×
Ad

Income Tax Rule 2026 : ఇన్‌కమ్ టాక్స్ కొత్త రూల్స్.. ఇక జీతం పొందేవారికి పండగే..

Income Tax Rule 2026 : ఆదాయపు పన్ను నియమం 2026 కింద జీతం పొందే వ్యక్తులకు భారీ ఉపశమనం లభించనుంది. HRA, అలవెన్సులలో ప్రధాన ప్రయోజనాలు దక్కనున్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..

  • Published On : February 14, 2026 / 05:49 PM IST

Income Tax Rule 2026 ( Image Credit : AI)

  • టాక్స్ పేయర్లు, సాధారణ ప్రజలకు బిగ్ అలర్ట్
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 అమల్లోకి
  • పన్ను దాఖలు ప్రక్రియ మరింత ఈజీ కానుంది
  • ఆదాయపు పన్ను నియమాలు 2026 ముసాయిదా కూడా విడుదల 

Income Tax Rule 2026 : టాక్స్ పేయర్లు, నెలవారీ జీతం పొందే ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. కొత్త ఆదాయపు పన్ను చట్టం రాబోతుంది. ఇకపై పన్ను చెల్లించే విషయంలో టెన్షన్ అక్కర్లేదు. పన్ను విధానం మరింత పారదర్శకంగా మారనుంది. ఇందులో భాగంగానే కేంద్రం ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 రూపొందించింది. ఈ చట్టం ఏప్రిల్ 1, 2026 నుంచి అందుబాటులోకి రానుంది.

ఇప్పటికే ఆదాయపు పన్ను నియమాలు 2026 ముసాయిదా కూడా విడుదల అయింది. ఫిబ్రవరి 22, 2026 వరకు దీనిపై పన్నుచెల్లింపుదారులు, సాధారణ ప్రజలందరూ తమ అభిప్రాయాలను తెలపవచ్చు. ఈ మార్పులతో పన్ను దాఖలు ప్రక్రియ మరింత ఈజీ కానుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పాత భత్య పరిమితులను కూడా కేంద్రం అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా జీతం పొందేవారికి బిగ్ రిలీఫ్ ఉండొచ్చు.

పన్ను దాఖలు ప్రక్రియ ఇక ఈజీ :
కొత్త నిబంధనల ప్రకారం.. పన్ను రిటర్న్ ఫారమ్‌ ప్రాసెస్ యూజర్ ఫ్రెండ్లీ కానుంది. ప్రాథమిక సమాచారం ఇక డిఫాల్ట్ కానుంది. ఒకసారి డేటాను ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇక ప్రతిసారి అదే డేటాను ఎంటర్ చేయాల్సిన పనిలేదు.

ఫిల్ చేసిన డేటా ఆధారంగా పన్ను దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇకపై పన్ను దాఖలు సమయంలో లోపాలు ఉండవు. దాంతో సమయం కూడా ఆదా అవుతుంది. సాధారణ పన్ను చెల్లింపుదారులు సులభంగా అర్థం చేసుకునేలా ఫారమ్‌ లాంగ్వేజీ ఉంటుంది.

పాత, కొత్త పన్ను రెండూ వర్తిస్తాయి :

కొత్త పన్ను వ్యవస్థలో పాత, కొత్త పన్ను విధానాలు రెండూ వర్తిస్తాయి. పాత పన్ను విధానంలో పెరిగిన మినహాయింపులు, డిడక్షన్లు ఇప్పటికీ పన్ను చెల్లింపుదారులకు ముఖ్యంగా పెద్ద భత్యాలు లేదా పెట్టుబడి ఆధారిత మినహాయింపులు ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి. మరోవైపు, కొత్త పన్ను విధానంలో తక్కువ పన్ను రేట్లు ఉన్నాయి. కానీ, మినహాయింపులు ఇకపై అందుబాటులో ఉండవు.

