Mentha Cyclone
Mentha Cyclone: మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, తెలంగాణలోనూ మొంథా తుపాను ప్రభావం చూపుతోంది. ఈ తుపాను కారణంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలుసైతం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత తుపానుగా బలపడింది. మంగళవారం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆ తరువాత మంగళవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో కాకినాడ సమీపంలో తీవ్ర తుపానుగా తీరందాటుతుందని ఐఎండీ అంచనా వేసింది. తుపాను కారణంగా ఏపీతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
తుపాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం, బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. పలు ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవాళ (మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కుమురం భీం ఆసిపాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, ఖమ్మం, వరంగల్, హనుమకొండతోపాటు మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.
బుధవారం అదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడనున్నాయి.
ఇక శాటిలైట్ అంచనాల ప్రకారం.. తెలంగాణలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో ముసురు ఉండే అవకాశం ఉంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.