India Can Emerge As Green Energy Export Hub In Next 20 Years, Says Ril Chairman Mukesh Ambani
Mukesh Ambani : వచ్చే 20 ఏళ్లలో భారత్ గ్రీన్ ఎనర్జీకి ఎగుమతి కేంద్రంగా మారనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. వ్యవస్థాపక స్ఫూర్తి, ప్రభుత్వ విధానాలు, ఫైనాన్సింగ్ ఎంపికల లభ్యత ద్వారా భారత్ గ్రీన్ ఎనర్జీ ఎగుమతి కేంద్రంగా, సూపర్ పవర్‌గా ఎదగగలదని ముఖేష్ అంబానీ తెలిపారు. ఆసియా ఎకనామిక్ డైలాగ్ 2022లో అంబానీ మాట్లాడుతూ.. భారత క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ రంగం రాబోయే 20 ఏళ్లలో అర ట్రిలియన్ డాలర్ల ఎగుమతి చేయగలదని భావిస్తున్నట్టు తెలిపారు. అప్పటిలోగా 500 బిలియన్ డాలర్ల విలువతో స్వచ్ఛ ఇంధన ఎగుమతుల్ని సాధిస్తుందన్నారు.
ఇదివరకే రిలయన్స్, అదానీ సహా పలు కంపెనీలు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయ్యాయి. బ్యాటరీ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటు, ఫ్యుయల్ సెల్స్ ఉత్పత్తికి ప్రణాళికలను సైతం సిద్ధం చేశాయి. డాలర్ కంటే తక్కువ ధరకు కిలో హైడ్రోజన్ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని రిలయన్స్ ఇటీవలే ప్రకటించింది. గత 20 ఏళ్లలో భారత్ ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించిందని అంబానీ అన్నారు. రాబోయే 20 ఏళ్లలో టెక్నాలజీతోనే కాదు.. ఇంధన, లైఫ్‌సైన్సెస్‌లో భారత్ సూపర్‌పవర్‌గా ఎదుగుతుందని ఆయన వెల్లడించారు. భారతదేశం గ్రీన్ ఎనర్జీకి ఎగుమతి కేంద్రంగా ఆవిర్భవించగలదని అంబానీ ఆకాంక్షించారు. ఇంధనం, సాంకేతిక రంగంలో కనీసం 20-30 కొత్త భారతీయ కంపెనీలు రానున్న 10-20 ఏళ్లలో అంత పెద్దగా కంపెనీలుగా అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నామని ఆయన చెప్పారు.
సాంప్రదాయ ఇంధనం స్థానంలో కొత్త ఇంధనం వస్తుందని చెప్పారు. దీనిద్వారా 21వ శతాబ్దంలో భౌగోళిక రాజకీయ పరివర్తనను నిర్ణయిస్తుందని అంబానీ చెప్పారు. భారత్ గ్రీన్ క్లీన్ ఎనర్జీలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా పెద్ద ఎగుమతిదారుగా మారి భారత్ ప్రపంచ శక్తిగా ఎదగడానికి సాయపడుతుందని అంబానీ అన్నారు. తద్వారా ఇంధనం ఎలక్ట్రానిక్స్ దిగుమతి బిల్లులపై విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుందని ఆయన అన్నారు. గత ఏడాదిలో RIL ప్రతిష్టాత్మకమైన క్లీన్ ఎనర్జీ ప్లాన్‌ను ప్రకటించింది. ఇందులో మూడు భాగాలను కలిగి ఉంది.
భారత్ మూడు సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని అంబానీ చెప్పారు. దేశం రెండంకెల జీడీపీ వృద్ధిని పెంచడానికి సరసమైన ధరకే ఇంధన ఉత్పత్తి పెంచాలని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాధాన్యతపై అంబానీ ప్రస్తావించారు. తమ గ్రూప్ ఒక దశాబ్దంలో హైడ్రోజన్ శక్తిని కిలోకి ఒక డాలర్ కంటే తక్కువ ధరకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం భారత్.. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతిదారుగా కొనసాగుతోంది. విద్యుత్తు కోసం ప్రధానంగా బొగ్గుపై ఆధారపడాల్సి వస్తోంది. భారత్ ఇంధన, విద్యుత్తు అవసరాలకు శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వచ్చే రెండు, మూడు దశాబ్దాల్లో ఈ శిలాజ ఇంధనాలకు పూర్తిగా స్వస్తి పలకాలని సూచించారు.
Read Also : రూ.12,500కోట్లకు అనిల్ అంబానీ సంస్థ కుచ్చుటోపీ!