Credit Card Fraud: క్రెడిట్ కార్డు హోల్డర్స్ కి గుడ్ న్యూస్.. 5 రోజుల్లోనే మీ డబ్బు రిట్టర్న్.. RBI కొత్త గైడ్ లైన్స్
క్రెడిట్ కార్డు మోసాల(Credit Card Fraud)పై రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా కొత్త గైడ్ లైన్స్ జారీ చేసింది.
- V Santhosh Kumar
- Published on- June 25, 2026 / 06:33 AM IST
Reserve bank of india announced banks provide shadow reversal in 5 days for credit card fraud
- ఆర్‌బీఐ కొత్త డిజిటల్ నిబంధనలు.
- ఐదు రోజుల్లోగా నగదు వాపస్.
- రూ.500 పైగా ఉచిత ఎస్‌ఎంఎస్.
Credit Card Fraud: క్రెడిట్ కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా జరిగే ఆర్థిక మోసాల బారిన పడే ఖాతాదారులకు ఉపశమనం కలిగించే నిర్ణయాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకుంది. క్రెడిట్ కార్డు మోసాల(Credit Card Fraud)పై ఫిర్యాదు చేసిన 5 రోజుల్లోగా, సదరు వివాదాస్పద మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్ (తాత్కాలికంగా నగదు బదిలీ) రూపంలో ఖాతాదారుడి ఖాతాకు జమ చేయాలని ఆర్‌బీఐ ఆదేశించింది. డిజిటల్ లావాదేవీల్లో ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేసే విధంగా సవరించిన నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఖాతాదారులపై బాధ్యత లేని సందర్భాలు:
మోసం ఎలా జరిగినా కూడా ఖాతాదారులపై ఎటువంటి బాధ్యత పడని సందర్భాలపై ఆర్‌బీఐ స్పష్టత నిచ్చింది.
బ్యాంక్ లోపాలు: బ్యాంక్ వైపు ఉన్న లోపాలు లేదా నిర్లక్ష్యం కారణంగా మోసం జరిగితే.. ఖాతాదారుడు ఆ విషయాన్ని ఫిర్యాదు చేసినా, చేయకపోయినా సరే ‘లావాదేవీని రద్దు చేసి, పూర్తి సొమ్మును బ్యాంకే వెనక్కి ఇవ్వాలి’.
థర్డ్ పార్టీ హ్యాకింగ్: బ్యాంక్ లేదా ఖాతాదారుడి తప్పు లేకుండా ఏదైనా థర్డ్ పార్టీ హ్యాకింగ్ వల్ల మోసం జరిగితే, ఆ లావాదేవీ జరిగిన 5 క్యాలెండర్ రోజుల్లోపు ఖాతాదారుడు బ్యాంకుకు నివేదిస్తే, వారిపై ఎటువంటి బాధ్యత ఉండదు. ఒకవేళ 5 రోజుల తర్వాత ఫిర్యాదు చేస్తే, బ్యాంక్ పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు.
ఫిర్యాదు తర్వాతి లావాదేవీలు: ఖాతాదారుడు మోసం జరిగిందని ఫిర్యాదు చేసిన తర్వాత, ఆ ఖాతా నుంచి మళ్లీ ఎటువంటి అనధికార లావాదేవీలు జరిగినా.. బ్యాంకులే ఆ నష్టాన్ని భరించాలి.
ముఖ్య గమనిక: బ్యాంకులు మోసపూరిత లావాదేవీ సొమ్మును వెనక్కి ఇచ్చేటపుడు, అది ఏ రోజు అయితే జరిగిందో అదే తేదీతో జమ చేయాలి. దీని వల్ల ఖాతాదారుడు ఎటువంటి వడ్డీ నష్టాన్ని లేదా అదనపు వడ్డీ ఛార్జీల భారాన్నిగానీ భరించాల్సిన అవసరం ఉండదు.
పరిహారం చెల్లింపుల వివరాలు:
మొదటిసారి డిజిటల్ మోసాల బారిన పడే బాధితుడు రూ. 50,000 లోపు నష్టానికి గురై ఫిర్యాదు చేస్తే, అందులో 85% లేదా గరిష్ఠంగా రూ. 25,000 పరిహారంగా అందుకోవచ్చు. ఈ సదుపాయం ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. రూ. 29,412 కంటే తక్కువ విలువ కలిగిన దేశీయ మోసాల ఫిర్యాదుల్లో 85% పరిహారం చెల్లించాల్సి వస్తే అందులో ఆర్‌బీఐ 65%, ఖాతాదారుడి బ్యాంక్ నుంచి 10%, బెనిఫిషియరీ బ్యాంక్ (డబ్బులు జమ అయిన బ్యాంక్) నుంచి 10% చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, వినియోగదారులే నిర్లక్ష్యంతో ఓటీపీ (OTP) లేదా పాస్‌వర్డ్ షేర్ చేసి నష్టపోతే, అందుకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
వర్తింపు, ఎస్‌ఎంఎస్ (SMS) నిబంధనలు:
సవరించిన ఈ ఆదేశాలను దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు, కో-ఆపరేటివ్ బ్యాంకులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.
రూ.500 దాటితే ఉచిత ఎస్‌ఎంఎస్ తప్పనిసరి:
బ్యాంకులు తమ ఖాతాదారులు చేసే ప్రతి రూ.500, అంతకుమించిన ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి తప్పనిసరిగా తక్షణ ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లను పంపాలి.రూ. 500 లోపు లావాదేవీలకు ఎస్‌ఎంఎస్‌లపై బ్యాంకులు తమ అంతర్గత పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వీటి కోసం ఖాతాదారుల నుంచి ఎటువంటి ఛార్జీలు వసూలు చేయకూడదని సూచించింది.
