భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జీబీ) 2020-21 సిరీస్ VII ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను ప్రకటించింది. ఈ బాండ్ 2020 అక్టోబర్ 20న జారీ అయింది. ఆ సమయంలో గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసినవారు 2025 అక్టోబర్ 20న (అంటే 5 సంవత్సరాలు పూర్తయ్యాక) ముందస్తుగా దీన్ని రీడీమ్ చేసుకోవచ్చు.
ఆర్‌బీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సిరీస్‌కు ప్రతి గ్రాముకు రూ.12,792 రిడెంప్షన్ ధరగా నిర్ణయించారు. ఈ ధరను 2025 అక్టోబర్ 15, 16, 17 తేదీల్లో చివరి మూడు ట్రేడింగ్ రోజుల బంగారం సగటు ధర ఆధారంగా నిర్ణయిస్తారు.
ఈ బాండ్ 2020 అక్టోబర్‌లో జారీ అయినప్పుడు ధర గ్రాముకు రూ.5,051గా ఉంది. ఇప్పుడు పెట్టుబడిదారు ముందస్తుగా ఈ బాండ్‌ను రిడెంప్షన్ చేసుకుంటే గ్రాముకు రూ.12,792 పొందుతారు. అంటే మొత్తం 153% లాభం (వడ్డీ మినహా) వస్తుంది. అంటే, అప్పుడు బాండ్లు కొన్నవారు ఇప్పుడు ప్రతి గ్రాముపై సుమారు రూ.7,741 లాభం పొందుతారు.
ఎస్‌జీబీ అంటే ఏమిటి? ఇది ఎలా ఆదాయం ఇస్తుంది?
ఎస్‌జీబీ అంటే సావరిన్ గోల్డ్ బాండ్. ఇది ప్రభుత్వ పథకం. ఇందులో పెట్టుబడి పెడతారు. ఇది రెండు మార్గాల్లో లాభం ఇస్తుంది. బంగారం ధరలు పెరగడం వల్ల వచ్చే మూలధన లాభం. సంవత్సరానికి 2.5% స్థిర వడ్డీ, ఆరు నెలలకు ఒకసారి చెల్లిస్తారు.ఈ బాండ్‌ల మొత్తం వ్యవధి 8 సంవత్సరాలు, కానీ పెట్టుబడిదారులు 5 సంవత్సరాల తరువాత ముందస్తుగానూ తీసుకోవచ్చు.
ఆర్‌బీఐ నియమాల ప్రకారం, ఎస్‌జీబీ రిడెంప్షన్ విలువను చివరి మూడు ట్రేడింగ్ రోజులలో 999 స్వచ్ఛత గల బంగారం ముగింపు సగటు ధర ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ధరను ఇండియా బులియన్ అండ్ జ్యూవెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) రిలీజ్ చేస్తుంది.
కాగా, పెట్టుబడిదారులు బాండ్‌లను 8 సంవత్సరాలు ఉంచితే, పూర్తి మూలధన లాభ పన్ను మినహాయింపు లభిస్తుంది. అంటే పన్ను లేని లాభాలు. ఈ కారణాల వల్ల ఎస్‌జీబీలు భౌతిక బంగారంతో పోలిస్తే మెరుగైన, సురక్షితమైన పెట్టుబడి మార్గంగా ఉండేవి. 2024 నుంచి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించట్లేదు. అంతకుముందే బాండ్లు తీసుకున్న వారిపై మాత్రం ఈ ప్రభావం పడదు.