Gold Rate Decrease
Gold Rate Decrease : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి భారీ శుభవార్త. ప్రస్తుతం గోల్డ్ రేటు రోజురోజుకు పతనమవుతోంది. రాబోయే రెండు మూడు నెలల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీపావళి ముందు వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ప్రస్తుతం పతనమవుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణాలు ఉన్నాయి.
గడిచిన ఏడు రోజులుగా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. అక్టోబర్ 18వ తేదీన భారీ తగ్గిన గోల్డ్ రేటు.. ఆ తరువాత ప్రతిరోజూ తగ్గుతూనే వస్తుంది. 18వ తేదీ నుంచి 24క్యారట్ల 10గ్రాముల బంగారం ధరలను పరిశీలిస్తే.. 18వ తేదీన రూ.1,910 తగ్గగా.. 20వ తేదీన రూ.170 తగ్గింది. 21వ తేదీన రూ.110 తగ్గగా.. 22వ తేదీన రూ.4,690 తగ్గింది. అక్టోబర్ 23వ తేదీన రూ.810 తగ్గగా.. అక్టోబర్ 24వ తేదీన రూ.710 తగ్గింది. అయితే, గడిచిన వారం రోజుల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ.8,410 తగ్గింది. బంగారం ధరలు వరుసగా తగ్గుముఖం పట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లలో ఈ వారం బంగారం ధరలు 3 శాతం తగ్గడంతో పసిడి కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. గోల్డ్ ధరలు సుమారు తొమ్మిది వారాలుగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ వారంలో మాత్రమే ధరల పతనం నమోదైంది. దీంతో గోల్డ్ రేటు ఔన్సుకు 4118.68 డాలర్ల వద్దకు చేరుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల మధ్య సురక్షితమైన పెట్టుబడిగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అయితే, ఆ సుదీర్ఘ ర్యాలీకి ప్రస్తుతం ఆకస్మికంగా బ్రేకులు పడుతున్నాయి. రికార్డు గరిష్టాలను తాకిన బంగారంపై పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకోవడం, రిస్క్ ఆస్తులైన ఈక్విటీల వైపు తిరిగి రావడంతో గోల్డ్ రేటు గణనీయంగా తగ్గుతోంది.
అమెరికాలో అంచనాలకంటే తక్కువగా వచ్చిన ద్రవ్యోల్బణం డేటా నేపథ్యంలో, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు పెరిగాయి. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం వంటి లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ట్రంప్ – షీ జిన్‌పింగ్ సమావేశం ద్వారా అమెరికా, చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు తగ్గితే బంగారం ధరలు పడొచ్చు. బ్లూమ్ బర్గ్ రిపోర్టు ప్రకారం.. బంగారం ఆధారిత ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల నుంచి భారీగా ఫండ్స్ విత్ డ్రా జరుగుతోంది.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలలో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ. 1,25,620 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,15,150 వద్ద కొనసాగుతుంది. ఇక కిలో వెండి రేటు రూ. 1,70,000 వద్ద కొనసాగుతుంది.