Gold: పసిడి కొంటున్నారా? ధరలు పెరుగుతుండడంతో మీ కోసం బంగారం వ్యాపారులు ఏం చేస్తున్నారో తెలుసా?

గోల్డ్ జ్యుయెలరీ కంపెనీ ఆదాయంలో 60% వివాహాలకు సంబంధించిన కొనుగోళ్ల నుంచే వస్తుందని కేరళలోని కల్యాణ్ జ్యుయెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణ రామన్ అన్నారు.

Gold

ఆర్థిక నిపుణులు కూడా ఊహించని విధంగా ఈ 2025వ సంవత్సరంలో బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో రాజకీయ అస్థిరత వల్ల అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెంచిన సుంకాలు వల్ల పెట్టుబడిదారులు బంగారం లాంటి సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది స్టాక్ మార్కెట్ క్షీణతకు లోనైంది. ఫిబ్రవరిలో బంగారం ధరలు దాదాపు రూ88,000కు చేరుకున్నాయి.

బంగారం ధరలు పెరిగినప్పుడు వినియోగదారులు కొంతకాలం కొనుగోళ్లను వాయిదా వేసుకుంటారు. అయితే, వివాహాల సమయంలో మాత్రం బంగారం కొనుగోలు చేయాల్సిందే. గోల్డ్ జ్యుయెలరీ కంపెనీ ఆదాయంలో 60% వివాహాలకు సంబంధించిన కొనుగోళ్ల నుంచే వస్తుందని కేరళలోని కల్యాణ్ జువెలర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమేశ్ కల్యాణ రామన్ అన్నారు.

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో మూడుసార్లు ధర పెరిగింది. అలాగే గత ఏడాది 2024లో బంగారం ధర 26% పెరిగింది. దేశీయ డిమాండ్ 5% పెరిగింది. అయితే ఆభరణాల కొనుగోలు 2% తగ్గింది. ధరల పెరుగుదల కారణంగా వినియోగదారులు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేస్తున్నారని కల్యాణ రామన్ అన్నారు.

డబ్బుల వర్షం కురుస్తుందని బంగారంలో ఈ రూపంలో పెట్టుబడుల వరద.. వరల్డ్‌ గోల్డ్ కౌన్సిల్‌ ఏమందో తెలుసా? 

22 క్యారెట్ బంగారానికి బదులుగా 18 క్యారెట్ బంగారం
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, జ్యుయెలర్లు తమ బిజినెస్ వ్యూహాలను మార్చుకుంటున్నారు. కల్యాణ్ జ్యుయెలర్స్ 22 క్యారెట్ బంగారానికి బదులుగా 18 క్యారెట్ బంగారం ఆభరణాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని రమేశ్ వివరించారు.

అదే విధంగా, డైమండ్ ఆభరణాలలో సాధారణంగా 18 క్యారెట్ బంగారం వాడతారు. కానీ, ఇప్పుడు 14 క్యారెట్ డైమండ్ ఆభరణాలను తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.

“బంగారం ధరలు పెరిగినప్పటికీ ప్రజలు 22 క్యారెట్ల కన్నా తక్కువ క్యారెట్ల బంగారాన్ని కొనడంలో ఎలాంటి మార్పు లేదు. ఇతర జ్యుయెలరీ కంపెనీలు కూడా తక్కువ బరువున్న ఆభరణాలను అందుబాటులోకి తెస్తున్నాయి. ప్రధానంగా యువత తక్కువ బరువున్న, రోస్ గోల్డ్, వైట్ గోల్డ్ ఆభరణాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే 2029 నాటికి 18 క్యారెట్ బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది” అని పి.ఎన్. గడ్గిల్ జ్యెయెలర్స్ ఎండీ సౌరభ్ గడ్గిల్ కూడా తెలిపారు.

బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ తగ్గేదేలే అంటూ యువత తక్కువ నాణ్యత ఉండే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారని వివిధ జ్యుయెలర్స్ సంస్థల అధినేతలు చెబుతున్నారు.