New LPG Cylinder Rules : మే 1 నుంచి ఎల్పీజీ కొత్త రూల్స్.. .. ఇక OTP చెబితేనే సిలిండర్ డెలివరీ.. బుకింగ్ గ్యాప్, ధరల్లో మార్పులు!

New LPG Cylinder Rules : మే 1నుంచి ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ బుకింగ్, ధరల్లో భారీగా మార్పులు రానున్నాయి. ఓటీపీ లేకుండా డెలివరీ కాదు. బుకింగ్ గ్యాప్ కూడా తప్పనిసరి.

New LPG Cylinder Rules

  • మే 1నుంచి మారనున్న ఎల్పీజీ సిలిండర్ నిబంధనలు
  • ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ రూల్స్ ఇవే
  • ఓటీపీ చెబితేనే గ్యాస్ సిలిండర్ డెలివరీ
  • ఎల్పీజీ ఖాతాకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ లింక్ తప్పనిసరి

New LPG Cylinder Rules : ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. గ్యాస్ బుకింగ్‌కు సంబంధించి కొత్త మార్పులు మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం.. ఓటీపీ ఆధారిత డెలివరీ తప్పనిసరి అవుతుంది.

Also Read : LPG Gas Price : బిగ్ షాక్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఒక్కో సిలిండర్‌పై ఎంతంటే.. వారికి మాత్రం ఊరట..

ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఈ-కేవైసీని కూడా తప్పనిసరి చేశారు. అంతేకాదు.. ప్రపంచ ఉద్రిక్తతల కారణంగా ఎల్పీజీ ధరలు పెరిగిన నేపథ్యంలో మే నెల నుంచి మరిన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ నిబంధనలకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఇండేన్), భారత్ పెట్రోలియం (భారత్ గ్యాస్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పీ గ్యాస్) వంటి చమురు కంపెనీలు మే 1 నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనున్నారు.

కొత్త నిబంధనల ప్రకారం.. ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకునే మధ్య సమయం పొడిగించే అవకాశం ఉంది. నగరాల్లో, కొత్త సిలిండర్‌ను బుక్ చేసుకునేందుకు మీరు కనీసం 25 రోజులు వేచి ఉండాలి. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యవధి 45 రోజుల వరకు ఉండవచ్చు. గడువుకు ముందే ఎవరైనా బుక్ చేసుకునేందుకు ప్రయత్నిస్తే సిస్టమ్ వారిని ఆటోమేటిక్‌గా బ్లాక్ చేస్తుంది.

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న హెచ్చుతగ్గులు భారత మార్కెట్లో ఎల్‌పీజీ సిలిండర్ల ధరలపై ప్రభావం చూపాయి. ఇటీవలే 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర సుమారు రూ. 60 పెరగగా, 19 కేజీల కమర్షియల్ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, మే నెల నుంచి మరోసారి గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Read Also : 8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్‌డేట్.. మే 31 వరకు డెడ్‌లైన్ పొడిగింపు. భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు.. ఎంతంటే?

ఓటీపీ కొత్త రూల్స్ ఇవే :
అదనంగా, OTPకి సంబంధించి కూడా మార్పులు ఉండనున్నాయి. మే 1వ తేదీ నుంచి ఎల్పీజీ సిలిండర్ డెలివరీల కోసం OTP ఆధారిత వ్యవస్థను తప్పనిసరి చేశారు. వినియోగదారులు ఇకపై కేవలం తమ గ్యాస్ బుక్ లేదా రసీదు చూపించి సిలిండర్లను తీసుకోలేరు.

బుకింగ్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన OTP (డెలివరీ అథెంటికేషన్ కోడ్)ని కూడా తప్పనిసరిగా చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రకారం.. ఈ సిస్టమ్ ఇప్పటికే 94.5శాతం పైగా డెలివరీలలో అందుబాటులో ఉంది. గ్యాస్ దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ కొత్త రూల్ తీసుకొచ్చింది.

ఉజ్వల యోజనకు ఆధార్ ఈకేవైసీ తప్పనిసరి :
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు ఆధార్ ఆధారిత eKYCని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇంకా eKYC పూర్తి చేయని ఎల్పీజీ వినియోగదారులు ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి. లేకుంటే గ్యాస్ సిలిండర్లను పొందండంలో సమస్యలు రావొచ్చు. ఇంతకుముందు eKYC పూర్తి చేయని వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

చమురు సరఫరా పరిస్థితి దృష్ట్యా, ముడి చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. భారతీయ కంపెనీలు ఇప్పుడు అమెరికా నుంచి అదనపు ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటున్నాయి. జూన్, జూలై నెలల మధ్య డెలివరీలు అందవచ్చని అంచనా. దేశంలో రోజుకు సుమారు 80వేల టన్నుల ఎల్‌పీజీ అవసరం కాగా, దేశీయ ఉత్పత్తి సుమారు 46,000 టన్నులుగా ఉంది.

రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ ద్వారా ఎల్పీజీ ఖాతాకు లింక్ చేసుకోవాలి. అలాగే, కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాక ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మే 1వ తేదీ లోపు (MyLPG) పోర్టల్‌లో మీ తర్వాతి బుకింగ్ తేదీని చెక్ చేసుకోండి.