×
Ad

సంచలనం.. ఎలాన్‌ మస్క్‌కు రూ.88 లక్షల కోట్ల వేతన ప్యాకేజీకి ఓకే.. టెస్లా షేర్‌హోల్డర్లు ఎలా ఒప్పుకున్నారు? అమితానందంతో మస్క్ డ్యాన్స్‌..

మస్క్‌కు ఇప్పటికే టెస్లాలో 15 శాతం వాటా ఉంది. షేర్‌హోల్డర్లు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే కంపెనీని వదిలిపెడతానని మస్క్‌ హెచ్చరించారు.

Elon Musk

Elon Musk: టెస్లా షేర్‌హోల్డర్లు తమ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎలాన్‌ మస్క్‌కు గరిష్ఠంగా 1 ట్రిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.88 లక్షల కోట్లు) విలువైన షేర్‌ ప్యాకేజీని ఆమోదించారు. ఇది కార్పొరేట్‌ చరిత్రలో అతి పెద్ద వేతన ఒప్పందం.

ఈ ప్రణాళికను గురువారం కంపెనీ వార్షిక సమావేశంలో ప్రకటించారు. టెస్లా బోర్డు దీనిని “పే ఫర్ పర్ఫార్మెన్స్‌”గా పేర్కొంది. అంటే పనితీరుకు అనుగుణంగా ఇచ్చే వేతన విధానం. ఈ ప్రకటన రాగానే మస్క్‌ ఆనందంలో రోబోతో కలిసి స్టేజీపై డ్యాన్స్‌ చేశారు. (Elon Musk)

ఈ ఒప్పంద ఉద్దేశం టెస్లా ఎలక్ట్రిక్ వాహనాల ఆధిపత్యాన్ని విస్తరించడం, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రోబోటిక్స్‌లో పురోగతిని వేగవంతం చేయడం. మస్క్‌ టెస్లాను సాధారణ కార్ల కంపెనీగా కాకుండా ఆటోనమస్‌ సిస్టమ్స్‌, రోబోటాక్సీలు, హ్యూమనాయిడ్‌ రోబోట్లు తయారుచేసే సంస్థగా తీర్చిదిద్దారు.

Also Read: భారత్‌ పర్యటనకు ట్రంప్‌.. మోదీపై ప్రశంసల వర్షం.. ఇక రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లను..

ఈ ఒప్పందం ఎలా సాధ్యమైంది?

మస్క్‌కు ఇప్పటికే టెస్లాలో 15 శాతం వాటా ఉంది. షేర్‌హోల్డర్లు ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తే కంపెనీని వదిలిపెడతానని మస్క్‌ హెచ్చరించారు. “రోబోట్‌ ఆర్మీ” ప్రాజెక్టుపై కంట్రోల్‌ కలిగి ఉండాలనే ఆకాంక్షను మస్క్‌ వ్యక్తం చేశారు. “ఎలాన్‌ మస్క్‌తో 11 సంవత్సరాలుగా పని చేసిన అనుభవంతో చెబుతున్నాను. ఇతరులు చేయలేని పనిని చేయడమే ఆయన ప్రత్యేకత” అని టెస్లా చైర్‌వుమన్ రాబిన్‌ డెన్హోమ్‌ అన్నారు.

కొత్త ప్యాకేజీ ప్రకారం.. మస్క్‌ వచ్చే దశాబ్దంలో పలు అంబిషస్‌ పనితీరు లక్ష్యాలను సాధిస్తే కంపెనీలో 25 శాతం వరకు వాటాను పొందుతారు.

వేతన పథకం ఎలా ఉంటుంది?

వేతన ప్రణాళికను 12 భాగాలుగా విభజించారు. ప్రతి భాగం మార్కెట్‌ విలువ లక్ష్యాలు, కార్యకలాపాల లక్ష్యాలతో అనుసంధానమై ఉంటుంది. మొదటి భాగం టెస్లా మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (కంపెనీ మొత్తం మార్కెట్‌ విలువ) 1.5 ట్రిలియన్‌ డాలర్ల నుంచి 2 ట్రిలియన్‌ డాలర్లకు చేరితే, 11.5 మిలియన్‌ కొత్త వాహనాల విక్రయ లక్ష్యంతో పూర్తవుతుంది.

ఇంకా కఠినమైన లక్ష్యాలు ఉన్నాయి. ఒక మిలియన్‌ హ్యూమనాయిడ్‌ రోబోట్ల విక్రయం, 400 బిలియన్‌ డాలర్ల అడ్జెస్టెడ్‌ ఈబిట్డా (Ebitda) సాధించడం వంటివి ఉన్నాయి. ఈబిట్డా అంటే వడ్డీ, పన్నులు, తగ్గింపులు మినహా ఆపరేటింగ్‌ లాభం. గత సంవత్సరం టెస్లా ఈబిట్డా 16 బిలియన్‌ డాలర్లు. అన్ని లక్ష్యాలు నెరవేరితే, టెస్లా మార్కెట్‌ విలువ 8.5 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది.