ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ద్వారా లోన్ తీసుకునేవారికి శుభవార్త. ఇకపై 75 ఏళ్ల వయస్సు వచ్చేవరకు మీరు హోమ్‌లోన్ ఈఎంఐలు చెల్లించవచ్చు. ఈ మేరకు ఇండియా మార్ట్‌గేజ్ గ్యారెంటీ కార్పొరేషన్(IMGC)తో ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ స్పెషల్ లోన్ స్కీమ్‌లో ఇంటి రుణం తీసుకునేవాళ్లు 75 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఈఎంఐలను చెల్లించవచ్చు.
ప్రస్తుతం గరిష్టంగా 60 ఏళ్ల వయస్సు వరకు మాత్రమే ఈఎంఐలను చెల్లించుకునే అవకాశం ఉండగా ఇప్పడు ఆ నిబందనలను సంస్థ పక్కనబెట్టింది. ఏ వయస్సులో హోమ్ లోన్ తీసుకున్నా 60 ఏళ్లకే లెక్కించి టెన్యూర్ నిర్ణయిస్తుంటారు. కానీ ఈ కొత్త స్కీమ్‌లో లోన్ తీసుకునేవాళ్లు 75 ఏళ్ల వయస్సు వచ్చే వరకు వాయిదాలు చెల్లించుకునే అవకాశం ఉంది.
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్ తాజాగా ఒప్పందం కారణంగా.. అర్హతా ప్రమాణాలను పెంచడం, రీపేమెంట్ కాలవ్యవధిని పొడిగించడం, వర్క్ ప్రొఫైల్, వర్క్ ప్లేస్, క్రెడిట్ హిస్టరీతో తిరస్కరించిన దరఖాస్తుదారుల ప్రొఫైల్స్‌లో ఆంక్షల్ని సడలించడం కోసం ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. చిన్నతరహా పరిశ్రమలు, మధ్యతరహా పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులు, చిరు వ్యాపారులు, స్వయం ఉపాధి పొందుతున్నవారికి ఈ పథకం ఉపయోగపడుతుందని ఎల్ఐసీ భావిస్తోంది. ఈ ఒప్పందంతో కాలవ్యవధి పెరగడంతో పాటు లోన్ మంజూరయ్యే మొత్తం కూడా పెరుగుతుంది.