Monsoon Safety Tips : వర్షాకాలంలో జాగ్రత్త! కారు, బైక్ స్కిడ్ కాకుండా ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోండి!
Monsoon Safety Tips : వర్షాకాలంలో కారు లేదా బైకు జారిపోకుండా ఉండేందుకు టైరు గ్రిప్ అనేది చాలా కీలకం.. టైర్లు కొనేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి..
- Sreehari A
- Published on- June 14, 2026 / 08:01 PM IST
Monsoon Safety Tips
- వర్షాకాలంలో కారు టైర్లు జారే ప్రమాదాలు ఎక్కువ
- కార్ల టైర్లను ఎంచుకోవడంలో ఈ తప్పులు చేయొద్దు
- కార్ల టైర్ గ్రిప్, సరైన సైజు కూడా చాలా కీలకం
Monsoon Safety Tips : వర్షాలు కురుస్తున్నాయి.. వాహనాలపై వెళ్లేవారు జర జాగ్రత్త.. కారు లేదా బైకు ఏదైనా వర్షాలు కురిసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే.. వర్షపు నీటితో రోడ్లన్నీ నిండిపోతాయి.
నీరు నిలవడం కారణంగా మీ కారు లేదా బైకు టైర్లు జారిపోయి ప్రమాదాలకు దారితీయొచ్చు. అదే మీరు సరైన టైర్లను ఎంచుకుంటే నీటి కారణంగా టైర్లు పట్టు కోల్పోకుండా నివారిస్తాయి. అందుకే కొత్త టైర్లను కొనేటప్పుడు కేవలం బ్రాండ్ ధరనే కాదు.. కొన్ని టెక్నికల్ ఫీచర్లను కూడా చూడాలి.
వర్షాకాలంలో రోడ్లు నీరు నిలిచిపోయి కారు టైర్లు జారే ప్రమాదం ఉంటుంది. ప్రతి ఏడాదిలో తడి రోడ్లపై వాహనాలు జారిపోవడం, రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఈ సమస్యకు సరైన టైర్లు ఎంచుకోవడమే పరిష్కారం.
కొత్త టైర్లను కొనే సమయంలో కేవలం బ్రాండ్ లేదా ధర మాత్రమే కాకుండా వర్షంలో గ్రిప్ అందించే టైర్లను ఎంచుకోవడం ఎంతైనా మంచిది. ఈ ట్రిక్స్ పాటించడం ద్వారా ప్రమాదాల రిస్క్ తగ్గడమే కాదు.. టైర్ల లైఫ్ టైమ్ కూడా పెరుగుతుంది. వర్షాకాలంలో మీ కారుకు మంచి గ్రిప్, హై సెక్యూరిటీని అందించే 3 కీలక అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. ట్రెడ్ మోడల్ కీలకం :
మీ టైర్ల ట్రెడ్ మోడల్ కూడా చాలా కీలకం. వర్షపు నీటిని వెంటనే బయటకు పంపేలా వెడల్పుగా, లోతుగా ఉండే గాడుల టైర్లనే ఎంచుకోండి. దాంతో వర్షపు నీటిని పక్కకు మళ్లిస్తాయి. ట్రెడ్ లోతు కనీసం 4 నుంచి 5 మిల్లీమీటర్లు ఉండాలి. అరిగిపోయిన ట్రెడ్ పాత టైర్లు, రోడ్డుకు, టైరుకు మధ్య నీళ్లు ఉండేలా చేస్తాయి. దాంతో టైరు పట్టు కోల్పోతుంది. తడి రోడ్లపై కూడా పట్టును అందించే ప్రత్యేకంగా తయారైన టైర్లనే వాడాలి.
Read Also : E20 Fuel : పాత కార్లకు E20 ఫ్యూయల్ రిస్క్.. ఇలా చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్!
2. టైర్ల గ్రిప్ రేటింగ్, రబ్బరు క్వాలిటీ :
టైర్ లేబుళ్లపై తడి పట్టును సాధారణంగా A నుంచి G వరకు రేటింగ్ ఇస్తారు. A లేదా B రేటింగ్ ఉండే టైర్లు వర్షంలో కూడా పెద్దగా జారవు. సిలికాతో కలిపిన రబ్బరు కాంపౌండ్‌తో టైర్లు, తడి పరిస్థితులలో కూడా గట్టి పట్టును అందిస్తాయి. చౌకైన టైర్లలో వాడే సాధారణ రబ్బరు కూడా చల్లని, తడి వాతావరణంలో గట్టిపడుతుంది. అందుకే తడి పరిస్థితులకు ప్రత్యేకంగా టెస్టింగ్ చేసిన బ్రాండెడ్ టైర్లనే ఎప్పుడూ ఎంచుకోవాలి.
3. సరైన టైర్ సైజు, స్పీడ్ రేటింగ్ :
తప్పుడు సైజు టైర్లను మీ వాహనానికి ఎప్పుడూ అమర్చొద్దు. తద్వారా వాహన సామర్థ్యం దెబ్బతింటుంది. మీ కారు మాన్యువల్‌లో లేదా ప్రస్తుత టైర్ సైడ్‌వాల్ కనిపించే సైజును మాత్రమే ఎంచుకోండి. ఉదాహరణకు.. 205/55 R16 లేదా స్పీడ్ రేటింగ్ (V, W, Y) లోడ్ ఇండెక్స్ ఉంటాయి. మీ కారు బరువు వేగానికి తగినట్లుగా టైర్లు ఇలా ఉండాలి. సరైన టైర్లు ఉంటే వర్షంలో కూడా సడన్ బ్రేక్ వేసినా జారకుండా ఉంటాయి.
ఈ 3 విషయాలను గుర్తించుకోవాలి. టైర్లు కొనేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాహనం నడపవచ్చు. టైర్ ప్రెజర్‌ను రెగ్యులర్ చెక్ చేస్తుండాలి. అవసరమైతే మార్చడమే బెటర్. సేఫ్ డ్రైవింగ్ కోసం మంచి టైర్లు ఎంత అవసరమో వాహనం నడిపేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.
