భారత్ పర్యటనకు ట్రంప్.. మోదీపై ప్రశంసల వర్షం.. ఇక రష్యా నుంచి ఇండియా చమురు కొనుగోళ్లను..
వచ్చే సంవత్సరం భారత్‌కు వెళ్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ ‘‘ఆ అవకాశం ఉంది’’ అని సమాధానమిచ్చారు.
Trump: భారత ప్రధాని నరేంద్ర మోదీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి అని, మంచి స్నేహితుడని ట్రంప్ అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సత్సంబంధాలను బలపరచే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే సంవత్సరం భారత్‌ను సందర్శించే సూచన ఇచ్చారు.
బరువు తగ్గించే ఔషధాల ధరలు తగ్గించేందుకు కొత్త ఒప్పందాన్ని ప్రకటించిన తర్వాత వైట్ హౌస్‌లో ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘మోదీతో నా చర్చలు అద్భుతంగా సాగుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను మోదీ క్రమంగా తగ్గిస్తున్నారు. ఆయన నా స్నేహితుడు. మేము మాట్లాడుకుంటున్నాము. ఆయన నన్ను భారత్‌కు రావాలని కోరుతున్నారు. దాన్ని పరిశీలిస్తాము.. నేను వెళ్తాను’’ అని ట్రంప్ అన్నారు. వచ్చే సంవత్సరం భారత్‌కు వెళ్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ ‘‘ఆ అవకాశం ఉంది’’ అని సమాధానమిచ్చారు.
ట్రంప్ ఈ ఏడాది జరిగే క్వాడ్ సమ్మిట్ కోసం భారత్ రావాల్సి ఉండగా.. ఇండియాపై అమెరికా భారీ సుంకాలు విధించిన తర్వాత ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు న్యూయార్క్ టైమ్స్ ఆగస్టులో పేర్కొంది.
‘‘నోబెల్ ప్రైజ్ అండ్ ఎ టెస్టీ ఫోన్ కాల్: హౌ ది ట్రంప్-మోదీ రిలేషన్‌షిప్ అన్రావెల్డ్’’ అనే శీర్షికతో వచ్చిన ఆ కథనం ప్రకారం.. ట్రంప్ తొలుత సమ్మిట్‌కు హాజరవుతానని మోదీకి హామీ ఇచ్చినా, ఆ ప్రణాళిక తర్వాత రద్దు అయ్యింది.
రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను కొనసాగించడంతో అమెరికా 50 శాతం సుంకం, అదనంగా 25 శాతం పన్నులు విధించడంతో దీనిపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నారని అమెరికా అధికారులు తెలిపారు. ‘‘భారత్-అమెరికా సత్సంబంధాలను కొనసాగించడంపై ట్రంప్ సానుకూలంగా ఉన్నారు. కొన్ని వారాల క్రితం ఆయన ఓవల్ ఆఫీస్‌లో అనేకమంది ఇండియన్-అమెరికన్ అధికారులతో దీపావళి జరుపుకున్నారు. ఆ సందర్భంలో ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడారు’’ అని అన్నారు.
ఇటీవలి ఆసియా పర్యటనలోనూ ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు గణనీయంగా తగ్గించింది’’ అని పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తామని లేదా నిలిపేస్తామని మోదీ హామీ ఇచ్చారని చెప్పారు.
