కరోనా విరాళం : రూ.100 కోట్ల నగదు…2 కోట్ల సబ్బులు ఫ్రీ ..డిస్కాంట్ ధరలకే అమ్మకాలు

  • Publish Date - March 21, 2020 / 02:24 PM IST

లైఫ్ బాయ్ సబ్బుల తయారీ కంపెనీ  హిందుస్తాన్ యూనీ లివర్ లిమిటెడ్  కోవిడ్-19 వైరస్ వ్యతిరేక పోరాటంలో తన వంతుగా రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అలాగే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించే శానిటైజర్లు, సబ్బులను తక్కువ ధరకే అందిస్తున్నట్లు తెలిపింది. వ్యక్తిగత, గృహ పరిశుభ్రతకు ఉపయోగించే ఉత్పత్తులను తక్కువ ధరలకే అందించనున్నామని వెల్లడించింది. 

ప్రజలందరికీ ఉపయోగపడేలా​ ముఖ్యంగా లైఫ్‌బాయ్‌ శానిటైజర్‌, లిక్విడ్ హ్యాండ్ వాష్, డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్‌ల ధరలను 15 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపింది. తగ్గించిన ఈ ధరల ఉత్పత్తుల ఉత్పత్తిని వెంటనే ప్రారంభిస్తున్నామనీ, ఇవి రాబోయే కొద్ది వారాల్లో మార్కెట్లో లభిస్తాయని సంస్ధ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు రానున్న నెలల్లో దేశవ్యాప్తంగా 2 కోట్ల లైఫ్ బాయ్ స‌బ్బుల‌ను ఉచితంగా పంపిణీ చేస్తామ‌ని హెచ్‌యుఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా తెలిపారు. 

లైఫ్‌బాయ్ శానిటైజర్స్, లైఫ్‌బాయ్ హ్యాండ్ వాష్ లిక్విడ్,  డోమెక్స్ ఫ్లోర్ క్లీనర్‌ల ఉత్పత్తిని కూడా వేగవంతం చేశామనీ, రాబోయే వారాల్లో దీనిని మరింత పెంచడానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఇలాంటి సంక్షోభ సమయంలో తమలాంటి కంపెనీలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందనీ, ప్రపంచ ఆరోగ్య విపత్తును అధిగమించేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. పరీక్షా కేంద్రాలు, ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అప్‌గ్రేడ్ చేయడానికి రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్టు చెప్పారు. 

మ‌రోవైపు స‌బ్బుల త‌యారీకి అవ‌స‌రం అయ్యే ముడిస‌రుకుల ధ‌ర‌లు పెరిగినా స‌బ్బుల ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తున్న‌ట్లు  పలు సంస్థలు ప్రకటించాయి. ప‌తంజ‌లి, గోద్రెజ్ త‌దిత‌ర సంస్థ‌లు కూడా త‌మ స‌బ్బుల ధ‌ర‌ల‌ను 12.5 శాతం వ‌ర‌కు త‌గ్గిస్తున్న‌ట్లు తెలిపాయి.