New Tax System 2026 : టాక్స్ పేయర్లకు భారీ షాక్..! కొత్త టాక్స్ చట్టం అమల్లోకి.. ప్రతి ట్రాన్సాక్షన్‌పై నిఘా.. ఇక తప్పించుకోలేరు!

New Tax System 2026 : పాన్ (PAN), ఆదాయపు పన్ను రిటర్నుల (ITR) దాఖలు, విదేశీ ఖర్చులకు సంబంధించిన నిబంధనలలో భారీగా మార్పులు వచ్చాయి. దాదాపు 65 ఏళ్ల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త 2025 ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చింది.

New Tax System

  • టాక్స్ పేయర్లకు అలర్ట్
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి
  • పాన్, క్రెడిట్ కార్డు, ITRపై కొత్త రూల్స్..
  • ఇక టాక్స్ వ్యవస్థలో భారీ మార్పులు.. కొత్త చట్టం ఎఫెక్ట్ ఇదే
  • కొత్త 2025 ఆదాయపు పన్ను చట్టం నిబంధనలు ఇవే

New Tax System 2026 : పన్నుచెల్లింపుదారులకు బిగ్ అలర్ట్.. భారత పన్నుల వ్యవస్థలో ఏప్రిల్ 1న అతిపెద్ద సంస్కరణ జరిగింది. కొత్త ఆర్థిక చట్టం అమల్లోకి వచ్చేసింది. పాన్ (PAN), ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయడం, విదేశీ ఖర్చులకు సంబంధించిన నిబంధనలలో భారీగా మార్పులు చేసింది.

దాదాపు 65 ఏళ్ల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలోకి వచ్చిన కొత్త 2025 ఆదాయపు పన్ను చట్టం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. పన్ను సంబంధిత నిబంధనలలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ యాక్ట్ 2026కు సంబంధించి కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఈ కొత్త చట్టం ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా పన్ను భాషను సులభతరం చేసింది. ఆర్థిక సంవత్సరం, అసెస్మెంట్ సంవత్సరం అనే ద్వంద్వ వ్యవస్థను తొలగించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కేవలం ‘పన్ను సంవత్సరం’ మాత్రమే పరిగణిస్తారు. అంటే.. ఆదాయం ఏ సంవత్సరంలో సంపాదించారో అదే సంవత్సరంలో దానిపై పన్ను విధిస్తారు అనమాట. అంతేకాదు.. పన్ను చెల్లించని వారి కోసం ప్రత్యేక ఫారం అవసరాన్ని కూడా రద్దు చేశారు.

కీలక మార్పులివే :

  • ఐటీఆర్ దాఖలుకు గడువులో మార్పు
  • జీతం పొందే వ్యక్తులు (ITR-1, ITR-2) గడువు తేదీ జూలై 31వ తేదీగానే ఉంటుంది.
  • పన్ను దాఖలు చేసేవారికి గడువు ఆగస్టు 31వ తేదీ.
  • ఆడిట్ కేసులలో అక్టోబర్ 31వ తేదీ అవుతుంది.

గిఫ్ట్స్, వోచర్లపై పన్ను మినహాయింపు పెంపు :
కంపెనీ గిఫ్ట్ కార్డ్‌లు, వోచర్‌లు, కూపన్‌లపై వార్షిక మినహాయింపును రూ. 5,000 నుంచి రూ. 15,000కి పెంచారు. ఈ ప్రయోజనం పాత, కొత్త పన్ను శ్లాబులు రెండింటికీ వర్తిస్తుంది.

పిల్లల భత్యంలో పెరుగుదల :
పిల్లల విద్యా భత్యాన్ని నెలకు రూ.100 నుంచి రూ.3,000కు, హాస్టల్ భత్యాన్ని నెలకు రూ.300 నుంచి రూ.9,000కు పెంచారు.

పాన్ నిబంధనలలో మార్పులు :
కేవలం ఆధార్ కార్డును ఉపయోగించి పాన్ కోసం అప్లయ్ చేయడం ఇకపై చెల్లదు. దరఖాస్తుదారులు ఇప్పుడు వివిధ కేటగిరీల కోసం ఫారమ్‌లను నింపాల్సి ఉంటుంది. వ్యక్తుల కోసం ఫారం 93, కంపెనీల కోసం ఫారం 94, విదేశీ వ్యక్తుల కోసం ఫారం 95, విదేశీ సంస్థల కోసం ఫారం 96 నింపాల్సి ఉంటుంది. ఇకపై పెద్ద మొత్తంలో లావాదేవీలకు పాన్ ఇవ్వడం తప్పనిసరి.

Read Also : Income Tax Rules : టాక్స్ పేయర్లకు బిగ్ షాక్.. పాన్ కార్డు నుంచి HRA వరకు.. ఏప్రిల్ 1 నుంచి రాబోయే కీలక మార్పులివే..!

మోటారు ప్రమాద పరిహారం :
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ (MACT) నుంచి పొందిన నష్టపరిహారంపై వచ్చే వడ్డీ ఇకపై పూర్తిగా పన్ను రహితం. ఈ వడ్డీపై ఎలాంటి టాక్స్ ఉండదు.

కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ :
అధిక క్రెడిట్ కార్డ్ ఖర్చులను ఇక బ్యాంకులు ఆదాయపు పన్ను శాఖకు రిపోర్టు చేస్తాయి. ఉదాహరణకు.. రూ. 10 లక్షలకు మించిన ఆన్‌లైన్ ఖర్చులు, రూ. లక్షకు మించిన నగదు ఖర్చులపై ఐటీ కన్నేసి ఉంచుతుంది.

ఇంటి అద్దె భత్యానికి కఠినమైన రూల్స్ :
ఇంటి అద్దె భత్యం (HRA) పొందుతున్న వారు ఇకపై కఠినమైన నిబంధనలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఫేక్ రెంట్ రసీదులను సమర్పించి పన్నులు ఎగవేయడం ఇకపై సులభం కాదు.
ఉద్యోగులు తమ ఇంటి యజమాని పాన్ నంబర్, అద్దె చెల్లింపు రుజువును అందించాలి. కొన్ని సందర్భాల్లో వారు ఇంటి యజమానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా అందించాల్సి రావచ్చు.

బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్‌లను మెట్రో నగరాల జాబితాలో చేర్చారు. ఈ నగరాలు గతంలో ఉన్న 40శాతం నుంచి 50శాతం వరకు HRA మినహాయింపును పొందుతాయి.
50శాతం వరకు హెచ్‌ఆర్‌ఏ మినహాయింపునకు అర్హత ఉన్న మెట్రో నగరాల జాబితాను విడుదల చేశారు. ఇందులో ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్ ఉన్నాయి.

మత, సామాజిక ట్రస్టుల రిజిస్ట్రేషన్ మరింత ఈజీ అయింది. లాభాపేక్ష లేని సంస్థలకు సంబంధించిన ప్రస్తుత పన్ను నిబంధనలలో కూడా మార్పులు వచ్చాయి. గతంలో, లాభాపేక్ష లేని సంస్థల పన్ను నిబంధనలు పాత చట్టంలోని 7 విభాగాలలో విస్తరించి ఉండేవి.

ఇప్పుడు, సెక్షన్ 17-బి అనే ఒకే కేటగిరీలో ఏకీకృతం చేశారు. లాభాపేక్ష లేని ట్రస్టులు తమ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవచ్చు. తాత్కాలిక రిజిస్ట్రేషన్ ఇకపై ఒక సెంట్రలైజడ్ కేంద్రం ద్వారా మంజూరు అవుతుంది. అనేక పన్ను ప్రయోజనాలను పొందలేని ట్రస్టులు తమ రిజిస్ట్రేషన్ స్వచ్ఛందంగా రద్దు చేసుకోవచ్చు.

ఆదాయపు పన్ను ఫారాలు విడుదల :
2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను ఫారాలు విడుదలయ్యాయి. ఆదాయపు పన్ను శాఖ 2026-27 అసెస్మెంట్ సంవత్సరానికి సంబంధించిన అన్ని ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫారాలను విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రిటర్న్ దాఖలు ప్రక్రియ ప్రారంభమైంది.

ఆదాయపు పన్ను శాఖ, ITR-2, 3, 5, 6, 7 లతో పాటు అప్‌డేట్ రిటర్న్‌లను దాఖలు చేయడానికి ITR-U ఫారాన్ని కూడా విడుదల చేసింది. ఎవరి ఖాతాలైతే ఆడిట్ అవసరం లేదో వారికి ITR దాఖలు చేసేందుకు చివరి గడువు జూలై 31గా నిర్ణయించింది.

ఏ ఫారమ్‌ను ఎవరు నింపాలంటే? :

ITR-1 (సహజ్) : వార్షిక ఆదాయం రూ. 50 లక్షల వరకు, జీతం, గృహ ఆస్తి, వడ్డీ లేదా వ్యవసాయ ఆదాయం నుంచి రూ.5వేల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు.

ITR-4 (సుగమ్) : రూ. 50 లక్షల వరకు ఆదాయం, వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయం ఉన్న వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (HUFs), సంస్థలు.

ITR-2: క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఆదాయం పొందే వ్యక్తులు (షేర్లు లేదా ఆస్తి నుంచి వచ్చే లాభాలు).

ITR-3: సొంత వ్యాపారాలు చేసే వ్యక్తులు.

ITR-5: LLP, సంస్థలు, సహకార సంఘాలచే దాఖలు

ITR-6 : కంపెనీల కోసం ITR-7 ట్రస్టులు, కొన్ని నిర్దిష్ట సంస్థల కోసం

ఒక్క మాటలో చెప్పాలంటే.. పన్నును సరిగ్గా ఫైల్ చేసేటప్పుడు ఇప్పుడు వివిధ ఆదాయాలు, కేటగిరీల ప్రకారం వేర్వేరు ITR ఫారమ్‌లను నింపడం మర్చిపోవద్దు.