Somajiguda is the second best high street in the country
Somajiguda – High Street: రియల్ ఎస్టేట్లోని అన్ని విభాగాల్లోను మన హైదరాబాద్ (Hyderabad) తన మార్క్ చూపుతోంది. నివాస, వాణిజ్య ప్రాజెక్టుల్లోనే కాకుండా రిటైల్ రియాల్టీలోను భాగ్యనగరం సత్తా చాటుతోంది. భారత్ లో కాస్మోపాలిటన్ సిటీల్లోని (Cosmopolitan Cities) హైస్ట్రీట్ విభాగంలో సోమాజిగూడ రెండో స్థానంలో నిలిచింది. రానున్న రోజుల్లో రిటైల్ రియస్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ మరింత దూకుడు కనబరుస్తుందని రియల్ రంగ నిపుణులు చెబుతున్నారు.
భారత రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ రూటే సపరేటని చెప్పాలి. మరీ ముఖ్యంగా నిర్మాణ రంగంలో భాగ్యనగరం జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. కోకాపేటలో ఎకరం వంద కోట్ల రూపాయలు పలకడంతో దేశీయ రియల్ ఎస్టేట్ చూపంతా హైదరాబాద్ పై పడింది. ఇటువంటి సమయంలో భారత్ లోని కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లలో హైదరాబాద్ లోని సోమాజిగూడకు దేశంలోనే రెండో స్థానం దక్కింది.
కాస్మోపాలిటన్ సిటీల్లోని హైస్ట్రీట్లపై ఇండియా రియల్ ఎస్టేట్ విజన్ -2047 పేరుతో నరెడ్కో- నైట్‌ఫ్రాంక్ ఇండియా నిర్వహించిన ఓ అధ్యయన నివేదికలో.. హైదరాబాద్‌లోని సోమాజిగూడ హైస్ట్రీట్ రెండో స్థానంలో నిలిచింది. ఈ నివేదికలో బెంగళూరులోని ఎంజీ రోడ్ మొదటి స్థానం దక్కించుకుంది. దేశంలోని టాప్-20 హైస్ట్రీట్స్ జాబితాలో హైదరాబాద్ నుంచి సోమాజిగూడతో పాటు మరో ఐదు ప్రాంతాలున్నాయి. ఇందులో గచ్చిబౌలి 16వ స్థానం, అమీర్‌పేట్ 17, బంజారాహిల్స్ 18, జూబ్లీహిల్స్ 19వ స్థానంలో నిలిచాయి.
Also Read: 43 నగరాల్లో పెరిగిన ఇళ్ల ధరలు.. హైదరాబాద్ లో సగటు ఇంటి ధర చదరపు అడుగుకు ఎంతంటే?
హైస్ట్రీట్స్ అంటే..?
ఫుడ్ కోర్టులు, షాపింగ్ మాల్స్, గేమింగ్ జోన్స్, రిటైల్ షాపులు, మల్టీఫ్లెక్స్‌లు ఇలా అన్నీ ఉండే బిజినెస్ అండ్ ఎంటర్టైన్‌మెంట్ జోన్ను హైస్ట్రీట్స్‌గా పిలుస్తున్నారు. హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ నగరాలకు ఈ హైస్ట్రీట్స్ ప్రధాన ఆకర్షణగా చెప్పాలి. సిటీలో ఏ ప్రాంతం నుంచైనా ఈ హైస్ట్రీట్స్‌కు రవాణా సౌకర్యం ఉండటంతో పాటు ఆధునిక వసతులు, పార్కింగ్, వినోద, విహార సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ఈ హైస్ట్రీట్ లలో ప్రతి చదరపు అడుగు ఆదాయం షాపింగ్ మాల్స్‌లో కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే నగరంలోని ఐదు ప్రాంతాలలో రిటైల్ అద్దెల పరంగా అతి ఖరీదైన ప్రాంతం మాత్రం జూబ్లీహిల్సేనని చెప్పాలి. ఇక్కడ చదరపు అడుగు రిటైల్ స్పేస్ సగటు అద్దె నెలకు రూ.200 నుంచి రూ.225 ఉండగా, ఆ తర్వాత బంజారాహిల్స్లో చదరపు అడుగు రూ.190 నుంచి రూ.230, సోమాజిగూడలో రూ.150 నుంచి రూ.175 వరకు అద్దె ఉంది.
Also Read: దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంటి అద్దెలు.. హైదరాబాద్‌లో ఎంత పెరిగాయంటే?
నెంబర్ వన్ స్థానంలో గుర్గావ్ ఎన్‌సీఆర్
దేశంలోని 8 మెట్రో నగరాల్లో 30 హైస్ట్రీట్స్ ఉండగా, ఈ హైస్ట్రీట్స్ 1.32 కోట్ల చదరపు అడుగుల రిటైల్ స్థలంలో విస్తరించి ఉన్నాయి. ఇందులో 52 లక్షల చదరపు అడుగుల స్థలంతో ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతంలోని ఎన్‌సీఆర్ నెంబర్ వన్ స్థానంలో ఉండగా, 18 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. అటు అహ్మదాబాద్, బెంగళూరు ఒక్కో నగరంలో 15 లక్షల చదరపు అడుగుల స్థలం అందుబాటులో ఉంది. ఆధునిక రిటైల్ స్పేస్ పరంగా చూసినా దేశంలోని 8 ప్రధాన నగరాలలో 57 లక్షల చదరపు అడుగుల వాటా ఉండగా, 14 లక్షల చదరపు అడుగులతో ఎన్‌సీఆర్ మొదటి స్థానంలో, 11 లక్షల చదరపు అడుగులతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ రిటైల్ రియాల్టీలో ఢిల్లీని మించిపోయి నెంబర్ వన్ పొజిషన్కు వస్తుందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.