SBI Home Loan Rates
SBI Home Loan Interest Rates : దేశంలోని అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త రుణగ్రహీతలకు గృహ రుణాలపై (SBI Home Loan Rates) వడ్డీ రేట్లను పెంచింది. ఎస్బీఐ గృహ రుణ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచింది.
దాంతో వడ్డీ రేట్లు గరిష్ట పరిమితి 8.45 శాతం నుంచి 8.70 శాతానికి చేరుకుంది. ఆగస్టు 4 నుంచి 6 వరకు జరిగిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) MPC సమావేశానికి ముందు ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధాన సమావేశం తర్వాత రెపో రేటు 5.55 శాతం వద్ద మారలేదు.
గత ఫిబ్రవరి 2025లో ఆర్బీఐ రెపో రేటును మొత్తం 100 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించింది. గృహ రుణాలు, ఇతర రుణాలపై కస్టమర్లకు బిగ్ రిలీఫ్ అందించింది. కానీ, ఈ ఆగస్టులో ఆర్బీఐ ప్రస్తుతానికి రెపో రేటును పెంచలేదు. కానీ, ఎస్బీఐ వడ్డీ రేటు పెంపుతో హౌసింగ్ ఫైనాన్స్ మార్కెట్లో వడ్డీ రేట్లకు నాంది పలికింది. ఎస్బీఐ కాకుండా ఇతర బ్యాంకుల హోం లోన్లపై వడ్డీ రేట్లను ఎలా అందిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
SBI Home Loan Rates : ఎస్బీఐ హోం లోన్ వడ్డీ రేట్లు :
ఎస్బీఐ గృహ రుణాల గరిష్ట వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 8.70 శాతానికి పెంచింది. గతంలో 8.45 శాతంగా ఉంది. అదే సమయంలో తక్కువ వడ్డీ రేటు 7.50 శాతం వద్దనే ఉంది. ఇప్పుడు కొత్త కస్టమర్లు వారి క్రెడిట్ ప్రొఫైల్, లోన్ మొత్తాన్ని బట్టి 7.50 శాతం నుంచి 8.70 శాతం మధ్య వడ్డీ రేటు చెల్లించాల్సి ఉంటుంది.
SBI తర్వాత ఇతర ప్రధాన బ్యాంకులు ఏం అందిస్తున్నాయో ఇప్పుడు చూద్దాం..
బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) : 7.45 శాతం నుంచి 9.20 శాతం. వడ్డీ రేటు లోన్ మొత్తం, సిబిల్ స్కోర్, క్రెడిట్ ఇన్సూరెన్స్ కవర్‌పై ఆధారపడి ఉంటుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) : గృహ రుణ వడ్డీ రేటు 7.45 శాతం నుంచి ప్రారంభమవుతుంది. వివిధ రేట్లు, కాలపరిమితిని బట్టి రేట్లు మారుతూ ఉంటాయి.
కెనరా బ్యాంక్ : వడ్డీ రేటు 7.40 శాతం నుంచి 10.25 శాతం వరకు ఉంటుంది.
HDFC బ్యాంక్ : 7.90 శాతం నుంచి వడ్డీ రేటు ప్రారంభమవుతుంది. ఇందులో హోం లోన్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, హౌస్ రీనోవేషన్, లోన్ ఎక్స్‌టెన్షన్ ఉన్నాయి.
ICICI బ్యాంక్ : వడ్డీ రేటు 7.70 శాతం నుంచి ప్రారంభమవుతుంది. కానీ, లోన్ మొత్తం, కస్టమర్ ప్రొఫైల్ ఆధారంగా 8.75శాతం నుంచి 9.80శాతం వరకు ఉండవచ్చు.
కోటక్ మహీంద్రా బ్యాంక్ : వడ్డీ రేటు 7.99 శాతం నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లోటింగ్ నుంచి ఫిక్స్‌డ్‌కి మారే కస్టమర్లకు 12శాతం వరకు రేటు ఉండవచ్చు.
కస్టమర్లపై తీవ్ర ప్రభావం :
వడ్డీ రేటు పెరుగుదల ఈఎంఐపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఈ చిన్న పెరుగుదల దీర్ఘకాలంలో లోన్ మొత్తం ఖర్చును భారీగా పెంచుతుంది. అందులోనూ ద్రవ్యోల్బణం కారణంగా భవిష్యత్తులో వడ్డీ రేట్లను స్థిరంగా కాకుండా ఆర్బీఐ పెంచాల్సి వస్తే బ్యాంకుల వడ్డీ రేట్లు మరింత కఠినంగా పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
మీరు కొత్త హోం లోన్ కోసం చూస్తున్నారా? వడ్డీ రేట్లను ఇతర బ్యాంకులతో పోల్చిన తర్వాత మాత్రమే తీసుకోండి. మీ CIBIL స్కోర్ ఎక్కువగా ఉంచుకోండి. తద్వారా తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందవచ్చు. ఇప్పటికే ఉన్న కస్టమర్లు మరో బ్యాంకు నుంచి మెరుగైన వడ్డీ కోసం బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ ఎంచుకోవచ్చు.
గృహ రుణాలపై చౌక వడ్డీ రేట్లకు ఇక కాలం చెల్లినట్టే.. ఎస్బీఐ వడ్డీ రేటు పెంపు దీనికి సంకేతంగా చెప్పొచ్చు. ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచినప్పటికీ, బ్యాంకుల దృష్టి ఇప్పుడు రిస్క్, మార్జిన్‌పైనా పడింది. ఇలాంటి పరిస్థితుల్లో గృహ కొనుగోలుదారులు, లోన్ తీసుకునేవారు తప్పక జాగ్రత్తగా ఉండాలి.