E20 Fuel : పాత కార్లకు E20 ఫ్యూయల్ రిస్క్.. ఇలా చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్!
E20 Fuel : 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్‌తో కూడిన ఇంధనమైన E20 కారణంగా పాత వాహనాల్లోని ఇంజన్ పాడైపోయి ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రిజెక్ట్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుందని ఐసీఐసీఐ లోంబార్డ్ హెచ్చరించింది.
E20 fuel use in older
- పాత కార్లలో E20 ఫ్యూయిల్ వాడకంతో బీమా క్లెయిమ్ కాదా?
- ఈ ఇథనాల్ ఇంధనానికి వాహనాల్లో వాడితే ఇంజిన్ దెబ్బతింటుందా?
- ఈ20 వాడకంపై వాహనాల ఓనర్లకు ఐసీఐసీఐ లోంబార్డ్ హెచ్చరిక
E20 Fuel : మీ ఇంట్లో పాత కారు లేదా బైకు ఉందా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీ వాహనాల్లో E20 ఇథనాలు వాడితే అంతే సంగతులు.. బండ్లు షెడ్ కు వెళ్లడం ఖాయమే.. ఎందుకంటే.. ఈ20 ఇంధనం అనేది కొత్తగా తయారైన వాహనాల్లోని ఇంజన్లకు తగినట్టుగా ఉంటుంది.. కానీ, పాత వాహనాల ఇంజిన్ టెక్నాలజీ అందుకు తగినట్టుగా డిజైన్ చేయలేదు.
ఇలాంటి వాహనాల్లో ఈ20 ఫ్యూయిల్ వాడటం వల్ల ఇంజిన్ దెబ్బతినడంతో పాటు ఆ వాహనంపై (E20 Fuel) ఉన్న బీమా సంబంధిత క్లెయిమ్స్ కూడా తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటోంది ఐసీఐసీఐ లోంబార్డ్ సంస్థ.
వాహనదారులు తమ పాత వాహనం ఈ20 ఇంధనానికి అనుకూలంగా లేకుంటే వాడకపోవడమే బెటర్ అని సూచిస్తోంది. వాహనదారులకు ఈ సంస్థ ఇంకా ఏం సూచనలు చేసిందో ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం..
ఐసీఐసీఐ లోంబార్డ్ వార్నింగ్ :
దేశంలో వాహనాల్లో ఈ20 ఇంధనం వినియోగంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. E20 ఇంధనం అనేది (80శాతం పెట్రోల్ + 20శాతం ఇథనాల్) కలిసి ఉంటుంది. ఇలాంటి ఇంధనాన్ని
వాడితే పాత కార్ల ఓనర్లకు పెద్ద సమస్యగా మారడం ఖాయమని ఐసీఐసీఐ లోంబార్డ్ హెచ్చరించింది.
ఏప్రిల్ 2023కి ముందు తయారై మార్కెట్లోకి వచ్చిన పలు వాహనాల్లో ఈ E20 ఫ్యూయిల్ వాడితే అది యజమానుల నిర్లక్ష్యంగానే పరిగణించే అవకాశం ఉందని, ఆయా వాహనాలకు ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు కూడా తిరస్కరించే అవకాశం ఉందని లోంబార్డ్ హెచ్చరించింది.
పాత వాహనాలకే ముప్పు :
పాత కార్లు, బైకుల్లో ఈ20 ఇంధనాన్ని వాడితే కాలక్రమేణా రబ్బరు సీల్స్ దెబ్బతింటాయి.. ఫ్యూయల్ లైన్లు కూడా క్షీణిస్తాయి. ఇంజిన్ భాగాల్లో తుప్పు సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని ఐసీఐసీఐ లోంబార్డ్ సంస్థ తెలిపింది. అయితే, ఈ ఇంజిన్ నష్టం అనేది వెంటనే బయటకు కనిపించకపోయినా నెమ్మదిగా పెరుగుతూ పెద్ద మొత్తంలో రిపేర్లకు దారితీస్తుందని సంస్థ హెచ్చరించింది.
ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై ఎఫెక్ట్ :
సాధారణ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీల్లో పర్యవసాన నష్టం అనేది సాధారణంగా కవర్ అవుతుందని ఐసీఐసీఐ లోంబార్డ్ పేర్కొంది. అంటే.. ఎలాంటి వాహన ప్రమాదం కాకుండా కాలక్రమేణా తలెత్తే నష్టాలకు క్లెయిమ్ కష్టమే. పైగా ఇంజిన్ ప్రొటెక్షన్ యాడ్-ఆన్లు కూడా ఈ తరహా కెమికల్ ఇంజిన్ నష్టాన్ని పూర్తిగా కవర్ చేయవు.
ఈ సూచనలు చాలా కీలకం :
మీ వెహికల్ ఏదైనా E20 ఇంధనానికి సరిపోతుందా? లేదా అనేది తప్పక చెక్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ముందుగానే మాన్యువల్ లేదంటే డీలర్ ద్వారా తప్పనిసరిగా తెలుసుకోవాలి. పాత వాహనాల్లో ఇలాంటి ఇంధనం వాడితే ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం ఎక్కువని తెలిసి కూడా అలాంటి వాహనాల్లో E20 వాడితే తయారీదారు వారంటీతో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా తిరస్కరించే అవకాశం ఉంది.
వెహికల్ ఓనర్ల అనుభవాలివే :
చాలామంది కారు ఓనర్లకు ఇలాంటి అనుభవాలే ఎదురయ్యాయి. అందులో చాలావరకూ స్పార్క్ ప్లగ్ సమస్యలు, ఇంజిన్ వార్నింగ్ లైట్లు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ టర్బో పెట్రోల్ వాడకం ద్వారా పాత ఇంజిన్ వాహనాల్లో అధికంగా సమస్యలు తలెత్తుతున్నాయని వాహన నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.
చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే.. E20 ఫ్యూయిల్ పర్యావరణానికి మేలే అయినా మీ పాత వాహనాల విషయంలో జాగ్రత్త పడకపోతే ఇంజిన్ నష్టంతో పాటు ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమస్యలు ఎదుర్కొక తప్పదు.
