Gold Price : మూడేళ్లుగా బంగారం ధరల జోరు.. 2024లోనూ ధరలు పెరిగే అవకాశం.. కారణాలు ఇవేనంటున్న నిపుణులు..

2013 నుంచి 2019 వరకు అంతర్జాతీయగా బంగారం ధరలు తక్కువ స్థాయుల్లోనే కొనసాగాయి. 2020లో మాత్రం బంగారం ధర భారీగా పెరిగింది. అప్పటి నుంచి గత మూడేళ్లుగా బంగారం ధరల జోరు కొనసాగుతోంది.

Gold Rate 2024

Gold Price Increase : ప్రపంచానికి బంగారం పెట్టుబడి సాధనం కావచ్చు.. కానీ, భారతదేశంలో బంగారం అంటే సెంటిమెంట్. ముఖ్యంగా మహిళలకు పసిడితోఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వివాహాది శుభకార్యాలకు ఒంటిపై బంగారంలేనిదే బయటకు వెళ్లరు. పండుగల సమయంలోనూ బంగారం కొనుగోలుకు మహిళలు ఆసక్తి చూపుతుంటారు. అందుకే ధరలతో సంబంధం లేకుండా భారతదేశంలో ఎప్పుడూ బంగారంకు డిమాండ్ ఉంటూనే ఉంటుంది. గత మూడేళ్ల వరకు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతూ వచ్చినా.. మూడేళ్లుగా రికార్డులు సృష్టున్నాయి. బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. 2023లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయితే, 2024లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.

2024లోనూ బంగారం ధరల జోరు..
2013 నుంచి 2019 వరకు అంతర్జాతీయగా బంగారం ధరలు తక్కువ స్థాయుల్లోనే కొనసాగాయి. 2020లో మాత్రం బంగారం ధర భారీగా పెరిగింది. అప్పటి నుంచి గత మూడేళ్లుగా బంగారం ధరల జోరు కొనసాగుతోంది. 2023 సంవత్సరం ప్రారంభంలో గ్రాము మేలిమి బంగారం ధర రూ. 5,425 ఉంది. డిసెంబర్ నెల వచ్చే సరికి గ్రాము మేలిమి బంగారం ధర రూ. 6,540కు చేరింది. అంటే గ్రాముకు రూ. 1100 పెరిగింది. 2024 సంవత్సరంలో అంతర్జాతీయంగా ఔన్సు ప్రస్తుత 2075 డాలర్ల నుంచి 2300 డాలర్లకు చేరితే.. దేశీయంగా బంగారం గ్రాము ధర రూ. 7,100కు చేరే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువగానూ బంగారం ధరలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు వెండి ధరలుసైతం భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణుల అంచనా. ఈ ఏడాది కిలో వెండి రూ. 60వేల నుంచి రూ. 75వేలకు చేరింది. వచ్చే ఏడాది కిలో వెండి 90వేలకు చేరొచ్చన్నది అంచనా.

బంగారం ధరలు పెరగడానికి కారణాలు..

  • 2024లోనూ బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
  • వచ్చే ఏడాది మన దేశంతోపాటు దాదాపు 40 దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఉన్న రాజకీయ, భౌగోళిక ఉద్రిక్తతలకుతోడు, ఆర్థిక మందగమనమూ బంగారం ధరల పెరుగుదలకు కారణం కానుంది.
  • వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు ఫారెక్స్ (విదేశీ మారకపు) నిల్వలను వివిధ రూపాల్లో అట్టేపెట్టకుంటాయి. ఇందులో బంగారం వాటా 2009 నుంచి పెరుగుతోంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తరువాత కేంద్రీయ బ్యాంకులన్నీ కలిపి చేసే వార్షిక సగటు కొనుగోళ్లు 1కోటి ఔన్సులకు తగ్గడం లేదు. వచ్చే దశాబ్దంలో ఇది మరింత అధికతమవుతోందనే అంచనా. ఇవన్నీ బంగారానికి గిరాకీ పెంచే అవకాశాలే అవుతాయి.
  • గనుల నుంచి బంగారం తవ్వకం గతంలో తగ్గినా మూడేళ్లుగా స్థిరీకరణ దశకు చేరింది. మూడేళ్ల తరువాత లోహ తవ్వకాలు తగ్గుతాయని అంచనాలున్నాయి.
  • ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పాత- విరిగిన ఆభరణాలు మార్చుకుని కొత్తవి తీసుకోవడం పెరుగుతోంది.
  • మీ దగ్గర ఇప్పుడు ఉండే బంగారం విలువ వచ్చే ఏడాది పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని నిపుణులు చెప్పారు. వచ్చే ఏడాది భారత్‌లో బంగారానికి విపరీతంగా డిమాండ్ ఉండనుందని ఇప్పటికే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా స్పష్టం చేసింది.