Reliance Intelligence
Reliance Intelligence: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ శుక్రవారం రిలయన్స్ ఇంటెలిజెన్స్‌ను ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. ఇది దేశానికి నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అందిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ బూమ్ మధ్య ఇండియా నుంచి ముకేశ్ అంబానీ ఇటువంటి ప్రకటన చేయడం గమనార్హం.
“రిలయన్స్ ఇంటెలిజెన్స్ గిగావాట్ (విద్యుత్ శక్తిని కొలిచే ప్రమాణం) స్థాయి ఏఐ-రెడీ డేటా సెంటర్లను నిర్మిస్తుంది. వీటికి గ్రీన్ ఎనర్జీతో విద్యుత్ సరఫరా ఉంటుంది. గుజరాత్‌లో జామ్‌నగర్‌లో డేటా సెంటర్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైంది” అని ముకేశ్ అంబానీ అన్నారు. డేటా సెంటర్ అంటే డేటాను నిల్వ, ప్రాసెస్, పంపిణీ చేసే సదుపాయాలు. (Reliance Intelligence)
రిలయన్స్ ఇంటెలిజెన్స్ పేరిట సొంత ఏఐ సబ్సిడియరీని ఏర్పాటు చేయాలన్న కంపెనీ ప్రణాళికల్లో నాలుగు అజెండాలు ఉంటాయని ముకేశ్ అంబానీ తెలిపారు.
నెక్స్ట్ జనరేషన్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణం: సబ్సిడియరీ గిగావాట్ స్థాయి ఏఐ డేటా సెంటర్లను నిర్మిస్తుంది. “జామ్‌నగర్‌లో గిగావాట్ స్థాయి ఏఐ రెడీ డేటా సెంటర్లపై ఇప్పటికే వర్క్ ప్రారంభమైంది.
గ్లోబల్ భాగస్వామ్యాలు: ప్రపంచంలోని ఉత్తమ టెక్ కంపెనీలు ఏఐపై కలిసి పనిచేసేలా చేయడం
ఏఐ సేవలు: భారత్ కేంద్రీకృత ఏఐ సేవలు అందిస్తుంది. వినియోగదారులు, చిన్న వ్యాపారాలు, ఎంటర్‌ప్రైజులకు సులభంగా వాడదగిన ఏఐ సేవలు అందించడమే లక్ష్యం. అదనంగా విద్య, హెల్త్‌కేర్, వ్యవసాయం వంటి జాతీయ ప్రాముఖ్యత గల రంగాలకు పరిష్కారాలు అందిస్తుంది.
టాలెంట్: ప్రపంచ స్థాయి పరిశోధకులు, ఇంజనీర్లు, డిజైనర్లకు స్థావరంగా మారి ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చడం లక్ష్యం.
గూగుల్‌తో రిలయన్స్ భాగస్వామ్యం అవుతుందని ముకేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. తమ ఎనర్జీ, రిటైల్, టెలికాం, ఫైనాన్షియల్ సర్వీసులను ఏఐతో ట్రాన్స్‌ఫాం చేయనున్నట్టు ప్రకటించారు.
ఈ ఏఐ సపోర్టు కోసం ఇరు కంపెనీలు జామ్‌నగర్ క్లౌడ్ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఇది గూగుల్ క్లౌడ్ నుంచి ప్రపంచస్థాయి ఏఐ కంప్యూట్‌ను తీసుకువస్తుందని తెలిపారు. ఇది రిలయన్స్ క్లీన్ ఎనర్జీతో నడుస్తుందని అన్నారు. జియో అధునాతన నెట్‌వర్క్‌తో అనుసంధానమై ఉంటుందని తెలిపారు.
భారత్ కేంద్రీకృత ఏఐ జాయింట్ వెంచర్‌ను మెటాతో కలిసి ఏర్పాటు చేస్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఇది ఎంటర్‌ప్రైజ్-రెడీ సొల్యూషన్లు అందిస్తుంది. జాయింట్ వెంచర్ అంటే రెండు కంపెనీలు కలిసి ఏర్పాటు చేసే బిజినెస్.