Gold : బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకెళ్తుంది. ఫలితంగా 10గ్రాముల గోల్డ్ రేటు దేశీయంగా, అంతర్జాతీయంగా సరికొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పటిష్ఠంగా ఉండటం, టారిఫ్‌ల పరమైన అనిశ్చితి, ఈ నెలలో అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాల మధ్య బంగారం ర్యాలీ కొనసాగుతుంది.
ప్రస్తుతం దేశంలో గోల్డ్ రేటు సరికొత్త రికార్డులను నమోదు చేసింది. 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,05,670ని తాకింది. 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,04,800కి చేరింది. అమెరికా టారిఫ్ ల పరమైన అనిశ్చితి, వడ్డీ రేట్లపై ఫెడ్ వైఖరి గురించి ఆందోళన పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు పసిడిలాంటి సురక్షితమైన పెట్టుబడి సాధనాల వైపు మళ్లుతున్నారని ట్రేడర్లు చెబుతున్నాయి. ఈ క్రమంలో ప్యూచర్స్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) బంగారం ధర ఒక దశలో 3,556 డాలర్లకు చేరింది. ఇది కొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయి కావడం గమనార్హం.
ట్రేడ్‌జీని చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డి. త్రివేశ్ మాట్లాడుతూ.. రూపాయి మారకం క్షీణిస్తుండటం, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతుండటంతో బంగారం ధర మరింత పెరుగుతుందని చెప్పారు. కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కాయ్‌నాత్ చైన్‌వాలా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫెడ్ రిజర్వ్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడం, టారిఫ్ ల పరమైన అనిశ్చితి, ఈ నెలలో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలు.. ఇలా మొదలైన అంశాలు బంగారం ధర భారీ పెరుగుదలకు కారణం అవుతున్నాయని చెప్పారు.
వెండి ధరసైతం సరికొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,26,000 మార్క్ ను తాకింది. పర్యావరణహిత విద్యుత్, ఎలక్ట్రానిక్స్ తదితర పరిశ్రమల నుంచి డిమాండ్ తోపాటు స్ఫెక్యులేషన్ కూడా వెండి ధర పెరుగుదలకు దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇదే పరిస్థితి కొనసాగితే.. వచ్చే వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.