గిఫ్ట్స్, వోచర్ల పన్ను మినహాయింపులపై ఉపశమనం :
యజమాని నుంచి పొందే బహుమతులు, వోచర్లు లేదా టోకెన్లపై పన్ను మినహాయింపు పరిమితిని సంవత్సరానికి రూ. 15వేలకు పెంచారు. గతంలో, ఈ పరిమితి రూ. 5వేలు మాత్రమే. ఇక ఉద్యోగులు పొందే చిన్నపాటి ప్రయోజనాలపై కూడా పన్ను భారాన్ని తగ్గిస్తుంది.

Read Also : Valentine Week 2026 : వాలెంటైన్స్ డే సేల్.. మీ లైఫ్ పార్టనర్ కోసం రూ. 30వేల లోపు టాప్ 5 కెమెరా ఫోన్లు.. ఈ ఫోన్ గిఫ్ట్ ఇవ్వండి!

HRA నియమాలలో ప్రధాన మార్పులివే :
ఇంటి అద్దె భత్యం (HRA)లో భారీగా మార్పులు ఉండనున్నాయి. గతంలో, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రమే జీతంలో 50 శాతం వరకు HRA మినహాయింపు ఉండేది. ఇప్పుడు, ఈ ప్రయోజనం బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ వంటి అభివృద్ధి చెందుతున్న నగరాలకు విస్తరించారు. ఇతర నగరాల్లో కూడా 40 శాతం పరిమితి కొనసాగుతుంది.

ఆహార భత్యం, ఆఫీసు సౌకర్యాలపై ఉపశమనం :
ఆఫీసు సమయాల్లో అందించే ఉచిత ఆహారం, ఆల్కహాల్ లేని పానీయాలపై పన్ను రహిత పరిమితిని భోజనానికి రూ. 50 నుంచి రూ.200కి పెంచారు. కార్పొరేట్ ఉద్యోగులకు రోజువారీ ఖర్చులపై భారీ ఉపశమనం లభిస్తుంది.

కంపెనీ కార్లపై పన్ను విలువలో మార్పు :
కంపెనీ కారును ఉపయోగించే వారికి పన్ను విలువ కూడా మారుతుంది. చిన్న ఇంజిన్ కార్లకు కొత్తగా విలువ నెలకు రూ. 5వేలు పెరుగుతుంది. డ్రైవర్ కూడా ఉంటే అదనపు వాల్యూ పెరుగుతుంది. పెద్ద కార్లకు ఈ విలువ పెరిగింది.

పిల్లల విద్య, హాస్టల్ అలవెన్సులలో భారీగా పెరుగుదల :
పిల్లల విద్యా భత్యాన్ని ఒక్కొక్కరికి నెలకు రూ. 3వేలకు పెంచారు. హాస్టల్ భత్యాన్ని ఒక్కొక్కరికి నెలకు రూ.9వేలకు పెంచారు. ఇంకా, యజమాని అందించే విద్యా సౌకర్యాలపై పన్ను రహిత పరిమితిని కూడా పెంచారు.

వైద్య ఖర్చులపై బిగ్ రిలీఫ్ :
తీవ్రమైన అనారోగ్యాల చికిత్స కోసం కంపెనీ నుంచి తీసుకునే రుణాలపై పన్ను రహిత పరిమితిని రూ. 2 లక్షలకు పెంచారు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

మధ్యతరగతికి ఉపశమనం :
ద్రవ్యోల్బణం ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా పాత భత్యాల అసలు విలువను పునరుద్ధరించడమే ఈ పన్ను మార్పుల లక్ష్యం. జీతం పొందే మధ్యతరగతి ఉద్యోగులకు ముఖ్యంగా పన్ను ఆదా ద్వారా ప్రయోజనం కలుగుతుంది. అలాగే, సులభమైన పన్ను దాఖలు ప్రక్రియ కూడా పన్ను సమ్మతి (టాక్స్ కంపైలెన్స్)ని మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.