జొమాటో, స్విగ్గి, బ్లింకిట్‌లో ఆర్డర్లు చేస్తున్నారా? త్వరలోనే షాకింగ్ న్యూస్!
ఆ కంపెనీలు కొత్త జీఎస్టీ ప్రభావం వల్ల తలెత్తే ఆదాయ నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులపై భారం మోపే అవకాశం ఉందని తెలుస్తోంది.

e-commerce delivery: భారత ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలు స్విగ్గి, జొమాటో, బ్లింకిట్‌తో పాటు ఇతర కంపెనీలు సెప్టెంబర్ 22 నుంచి డెలివరీ సేవలపై 18% జీఎస్టీ చెల్లించాలి. ఇటీవలే జీఎస్టీ రేట్లలో భారీ సంస్కరణలను తీసుకొస్తూ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ-కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలు డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని ఆమె ప్రకటించారు. సెప్టెంబర్ 3న జరిగిన 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ప్రకటన చేశారు.
ఇప్పటి వరకు మినహాయింపు పొందిన ఈ డెలివరీ ఛార్జీలపై ఇప్పుడు పన్ను విధించడం వల్ల ఆయా ప్లాట్‌ఫాంలు డెలివరీ ఫీజు లేదా ప్లాట్‌ఫాం ఛార్జీలను పెంచితే వినియోగదారులపై భారం పడే అవకాశం ఉంది.
Also Read: 15 ఏళ్ల వయసులో మరణించిన బాలుడికి సెయింట్ హోదా
కంపెనీలు ఏం చేయబోతున్నాయి?
వివిధ మీడియా కథనాల ప్రకారం.. కంపెనీలు కొత్త జీఎస్టీ ప్రభావం వల్ల తలెత్తే ఆదాయ నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. ఆ నష్టాన్ని తగ్గించుకునేందుకు వినియోగదారులపై భారం మోపే అవకాశం ఉందని తెలుస్తోంది.
పరిశ్రమ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. డెలివరీ ఛార్జీలు ఈ కంపెనీల ప్రధాన కార్యకలాపాలలో భాగం కావడంతో కొత్త పన్ను ప్రత్యక్షంగా ప్రభావం చూపుతుంది. అయితే వాల్యూ యాడెడ్ సర్వీసులు వాడుతున్న వినియోగదారులపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.
ఒక ఫుడ్ డెలివరీ కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ.. “కస్టమర్లపై ఈ భారాన్ని మోపక తప్పదు. అందువల్ల డెలివరీ ఫీజు పెరగవచ్చు లేదా డెలివరీ భాగస్వాముల ఆదాయం తగ్గవచ్చు. ఫుడ్ ధర కూడా పెరగవచ్చు” అని తెలిపారు.
వినియోగదారులు ఎంత చెల్లించాలి?
కంపెనీలు జీఎస్టీ భారాన్ని వినియోగదారులపై మోపితే, వారు హోం డెలివరీ సమయంలో అదనంగా పన్ను చెల్లించాలి. ఉదాహరణకు ఒక వినియోగదారులు రూ.500 విలువైన ఫుడ్ ఆర్డర్ చేస్తే, ఇప్పటికే రెస్టారెంట్ జీఎస్టీగా రూ.88, దాదాపు రూ.15 ప్లాట్‌ఫాం ఫీజు (జీఎస్టీ సహా), ప్యాకింగ్ ఛార్జీలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు డెలివరీ సేవలపై 18% జీఎస్టీని కంపెనీలు వినియోగదారులపై మోపితే అదనంగా పన్ను చెల్లించాల్సి వస్తుంది.
జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు ఏమిటి?
జీఎస్టీ కౌన్సిల్ “లోకల్ డెలివరీ సర్వీసులు” (స్థానిక డెలివరీ సేవలు)ను ఎలక్ట్రానిక్ కామర్స్ ఆపరేటర్ ద్వారా అందించినప్పుడు దాన్ని సీజీఎస్టీ చట్టంలోని 9(5) సెక్షన్‌లో చేర్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇంతకుముందు దీనికి మినహాయింపు ఉండేది.
దాంతో ఈ సేవలపై 18% జీఎస్టీ ఉంటుంది. దీన్ని కంపెనీ చెల్లించాల్సి ఉంటుంది. ఆ కంపెనీలు వినియోగదారులపై భారం మోపుతాయా? అనే అంశం త్వరలోనే తేలనుంది.