×
Ad

Home Insurance Guide : హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఫస్ట్ ఈ 5 విషయాలు తప్పక చదవండి.. లేదంటే భారీగా నష్టపోతారు..!

Home Insurance Guide : మీ ఇంటికి హోం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? బీమా కొనుగోలు చేసే ముందు ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి తప్పక తెలుసుకోండి.

Home Insurance Guide

Home Insurance Guide : కొత్త ఇల్లు కొన్నారా? హోం లోన్ తీసుకున్నారా? అలాగే మీ ఇంటి కోసం ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నారా? లేదంటే ఇప్పుడే తీసుకోండి. మీరు హోం ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కొన్ని విషయాల పట్ల తప్పక అవగాహన ఉండాలి. లేదంటే ఏదైనా అనుకోని నష్టం వాటిల్లినప్పుడు మీ ఇంటి వాల్యూ విషయంలో భారీగా నష్టపోతారు. ప్రతి వ్యక్తికి ఇల్లు అత్యంత విలువైన ఆస్తి. ప్రతి ఒక్కరూ తమ ఇంటివిషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న ప్రమాదాలు, దొంగతనాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించడానికి గృహ బీమా పొందడం చాలా అవసరమని భావిస్తున్నారు.

ఊహించని సంఘటన జరిగినప్పుడు మీ ఇల్లు, వస్తువులకు కలిగే నష్టాన్ని ఈ బీమా తీరుస్తుంది. అయితే, చాలామంది తరచుగా పాలసీని కొనుగోలు చేసేందుకు తొందరపడతారు. కానీ, పాలసీ నిబంధనలు, షరతులను జాగ్రత్తగా చదవరు. ఫలితంగా క్లెయిమ్ దాఖలు చేసే సమయంలో రిజెక్ట్ అయిందని ఆందోళన చెందుతారు.

కొన్నిసార్లు, కంపెనీ క్లెయిమ్‌ను తిరస్కరిస్తుంది. లేదంటే ప్రాసెస్ మరింత ఆలస్యమవుతుంది. చివరికి మీ ఇంటి వాల్యూకు తగిన మొత్తాన్ని పొందలేరు. మీరు హోం ఇన్సూరెన్స్ తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ముందుగా ఈ 5 ముఖ్యమైన విషయాల గురించి పూర్తిగా తెలుసుకోండి.

1. పాలసీ కవరేజీని అర్థం చేసుకోండి :
చాలామంది ప్రీమియం చూసి పాలసీని కొనుగోలు చేస్తారు. కానీ, అది అన్ని గృహ నష్టాలను కవర్ చేయదని తర్వాతే తెలుసుకుంటారు. కొన్ని పాలసీలు నిర్మాణాన్ని మాత్రమే కవర్ చేస్తాయి. మరికొన్నింటిలో ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు, వరదలు, భూకంపం లేదా అగ్నిప్రమాదం వంటి ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఆ ప్రమాదానికి మీకు కవరేజ్ ఉంటేనే క్లెయిమ్ అవుతుంది. పాలసీని కొనుగోలు చేసే ముందు కవరేజ్ జాబితాను జాగ్రత్తగా చదవండి. మీ అవసరాలకు బాగా సరిపోయే ఆప్షన్ ఎంచుకోండి.

2. తక్కువ వాల్యూతో ఇన్సూరెన్స్ చేయొద్దు :
చాలా మంది డబ్బు ఆదా చేసేందుకు తక్కువ మొత్తంలో వాల్యూతో తమ ఇళ్లకు ఇన్సూరెన్స్ చేసుకుంటారు. అయితే, నష్టం భారీగా ఉన్నప్పుడు వారికి పూర్తి క్లెయిమ్ అందకపోవచ్చు. ఉదాహరణకు.. మీ ఇంటి వాల్యూ రూ. 50 లక్షలు అయితే.. మీరు 25 లక్షలుగా మాత్రమే ఇన్సూరెన్స్ చేస్తే.. భారీగా నష్టం జరిగినా కంపెనీ కేవలం ఈ మొత్తాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. కాబట్టి, ఎల్లప్పుడూ మీ ఇంటిని అందులోని వస్తువులకు సరైన విలువను లెక్కించి ఆ తర్వాతే ఇన్సూరెన్స్ చేయండి.

