×
Ad

పడిపోయిన గోల్డ్‌, సిల్వర్‌ ధరలు.. బులియన్‌ మార్కెట్‌లో ఎందుకీ పరిస్థితి తలెత్తింది? ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ప్రపంచవ్యాప్తంగా లాభాల స్వీకరణ, రిస్క్ భావన కారణంగా బులియన్ మార్కెట్లో ఈ పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెప్పారు.

Gold, Silver (Image Credit To Original Source)

  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన పెట్టుబడిదారులు
  • 15% లోయర్ సర్క్యూట్‌ను తాకిన వెండి ధరలు
  • 10% వరకు పడిపోయిన బంగారం ధరలు

MCX Silver prices: భారత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్‌ బులియన్ కాంప్లెక్స్‌లో తీవ్ర ఎగుడుదిగుడు పరిణామాలు చోటుచేసుకున్నాయి. శుక్రవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో వెండి ఫ్యూచర్లు గరిష్ఠంగా 15% వరకు పడిపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బంగారం కాంట్రాక్టులు దాదాపు 10% క్షీణించాయి.

ఇటీవలి కాలంలో బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో జరిగిన భారీ ర్యాలీ తర్వాత ట్రేడర్లు లాభాల స్వీకరణ వైపే మొగ్గు చూపడంతో ఈ అమ్మకాల ఒత్తిడి ఏర్పడింది. మార్కెట్ డేటా ప్రకారం.. బులియన్ విభాగంతో పాటు బేస్ మెటల్స్‌లో కూడా తీవ్ర అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

Also Read: సమయం ఆసన్నమైంది.. “గగన్‌యాన్‌” జీ1 మిషన్‌లో ఏం చేస్తారు? రోబోను పంపి.. అన్నింటికంటే ముఖ్యం ఏంటో చెప్పిన ఇస్రో  

బంగారం, వెండి ధరలు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్ర వరకు మొత్తం తీవ్ర ఊగిసలాటకు లోనై చివరికి స్వల్ప స్థిరీకరణకు వచ్చాయి. ఇది కమోడిటీ మార్కెట్లో పెరిగిన అస్థిరతను సూచిస్తుంది. బంగారం ధరలు 10 గ్రాములకు రికార్డు స్థాయిలో ఇప్పటికే రూ.1.75 లక్షలు దాటాయి. వెండి ధరలు కిలోకు రూ.4 లక్షలకు పైగా చేరాయి.

పెట్టుబడిదారులు ఏం చేయాలి?
విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రపంచ ద్రవ్య విధాన సంకేతాలు, అమెరికా రాజకీయ పరిణామాలు, రిస్క్ ఉంటుందన్న భావన మీద ఆధారపడి తదుపరి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడైతే అస్థిరత కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కోటక్ సెక్యూరిటీస్ కమోడిటీ రీసెర్చ్ సహాయ ఉపాధ్యక్షురాలు కైనత్ చైన్‌వాలా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా లాభాల స్వీకరణ, రిస్క్ భావన కారణంగా బులియన్ మార్కెట్లో ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. లాభాల స్వీకరణతో బంగారం ఔన్సుకు 5,100 డాలర్లకు చేరింది. వెండి ఔన్సుకు 108 డాలర్లుగా ఉంది.

ట్రేడింగ్ సెషన్ తీవ్ర అస్థిరతతో కొనసాగిందని ఆమె తెలిపారు. ఇంట్రాడే కనిష్ఠాల నుంచి తిరిగి కోలుకుని బంగారం ఔన్సుకు 5,375 డాలర్ల వద్ద, వెండి ఔన్సుకు 115.7 డాలర్ల వద్ద ముగిశాయని చెప్పారు.

అయితే తదుపరి సెషన్‌లో మళ్లీ అమ్మకాల ఒత్తిడి పెరిగింది. లాభాల స్వీకరణ కారణంగా బంగారం ఔన్సుకు 5,100 డాలర్ల దిగువకు వచ్చింది. వెండి ఔన్సుకు 105 డాలర్ల దిగువకు పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ద్రవ్యోల్బణంపై కఠిన వైఖరితో ఉన్న కెవిన్ వార్ష్‌ను ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా నియమించబోతున్నారన్న వార్తలు కూడా ఈ పతనానికి కారణమయ్యాయి.