ఆధార్-పాన్, GST, ITR గడువు తేదీలు జూన్ 30వరకు పొడిగింపు  

  • Publish Date - March 24, 2020 / 09:24 AM IST

కరోనో వైరస్ నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా షట్ డౌన్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో చట్టబద్ధమైన, నియంత్రణ సమ్మతి సమస్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. దేశంలో ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని నిర్మల అన్నారు.

కరోనా తీవ్రతతో ఆర్థికపరంగా ఎదురయ్యే సమస్యలపై అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా నిర్మల సీతారామన్ అధ్యక్షతన టాస్క్ ఫోర్సును ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్మల ఆర్థికపరమైన అంశాలపై వివరణ ఇచ్చారు. పన్నుదారులకు ఉపశమనం కలిగేలా ఐటీఆర్ ఫైలింగ్, ఆధార్-పాన్ అనుసంధానం, జీఎస్టీ రిట్నర్స్ గడువు తేదీలను పొడిగిస్తున్నట్టు వెల్లడించారు. 

ఈ గడువు తేదీలను ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. Vivad Se విశ్వాస్ పథకం గడువు తేదీని కూడా ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు చెప్పారు. 10 శాతం చెల్లింపులపై ఎలాంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు.

ఆధార్-పాన్ అనుసంధానం గడవు తేదీని జూన్ 30 వరకు పొడిగించినట్టు తెలిపారు. టీడీఎస్ డిపాజిట్ల ఆలస్యమైతే ఆయా వడ్డీ రేట్లపై 12శాతం నుంచి 9శాతానికి తగ్గించినట్టు చెప్పారు. జూన్ 2020లోగా ఆలస్యమైన డిపాజిట్లపై చెల్లించాల్సిందిగా చెప్పారు. ఈ తేదీ మరోసారి పొడిగింపు ఉండదని తెలిపారు.

ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు తేదీని కూడా జూన్ 30 వరకు పొడిగించినట్టు నిర్మల చెప్పారు. ఆలస్యంగా చేసే చెల్లింపులపై వడ్డీలను మాత్రం తగ్గిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు.. బ్యాంకులకు సంబంధించి కంపైలెన్స్ ఇష్యూలపై కూడా సీతారామన్ ప్రకటన చేశారు. కరోనా ప్రభావాన్ని ఎదుర్కున్న పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీని అందించే దిశగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు.

See Also |  ఆర్థిక ప్యాకేజీని ప్రకటించనున్న కేంద్ర ప్రభుత్వం