దసరా పండక్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. రెపో రేటు తగ్గించింది. 0.25శాతం తగ్గించటం వల్ల రెపో రేటు 5.15శాతానికి దిగివచ్చింది. దీని వల్ల అప్పులపై వడ్డీ రేట్లు ఆయా బ్యాంకులు తగ్గించాల్సి ఉంటుంది. ఇది మధ్య తరగతి ప్రజలకు ఆర్బీఐ దసరా కానుకగా చెప్పొచ్చు. బ్యాంకులు కూడా రెపోరేటు తగ్గిస్తే.. ఇల్లు, కార్లు, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి వడ్డీ తగ్గిపోనుంది. ఈ మేరకు EMI తగ్గనుంది.
రిజర్వ్ బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగు విడతలుగా తగ్గిస్తూనే వస్తుంది ఆర్బీఐ. ఈ క్రమంలోనే తొమ్మిదేళ్లలోనే ఇంత తక్కువ స్థాయికి దిగిరావటం ఇదే. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం, దేశంలో కొనుగోళ్లు భారీగా తగ్గిపోవటంతో వడ్డీ రేట్లను తగ్గించాల్సి వచ్చింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కార్ల అమ్మకాలు పడిపోయాయి. ఉత్పత్తిని నిలిపివేశాయి కార్ల కంపెనీలు. వేల సంఖ్యలో ఉపాధి కోల్పోయారు. అదే విధంగా ఇళ్ల కొనుగోళ్లు కూడా తగ్గాయి.
దేశంలో ఆర్థిక మాంద్యం క్రమంలో ఏర్పడిన మందగమనాన్ని దృష్టిలో పెట్టుకుని ఇల్లు, కార్లపై తీసుకునే అప్పులపై వడ్డీని తగ్గించింది RBI. దీంతో కస్టమర్లకు నెలవారీ EMI కూడా తగ్గనుంది. ఇప్పుడైనా అమ్మకాలు ఊపందుకుంటాయో లేదో చూడాలి.