Gold: షాకింగ్‌.. బంగారం కొంటున్నారా? ధర 10 గ్రాములకు రూ.లక్షకు పెరిగే ఛాన్స్‌.. ఎలాగంటే?

ఈ అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల దృష్టిని మరింత ఆకర్షిస్తున్నాయి.

పసిడి ధరలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు ఇకపై కూడా తగ్గే ప్రసక్తేలేదని, అవి పెరుగుతూనే ఉంటాయని విశ్లేషకులు అంటున్నారు. దేశంలో బుధవారం బంగారం ధరలుఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 10 గ్రాములకు రూ.90,000 దాటాయి.

అంతర్జాతీయంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ వాణిజ్యంలో ప్రస్తుతం ఏర్పడిన అనిశ్చితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య విధాన నిర్ణయాలపై మార్కెట్లో నెలకొన్న అంచనాల వల్ల పసిడి ధరలు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా మిడిల్‌ ఈస్ట్‌లో భౌగోళిక రాజకీయ పరిస్థితి పసిడి మార్కెట్‌ను బాగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితులు పెరిగేకొద్దీ పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే పసిడిని పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తిగా భావిస్తారు.

బంగారం ధరల పెరుగుదలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్, కరెన్సీ హెడ్‌ అనుజ్ గుప్తా మాట్లాడుతూ పలు వివరాలు తెలిపారు. గత ఐదేళ్లుగా ధరల తీరును విశ్లేషించి పసిడి రేట్ల పెరుగుదలపై పలు అంశాలు తెలిపారు. రేట్ల పెరుగుదల వెనుక డిమాండ్ ప్రధాన కారణమని అన్నారు. చైనా, భారత్‌ సహా ప్రపంచంలోని అనేక దేశాల కేంద్ర బ్యాంకులు ప్రపంచ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి.

బంగారంపై మారిన ఆలోచనా విధానం
బంగారంపై ప్రజలకు ఉన్న ఆలోచనా విధానం చాలా మారిపోయిందని  గుప్తా తెలిపారు. దేశంలో ప్రజలు బంగారాన్ని సాంప్రదాయ ఆభరణాల కోసం అధికంగా వాడేవారు. ఇప్పుడు ముఖ్యమైన పెట్టుబడి సాధనంగా దాన్ని చూస్తున్నారని అన్నారు. ఇప్పుడు పెట్టుబడిదారులు బంగారాన్ని ఆభరణాలుగా కాకుండా పెట్టుబడిగా తీసుకుంటున్నారని, దీంతో బంగారు కడ్డీలకు, బంగారు నాణేలకు భారీగా డిమాండ్ ఉందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని అన్నారు. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్‌) ధరలు 10 గ్రాములకు రూ.88,350గా, అంతర్జాతీయంగా స్పాట్ ధరలు ఔన్సుకు $3,012గా ఉన్నాయని తెలిపారు. మూడు నెలల క్రితం ఇది $2,600-$2,700 మధ్య ఉందని, ఇప్పుడు $2,900-$3,000 పరిధిలో ఉందని తెలిపారు.

బంగారం 10 గ్రాములకు రూ.లక్షకు చేరుకునే అవకాశం ఉందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల దృష్టిని మరింత ఆకర్షిస్తున్నాయి. మార్కెట్ డైనమిక్స్‌ను వారు నిశితంగా గమనిస్తున్నారు. బంగారం ధర 10 గ్రాములకు రూ.లక్షకు పెరిగే అవకాశాలు లేకపోలేదని అనుజ్ గుప్తా కూడా అన్నారు.

సమీప భవిష్యత్తులో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో బంగారం ధరలు ప్రస్తుత ఆర్థిక ఏడాది చివరి నాటికి 10 గ్రాములకు రూ.90,700-రూ. 91,000 మధ్యం ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్లోబల్‌ మార్కెట్లో అదే కాలంలో బంగారం ఔన్సుకు $3,200కు చేరుకుంటాయని భావిస్తున్నారు.