Paytm UPI Credit Line
Paytm UPI Credit Line : దేశీయ డిజిటల్ పేమెంట్స్ రంగంలో వేగంగా విస్తరిస్తున్న పేటీఎం మరో ముందడుగు వేసింది. పేటీఎం తమ కస్టమర్ల కోసం మరో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. యూపీఐపై క్రెడిట్ లైన్ ఫీచర్ తీసుకొచ్చింది.
పేటీఎం పేరెంట్ కంపెనీ One97 కమ్యూనికేషన్స్, పేటీఎం పోస్ట్‌పెయిడ్ యూపీఐ క్రెడిట్ లైన్ కోసం (Paytm UPI Credit Line) సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఇప్పుడు ఖర్చు చేసి వచ్చే నెలలో చెల్లించవచ్చు. ముఖ్యంగా, ఈ క్రెడిట్ లైన్ 30 రోజుల పాటు వడ్డీ లేకుండా అందిస్తుంది.
స్పెషల్ ఫీచర్ ఏంటి? :
డిజిటల్ పేమెంట్లలో అన్ని లావాదేవీలకు యూపీఐ ఉపయోగించే యూజర్ల కోసం ఈ కొత్త సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఈ క్రెడిట్ లైన్ వినియోగదారులకు నెల మధ్య ఖర్చుల నుంచి భారీ ఉపశమనం కలిగిస్తుంది. కస్టమర్లు ఎక్కడైనా యూపీఐ పేమెంట్లు చేయగలరు. ఈ ఖర్చు చేసిన మొత్తాన్ని వచ్చే నెలలో పేమెంట్ సెటిల్ చేసుకోవచ్చు.
ఎక్కడ వాడొచ్చంటే?
UPI QR కోడ్ లేదా డిజిటల్ పేమెంట్ ఆప్షన్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రస్తుతం ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ సర్వీసు ప్రస్తుతం పరిమిత సంఖ్యలో కస్టమర్లకు అందుబాటులో ఉందని పేటీఎం పేర్కొంది. రాబోయే రోజుల్లో క్రమంగా వైడ్ రేంజ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుందని పేటీఎం తెలిపింది. క్యాష్ గురించి ఎలాంటి ఆందోళన లేకుండా వినియోగదారులు తమ రోజువారీ ఖర్చులను తీర్చుకునేలా చేయడమే ఈ ఫీచర్ ఉద్దేశ్యమని కంపెనీ చెబుతోంది.
ఎలా పని చేస్తుందంటే? :
పేటీఎం పోస్ట్‌పెయిడ్ అనేది వివిధ మర్చంట్ టచ్‌పాయింట్‌లలో UPI ద్వారా చెల్లింపులు చేసేందుకు అనుమతిస్తుంది. మీరు స్టోర్‌లో చెల్లించడానికి QR కోడ్‌ను స్కాన్ చేస్తున్నా, ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నా, లేదా మీ బిల్లులు చెల్లించినా, రీఛార్జ్‌లు చేస్తున్నా లేదా పేటీఎం యాప్‌లో టిక్కెట్లను బుక్ చేసుకుంటున్నా మీరు ఇప్పుడు ఈ క్రెడిట్ లైన్‌ను ఉపయోగించవచ్చు.
ప్రయోజనాలేంటి? :
ఈ కొత్త పోస్ట్‌పెయిడ్ సౌకర్యం కస్టమర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఖర్చు చేసిన తర్వాత 30 రోజుల వరకు వడ్డీ లేని పేమెంట్ సౌకర్యం పొందవచ్చు. అన్ని లావాదేవీలను ఆన్‌లైన్‌లో చెల్లించే వారికి, వారి ఖర్చులను మరింత సులభంగా ఉండేలా ఈ సర్వీసు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భవిష్యత్తులో ఈ ఫీచర్ మరింత మంది కస్టమర్‌లకు విస్తరించనుంది.