Starlink Internet
Starlink Internet : భారత్‌కు ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ వచ్చేస్తోంది.. అమెరికన్ బిలియనీర్ ఎలన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్ భారత మార్కెట్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసుల ప్రారంభానికి ప్రభుత్వ ఆమోదం పొందింది. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) కంపెనీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) జారీ చేసింది.
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. జాతీయ భద్రతకు సంబంధించిన అన్ని అవసరమైన లైసెన్స్ షరతులను పాటించడానికి స్టార్‌లింక్ అంగీకరించింది. ఇండియన్ స్పేస్ అథారిటీ (IN-SPACe) నుంచి తుది ఆమోదం రావాల్సి ఉంది.
ఈ ఆమోదంతో స్టార్‌లింక్ ఇప్పుడు భారత శాటిలైట్ ఇంటర్నెట్ రంగంలో యూటెల్‌సాట్-వన్‌వెబ్, జియో-ఎస్ఇఎస్ వంటి సంస్థల జాబితాలో చేరింది. ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసును అందించేందుకు మస్క్ స్టార్‌లింక్ శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది.
స్టార్‌లింక్ అంటే ఏమిటి?
ఎలన్ మస్క్ స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేసిన స్టార్‌లింక్.. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా తక్కువ ఇంటర్నెట్ సర్వీసులను అందించే ప్రాంతాలలో హై-స్పీడ్ కనెక్టివిటీని అందించేందుకు రూపొందించిన శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసు.
గత నెలలో, వాణిజ్యం, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్, దేశంలోని స్టార్‌లింక్ కంపెనీ పెట్టుబడి ప్రణాళికలను చర్చించేందుకు స్టార్‌లింక్ ఉన్నతాధికారులతో ఒక సమావేశం కూడా నిర్వహించారు.
దేశంలో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను అందించడానికి వోడాఫోన్ ఐడియా స్టార్‌లింక్‌తో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలిపారు.
దేశంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శాటిలైట్ ఇంటర్నెట్ అవసరమని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా పేర్కొన్నారు.
జియో, ఎయిర్‌టెల్‌తో స్టార్‌లింక్ భాగస్వామ్యం :
ఇటీవల స్టార్‌లింక్ భారత మార్కెట్లో నెట్‌వర్క్ విస్తరణ కోసం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌లతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడమే లక్ష్యం.
కేంద్ర ప్రభుత్వం ఒక రోజు ముందు శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల భద్రతా ప్రమాణాలను కఠినతరం చేసిన సమయంలోనే ఈ ఆమోదం లభించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. డేటా స్థానికీకరణ, గేట్‌వే సేఫ్టీ క్లియరెన్స్, స్థానిక తయారీ అవసరాలను తప్పనిసరి చేసింది.
సాంప్రదాయ ఫైబర్-ఆప్టిక్ నెట్‌వర్క్‌లు, మొబైల్ టవర్‌లను ఏర్పాటు చేయడం చాలా కష్టం. భారత్‌లో దాదాపు 100 కోట్ల మంది టెలికాం వినియోగదారులు ఉన్నారు. కానీ, అనేక గ్రామీణ ప్రాంతాలకు ఇప్పటికీ సరైన ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదు. 25Mbps, 220Mbps మధ్య వేగాన్ని అందించే స్టార్‌లింక్ శాటిలైట్ ఆధారిత సర్వీసుతో కనెక్టివిటీ మరింత పెంచుతుంది.
భారత్‌లో స్టార్‌లింక్ ధర (అంచనా) :
స్టార్‌లింక్ భారత్‌లో నెట్‌వర్క్ సర్వీసు ధరను ఇంకా ప్రకటించలేదు. 2022లో, మొదటి సంవత్సరం రూ. 1.58 లక్షలు ఖర్చు ఉంటుందని కంపెనీ అంచనా వేసింది. రెండో సంవత్సరం నుంచి రూ. 1.15 లక్షలకు తగ్గింది. కెన్యాలో ఈ సేవకు నెలకు 10 డాలర్లు ఖర్చవుతుంది. అమెరికాలో ఈ నెట్‌వర్క్ ధర నెలకు 120 డాలర్లు ఉంటుంది. భూటాన్‌లో స్టార్‌లింక్ హోం నెట్‌వర్క్ ప్లాన్లు నెలకు రూ.3వేల నుంచి రూ.4,200 వరకు ఉంటాయి.
అమెజాన్‌కు ఇంకా అనుమతి రాలేదు :
మరో అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త జెఫ్ బెజోస్ యాజమాన్యంలోని అమెజాన్ కూడా భారత మార్కెట్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సర్వీసులను ప్రారంభించాలని భావిస్తోంది.
ప్రాజెక్ట్ కైపర్ ఇంకా LoIని అందుకోలేదు. కానీ, ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. త్వరలో అనుమతి కూడా లభించే అవకాశం ఉంది. ట్రాయ్ త్వరలో శాటిలైట్ స్పెక్ట్రం ధరలపై సిఫార్సులను కూడా సమర్పించనుంది.