెబ్బకు బంగారం పతనం :
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం వేగంగా దూసుకెళ్తోంది. పెట్టుబడిదారులు టెక్నాలజీ, ఏఐ కంపెనీల షేర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా బంగారం ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి ఫండ్స్ బయటకు వెళ్లి ఈక్విటీల్లోకి ఎంట్రీ ఇస్తున్నాయి. అధిక రాబడుల ఆశ కారణంగా సురక్షిత పెట్టుబడి అయిన బంగారంపైనే రోజురోజుకీ డిమాండ్ తగ్గుతూ వస్తోంది.

ధర తగ్గితేనే గోల్డ్ కొనాలా? :

లాంగ్ టైమ్ పరంగా పరిశీలిస్తే.. గోల్డ్ ఇప్పటికీ ద్రవ్యోల్బణం, భౌగోళిక ఉద్రిక్తతలు, కరెన్సీ అస్థిరతకు రక్షణ కవచమే.. అయితే నిపుణులు ప్రస్తుతం ఒకేసారి పెద్ద మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేయకపోవడమే బెటర్ అంటున్నారు. అంటే.. దశలవారీగా బంగారంపై పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. అమెరికా వడ్డీ రేట్లపై స్పష్టత వచ్చే వరకు బంగారం, వెండి ధరల్లో అస్థిరత ఇంకా కొనసాగే అవకాశం ఉందని అంచనా.