Sovereign Gold Bond: లక్షకు 3లక్షలు లాభం..! సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్ కొన్నవారికి జాక్ పాట్..!

ఇటీవల బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో లక్ష మార్క్ కు చేరిన తరుణంలో సావరిన్ బాండ్ల కొనుగోలుదారుల పంట పండిందని చెప్పాలి.

Sovereign Gold Bond Scheme

Sovereign Gold Bond: లక్ష రూపాయలకు 3 లక్షలు లాభం.. ఏంటి.. షాక్ అయ్యారు కదూ. అవును.. సావరిన్ గోల్డ్ బాండ్స్ కొనుగోలు చేసిన వారు జాక్ పాట్ కొట్టారు. వారి పంట పండిందని చెప్పాలి. 8ఏళ్ల క్రితం సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొన్న వారు ఊహించని రీతిలో భారీ లాభం పొందనున్నారు. 2017 మే లో జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్ల సిరీస్ మెచ్యూరిటీకి చేరుకోవడంతో ఆర్బీఐ వాటి రిడెంప్షన్ ధరను, తేదీని తాజాగా ప్రకటించింది. అప్పట్లో పెట్టుబడి పెట్టిన వారు ప్రస్తుత బంగారం ధరల ప్రకారం దాదాపు మూడింతలు ప్రాఫిట్ పొందనున్నారు. అంటే అప్పట్లో లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టిన వారు 3 లక్షలు పొందనున్నారు. అదనంగా వడ్డీ లభించనుంది.

అసలు ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ అంటే ఏమిటి, ఎవరు తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు అనే వివరాల్లోకి వెళితే.. 2015 నవంబర్‌లో ఆర్బీఐ ఈ స్కీమ్ తెచ్చింది. దేశంలో భౌతిక బంగారంపై ఆధార పడటాన్ని తగ్గింగే లక్ష్యంతో దీన్ని ప్రవేశపెట్టారు. ఈ బాండ్స్ కాలపరిమితి ఎనిమిదేళ్లు. ఇందులో భాగంగా 2017 మే లో 2017-18 సిరీస్‌ 1 పసిడి బాండ్లను జారీ చేశారు.

ఆ సమయంలో 999 స్వచ్ఛత కలిగిన గ్రాము బంగారం ధరను రూ.2,951గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసినోళ్లకు 50 రూపాయలు తగ్గింపు కూడా ఇచ్చారు. 2015-16 బడ్జెట్‌లో తీసుకొచ్చిన ఈ పథకం కింద కేంద్రం తరఫున ఆర్బీఐ ఈ బాండ్లను జారీ చేసింది. చివరిసారిగా 2024 ఫిబ్రవరి 12-16 మధ్య సబ్‌స్క్రిప్షన్‌కు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఈ బాండ్లను జారీ చేయలేదు. ఖజానాకు భారం కావడంతో ఈ బాండ్ల జారీని ప్రభుత్వం నిలిపివేసింది.

Also Read: ఈ ప్రభుత్వ పథకంలో కేవలం రూ. 1000 పెట్టుబడితో రూ. 2.3 కోట్లు సంపాదన.. ప్రతినెలా లక్ష పెన్షన్ పొందొచ్చు.. ఇదిగో ఇలా..!

నాడు జారీ చేసిన బాండ్లకు మెచ్యూరిటీ ధరను ఆర్బీఐ ప్రకటించింది. గ్రాము ధర రూ.9,486. అంటే అప్పట్లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌ చేసిన వారికి ఇప్పుడు దాదాపు రూ.3 లక్షలు లాభమన్న మాట. దీనికి గోల్డ్‌ బాండ్లపై ఇచ్చే ఇంట్రస్ట్ అదనం. ఏటా 2.5 శాతం నామమాత్ర వడ్డీని బాండ్ల కొనుగోలుపై ఆర్బీఐ చెల్లిస్తుంది.

సావరిన్ గోల్డ్ బాండ్ల రెడింప్షన్ ధరను నిర్ణయించడానికి ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరిస్తారు. గ్రాము ధర నిర్ణయించేందుకు రిడెంప్షన్‌కు ముందు వారం 999 స్వచ్ఛత కలిగిన బంగారానికి ఇండియా బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ నిర్ణయించిన సగటు ధరను పరిగణనలోకి తీసుకుంటారు. అలా గ్రాము ధరను రూ.9486గా నిర్ణయించారు. ఏప్రిల్‌ 28- మే 2 మధ్య ధరల సగటు ఆధారంగా గ్రాము ధరను నిర్ణయించారు. ఇటీవల గోల్డ్ ధర లక్ష మార్కు దాటిన వేళ పసిడి బాండ్లు రిడెంప్షన్‌కు రావడం అప్పటి ఇన్వెస్టర్లకు గోల్డెన్‌ ఛాన్స్‌ అనే చెప్పాలి. పైగా ఈ బాండ్ల మెచ్చూరిటీ ద్వారా పొందే లాభంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు.

సావరిన్ గోల్డ్ బాండ్ ​​హోల్డర్ అందుకున్న మెచ్యూరిటీ మొత్తంపై పన్ను మినహాయింపు పొందుతాడు. 50 గ్రాముల బంగారం పొందడానికి రూ. 2,951 ఇష్యూ ధర ఆధారంగా రూ. 1,47,550 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. మెచ్యూరిటీ సమయంలో రూ.9,486 తుది ధర ఆధారంగా రూ. 4,74,300 లభిస్తుంది. రూ.3,26,750 పన్ను రహిత లాభాలను పొందుతారు.