3. పాలసీ నిబంధనల మినహాయింపు :

ప్రతి పాలసీలో కొన్ని షరతులు మినహాయింపులు ఉంటాయి. అంటే.. క్లెయిమ్ అనేది కొన్ని పరిస్థితుల్లో వర్తించదు. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం కావాలని ఇంటిని నష్టపరచడం, పాత నిర్మాణాల బలహీనత వల్ల కలిగే ప్రమాదాలు లేదా యుద్ధం లాంటి పరిస్థితులు వంటివి. చాలావరకు పాలసీలకు నగలు లేదా విలువైన వస్తువులకు ప్రత్యేక కవరేజ్ అవసరం. ఇలాంటి మినహాయింపులకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ముందుగా పాలసీలో అందించే డాక్యుమెంట్ జాగ్రత్తగా చదవండి.

Read Also : WhatsApp New Rule : షాకింగ్ న్యూస్.. వాట్సాప్, టెలిగ్రామ్ ఇకపై సిమ్ కార్డ్ లేకుండా పనిచేయవు.. ప్రభుత్వం కొత్త రూల్ ఇదిగో..!

4. మీ ప్రీమియంను సకాలంలో చెల్లించాలి :
చాలా మంది హోం ఇన్సూరెన్స్ పాలసీలను కొనుగోలు చేస్తారు. కానీ, సకాలంలో ఆయా ప్రీమియంలు చెల్లించరు. దాంతో పాలసీ గడువు కూడా ముగిసిపోతుంది. తద్వారా క్లెయిమ్ చేసుకునే హక్కును కోల్పోతారు. కొన్ని కంపెనీలు గ్రేస్ పీరియడ్‌ను అందిస్తాయి. కానీ, ఆ తర్వాత పాలసీ ఆటోమాటిక్‌గా రద్దు అవుతుంది. కాబట్టి, సకాలంలో ప్రీమియంలు చెల్లించడం లేదా ఆటో-పేమెంట్‌ వాడేందుకు మీ ఫోన్‌లో రిమైండర్‌ను సెట్ చేయండి.

5. సరైన వివరాలను ఇవ్వాలి :
హోం ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేసే సమయంలో తప్పుడు సమాచారాన్ని అందిస్తే క్లెయిమ్‌లు రిజెక్ట్ అవ్వొచ్చు. ఉదాహరణకు.. మీ ఇంటి అసలైన వాల్యూను దాచడం, ముందస్తుగా ఇంటికి కలిగిన నష్టాన్ని వెల్లడించకపోవడం లేదా కవరేజ్ గురించి తప్పుడు సమాచారాన్ని అందించడం వంటివి అసలు చేయొద్దు. ఎందుకంటే హోం ఇన్సూరెన్స్ అందించే కంపెనీలు వీటి గురించి లోతుగా దర్యాప్తు చేస్తాయి. ఆ సమయంలో మీరు ఇచ్చింది తప్పుడు సమాచారమని తేలితే మీ క్లెయిమ్‌లను తిరస్కరించవచ్చు.

ఇతర పాలసీలతో కంపేర్ చేసి తీసుకోండి :
ప్రస్తుత రోజుల్లో ప్రీమియం, కవరేజ్ పరంగా వివిధ కంపెనీల పాలసీలను కంపేర్ చేసేందుకు అనేక ఆన్‌లైన్ పోర్టల్‌లు ఉన్నాయి. మీకు ఏ పాలసీలో ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చెక్ చేసిన తర్వాత తీసుకోవచ్చు. మీ ఇంటి కోసం హోం ఇన్సూరెన్స్ కొనుగోలు చేసే ముందు కవరేజ్, నిబంధనలు, ప్రీమియంలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. చిన్న నిర్లక్ష్యం కూడా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, తెలివిగా పాలసీని ఎంచుకుని మీ ప్రీమియంలను సకాలంలో చెల్లించండి.