రెండు రోజుల్లో రూ.1300 తగ్గిన బంగారం ధరలు

  • Publish Date - September 9, 2019 / 12:21 PM IST

నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దేశీయ మార్కెట్లో అమాంతం దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డిమాండ్ తగ్గడం, రూపాయి బలపడటం తదితర కారణాలతో బంగారం ధరలు ఎట్టకేలకు దిగి వస్తున్నాయి.

సోమవారం నాటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర రూ. 300 తగ్గి రూ. 39,225కు చేరుకుంది. అంతకు ముందు రూ.1000 వరకు తగ్గింది.  అటు వెండి ధర కూడా బంగారం దారిలోనే ఎగిసిపడింది.

పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో రూ. 1400 తగ్గి రూ. 49వేల దిగువకు పడిపోయింది. నేటి మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 48,500గా ఉంది. అధిక ధరల కారణంగా రిటైల్ మార్కెట్లో బంగారం అమ్మకాలు తగ్గిపోగా.. ఆభరణాల తయారీదారుల నుంచి కూడా డిమాండ్ బాగా పడిపోయింది.

దేశీయ కరెన్సీ రూపాయి పుంజుకోవడం బంగారం ధరలు తగ్గడానికి కారణం అని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల బంగారం ధర రూ. 40వేల పైకి చేరుకుని జీవనకాల గరిష్ఠాన్ని అందుకుంది.