Ssf Bank
SSF Bank: సహజంగా బ్యాంకులు కొత్తగా కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ పథకాలు తీసుకొచ్చే సంగతి తెలిసిందే. ఖాతాదారులకు అత్యధిక వడ్డీ రేట్లు, ఉచిత భీమా సౌకర్యంతో పాటు ప్రత్యేక యూజర్ చార్జీల తగ్గింపు వంటివి అందిస్తుంటాయి. అయితే.. సూర్యోదయ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్(SSFB) మాత్రం కస్టమర్లను ఆకర్షించేందుకు సరికొత్త పొదుపు ఖాతా పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ఖాతా ద్వారా కస్టమర్లు సంపద వృద్ధితో పాటు బీమా సౌకర్యాన్ని పొందనున్నారు. అందుకే దీనికి ‘సూర్యోదయ హెల్త్ అండ్ వెల్‌నెస్ సేవింగ్స్ అకౌంట్’గా పేరు పెట్టారు.
ముందుగా ఈ ఖాతా ద్వారా కస్టమర్లకు అందే ప్రయోజనాలను ఒకసారి చూద్దాం. ఈ బ్యాంక్ లో ఖాతా తెరిచిన వారికి.. వారి జీవిత భాగస్వామితో సహా కుటుంబంలో మొత్తం నలుగురికి రూ.25 లక్షల భీమా అందించనున్నారు. అయితే.. ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. వైద్య ఖర్చులు రూ.5 లక్షలు మించితేనే ఈ మెడికల్ ఇన్సూరెన్స్ టాప్ అప్ చేసుకొనే వీలు ఉంటుంది. దీంతోపాటు ఎంపిక చేసిన ఆసుపత్రులలో తొలి ఏడాది పాటు డాక్టర్లతో ఫోన్ లేదా వీడియో కన్సల్టేషన్ ఉచితంగా అందించనున్నారు. రూ.500 విలువ చేసే నాలుగు మెడిసిన్స్ ఓచర్లు.. రెండు డెంటల్ కన్సల్టేషన్ ఓచర్లు.. మరో రెండు డైట్ ఫిట్ ఓచర్లు అందించనున్నారు.
ఇక.. ఈ ఖాతాలో జమ చేసే పొదుపుపై కస్టమర్లకు 6.25 శాతం వడ్డీ అందించనుండగా.. ఇది నెలనెలా ఖాతాలో జమచేయనున్నారు. ఖాతా తెరిస్తే రూపే ప్లాటినం సెక్యూర్ చిప్ డెబిట్ కార్డు అందించనుండగా.. దీనిద్వారా రోజుకి రూ.1.5 లక్షల వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఏ బ్యాంకుకు చెందిన ఏటీఎంలోనైనా ఈ కార్డు ద్వారా ఎలాంటి ఛార్జిలు లేకుండానే అపరిమిత లావాదేవీలు చేయవచ్చు. పీఓఎస్‌లలో అయితే.. రూ.3 లక్షలు విలువ చేసే లావాదేవీలకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు రూ.2 లక్షల జీవిత బీమా అందించనుండగా శాశ్వత అంగవైకల్యానికి గురైనా కూడా ఈ బీమా వర్తించనుంది.