Anant Ambani Pre-Wedding : అనంత్‌-రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక.. నా రెండు కోరికలివే.. నీతా అంబానీ స్పెషల్‌ వీడియో మెసేజ్‌..!

Anant Ambani Pre-Wedding : ముఖేష్‌ అంబానీ, నీతా అంబానీ దంపతుల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుక గురించి నీతా అంబానీ ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని షేర్ చేశారు.

Anant Ambani Pre-Wedding : ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సతీమణి రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్‌పర్సన్ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు అంతా సిద్ధమైంది. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ గ్రీన్ కాంప్లెక్స్‌లో మూడు రోజుల పాటు ఈ ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగనున్నాయి. ఇప్పటికే అంబానీ కుటుంబమంతా జామ్‌నగర్‌కు విచ్చేసింది.

వేలాదిమందితో అన్నసేవ వేడుకలు కూడా ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీలు ఈ ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యేందుకు జామ్‌నగర్ విచ్చేస్తున్నారు. ప్రముఖల రాకతో జామ్‌నగర్‌లో పెళ్లిసందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలకు హాజరయ్యే అతిథులను ప్రత్యేకంగా స్వాగతం పలుకుతూ నీతా అంబానీ ఒక ప్రత్యేకమైన వీడియో సందేశాన్ని షేర్ చేశారు.

వచ్చే జూలైలో పెళ్లిపీటలెక్కనున్న తమ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి తమకు ఎంతో ప్రత్యేకమైనదిగా ఆమె పేర్కొన్నారు. అనంత్ పెళ్లిని చాలా ప్రత్యేకంగా జరిపించాలని నీతా అంబానీ ఎప్పటినుంచో కలలు కంటున్నారట. అదే విషయాన్ని ఆమె వీడియోలో చెప్పుకొచ్చారు. ప్రత్యేకించి అనంత్ పెళ్లి విషయంలో తనకు రెండు కోరికలు ఉన్నాయని ముఖేష్ అంబానీ సతీమణి వెల్లడించారు.

ఆ రెండు కోరికలివే : నీతా అంబానీ 
అందులో మొదటిది.. కుటుంబ మూలాలను గౌరవించడంతో పాటు ఈ వేడుక ఎప్పటికీ గుర్తుంచుకునేలా ఉండాలనేది నీతా అంబానీ మొదటి కోరికగా పేర్కొన్నారు. ఇక రెండోది.. పెళ్లి వేడుకను కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని నీతా అంబానీ ఆకాంక్షించారు.

Anant Ambani pre-wedding celebration

జామ్‌నగర్‌తో తమకు ప్రత్యేకమైన అనుబంధం ఉందన్నారు. ఎందుకంటే.. ‘నేను ఇక్కడే పెరిగాను. ఇక్కడే పెళ్లి వేడుకను ప్లాన్ చేసుకోవడం నా అదృష్టం. ఇది నా తండ్రి జన్మభూమి. నా దాదా.. నాన్నల కర్మ భూమి. ఈ ప్రాంతంలో పెళ్లి వేడుక జరగడం సంతోషించాల్సిన విషయం. నా కెరీర్ ఇక్కడి నుంచే ప్రారంభించాను’ అంటూ నీతా వీడియో సందేశంలో తెలిపారు.

అంబానీ ఫ్యామిలీకి ఈ జామ్‌నగర్ అంటే చాలా ఇష్టమట.. ముఖేష్ అంబానీ, ఆయన తండ్రి (ధీరూభాయ్ అంబానీ) రిఫైనరీని ఇక్కడే స్థాపించారు. ఎడారి ప్రాంతాన్ని పచ్చని మొక్కలతో ఆహ్లాదకరంగా మార్చారు. అందుకే, గుజరాత్‌లోని రిలయన్స్‌ గ్రీన్స్‌ను అనంత్ పెళ్లి వేడుక వేదికగా జరుపుకోవాలని ముచ్చటపడినట్టు నీతా అంబానీ వీడియోలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Meta CEO Mark zuckerberg Family

జామ్‌నగర్‌కు అతిరథ మహారథులు :
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి ప్రీ-వెడ్డింగ్ వేడుకలకు హాజరయ్యేందుకు వేల సంఖ్యలో ప్రముఖులు, సినీతారలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా కలిసి ముఖ్యఅతిథులుగా  విచ్చేస్తున్నారు. ప్రపంచ సంచలనం రిహన్నా, మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ జామ్‌నగర్ చేరుకోగా వారికి సంప్రదాయ పద్ధతిలో అంబానీ ఫ్యామిలీ ఆహ్వానం పలికింది. జుకర్‌బర్గ్ దంపతులకు తెల్లటి దండలు, సాంప్రదాయ నృత్య ప్రదర్శనతో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

బాలీవుడ్ నటి దీపికా పదుకొన్, రణవీర్ సింగ్‌, షారుక్ ఖాన్ ఫ్యామిలీ, ఆలియాభట్, రణ్‌బీర్ ఫ్యామిలీ సహా దాదాపు వెయ్యి మంది అతిథులు వస్తారని భావిస్తున్నారు. ప్రత్యేకంగా జామ్‌నగర్‌లోని రిలయన్స్ గ్రీన్స్ కాంప్లెక్స్‌లో అతిథులకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. గురువారమే కుటుంబ సంప్రదాయంలో భాగంగా జామ్‌నగర్‌లోని రిలయన్స్ టౌన్‌షిప్ సమీపంలోని జోగ్వాడ్ గ్రామంలోని సుమారు 51వేల మందికి గుజరాతీ ‘అన్న సేవ’లో అనేక మంది అతిథులు హాజరయ్యారు.

అనంత్ ప్రీవెడ్డింగ్ మూడు రోజుల వేడుకకు హాజరయ్యేందుకు బీపీ మాజీ సీఈఓ, బాబ్ డడ్లీ, బీపీ సీఈఓ ముర్రే ఆచిన్‌క్లోస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ గుజరాత్‌లోని జామ్‌నగర్ చేరుకున్నారు. డీఎల్ఎఫ్ సీఈఓ కుశాల్ పాల్ సింగ్ కూడా చేరుకున్నారు. అతిథుల జాబితాలో స్వీడన్ మాజీ ప్రధాని కార్ల్ బిల్డ్, కెనడా మాజీ ప్రధాని స్టీఫెన్ హార్పర్, గూగుల్ ప్రెసిడెంట్ డొనాల్డ్ హారిసన్, బొలీవియా మాజీ అధ్యక్షుడు జార్జ్ క్విరోగా, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రూడ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ చైర్‌పర్సన్ క్లాస్ స్క్వాబ్ ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు