Sundar Pichai
Sundar Pichai : గూగుల్ పేరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ భారత సంతతికి చెందిన సీఈఓ సుందర్ పిచాయ్ బిలియనీర్ అయ్యారు. సుందర్ పిచాయ్ (Sundar Pichai) అధికారికంగా 1.1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,200 కోట్లు) నికర విలువతో ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఒక విదేశీ కంపెనీకి సీఈఓగా ప్రపంచ బిలియనీర్ల జాబితాలో చోటు సంపాదించడం చాలా అరుదు. ఒకప్పుడు తండ్రి వార్షిక జీతంతో విమాన టికెట్ కొనుగోలు చేసిన పిచాయ్.. తన విశేషమైన కృషితో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.
ఇప్పుడు ప్రపంచ బిలియనీర్ కబ్ల్‌లోకి అడుగుపెట్టారు. ఆల్ఫాబెట్‌లో 0.02 శాతం వాటా పెరగడంతో పిచాయ్ సంపద ఒక్కసారిగా పెరిగింది. గత నెలలో ఆల్ఫాబెట్ షేరు ధర 13 శాతం పెరగడంతో టెక్ దిగ్గజం పిచాయ్ షేర్లు భారీగా పెరిగాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధిపై పెట్టుబడిదారుల ఆశావాదమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
మెటా, ఎన్విడియా, టెస్లాలో దిగ్గజాల మాదిరిగా కంపెనీ వ్యవస్థాపకుడు కానప్పటికీ కూడా పిచాయ్ తన నికర సంపదను పెంచుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి, గూగుల్ ఆల్ఫాబెట్ ఫలితాలు ఆశానకంగా ఉన్నాయి. 2023 ప్రారంభం నుంచి కంపెనీ షేర్లు భారీగా లాభాల బాటపట్టాయి. దాంతో కంపెనీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువకు పెరిగింది. పెట్టుబడిదారులు 120శాతం రాబడిని పొందారు.
పిచాయ్ (Sundar Pichai) బిలియనీర్ ఎలా అయ్యారంటే? :
భారీ వాటాలను కలిగిన చాలా మంది టెక్ వ్యవస్థాపకుల మాదిరిగా కాకుండా పిచాయ్ మరింత క్రమశిక్షణతో ముందుకు దూసుకెళ్తున్నారు. గత దశాబ్దంలో పిచాయ్ దాదాపు 650 మిలియన్ డాలర్ల విలువైన ఆల్ఫాబెట్ షేర్లను విక్రయించారు.
బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఆల్ఫాబెట్ షేర్లు రికార్డు గరిష్టాలకు దగ్గరగా చేరుకున్నాయి. దాంతో సుందర్ పిచాయ్ నికర విలువ కూడా గణనీయంగా పెరిగింది. దాంతో ఆయన ఇప్పుడు బిలియనీర్ స్థాయికి చేరుకున్నారు. 53 ఏళ్ల పిచాయ్ నికర విలువ ఇప్పుడు 1.1 బిలియన్ డాలర్లు. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో పిచాయ్ నికర విలువ 1.2 బిలియన్ డాలర్లుగా ఉంది.
టెక్నాలజీ పరిశ్రమలో వ్యవస్థాపకుడు కాని సీఈఓలు ధనవంతులు కావడం చాలా అరుదుగా జరుగుతుంది. చాలా మంది అగ్ర అధినేతల కంపెనీలో వాటా ఆధారంగా ధనవంతులు అయ్యారు. వీరిలో మెటా ప్లాట్‌ఫామ్‌లకు చెందిన మార్క్ జుకర్‌బర్గ్, ఎన్విడియా కార్ప్‌కు చెందిన జెన్సన్ హువాంగ్ ఉన్నారు.
న్యూయార్క్‌లో మార్కెట్ ప్రారంభమైన తర్వాత ఆల్ఫాబెట్ షేర్లు 4.1శాతం వరకు పెరిగాయి. రెండు నెలల్లో ఇదే అత్యధిక ఇంట్రాడే లాభంగా. ఆల్ఫాబెట్ మంచి లాభాలను ఆర్జించింది. ఊహించిన దానికన్నా ఎక్కువ లాభం ఆర్జించిందని కంపెనీ తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ప్రతి వ్యాపారం లాభపడిందని కంపెనీ పేర్కొంది.
ఆల్ఫాబెట్ లాభాల వెనుక AI ర్యాలీ :
ఆల్ఫాబెట్ Q2 ఆదాయ నివేదిక గత సంవత్సరంతో పోలిస్తే.. 14 శాతం వృద్ధిని సాధించింది. గూగుల్ సెర్చ్, యూట్యూబ్, క్లౌడ్, సబ్‌స్క్రిప్షన్‌ల నుంచి భారీగా పుంజుకుంది. ఈ వృద్ధిలో AI ప్రధాన పాత్ర పోషించింది. కంపెనీ ఆదాయాల కాల్ సమయంలో ఏఐ అనే పదం 90 సార్లు ప్రస్తావించారు. మెటా, ఓపెన్ఏఐ వంటి కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ మధ్య ఏఐ ప్రాముఖ్యతను పిచాయ్ గుర్తించారు.
గూగుల్ దశాబ్ద కాలంగా ఏఐ రంగంపై పెట్టుబడులు పెట్టిందని, ఈ రంగంలో అత్యంత పోటీతత్వాన్ని కొనసాగిస్తోందని ఆయన పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. రెండో త్రైమాసికంలో ఆల్ఫాబెట్ 28.2 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. కంపెనీ ఆదాయాలు 96.4 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది మూలధన వ్యయం కోసం 10 బిలియన్ డాలర్లు అదనంగా ఖర్చు చేస్తామని కంపెనీ తెలిపింది. క్లౌడ్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్ కోసం కంపెనీ ఈ పెట్టుబడి పెడుతోంది.
సుందర్ పిచాయ్ జర్నీ ఎలా మొదలైందంటే? :
సుందర్ పిచాయ్ జూలై 12, 1972న చెన్నైలో జన్మించారు. అతని తండ్రి బ్రిటిష్ కంపెనీ GECలో ఇంజనీర్. పిచాయ్ ఫ్యామిలీ డబుల్ బెడ్ రూం ఇంటిలో నివసించారు. పిచాయ్‌కు చదువు కోసం ప్రత్యేక గది లేదు. ఆయన తన తమ్ముడితో కలిసి డ్రాయింగ్ రూమ్ నేలపై పడుకునేవాడు. ఇంట్లో టీవీ, కారు లేవు. కానీ, ఈ లేమి పిచాయ్‌కు ప్రేరణగా మారింది.
తాను కేవలం 17 ఏళ్ల వయస్సులో IIT ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఖరగ్‌పూర్‌లో అడ్మిషన్ పొందాడు. ఇంజనీరింగ్ చదివే సమయంలో ఎల్లప్పుడూ తన బ్యాచ్‌లో టాపర్‌గా ఉండేవాడు. ఆపై స్కాలర్‌షిప్ కూడా పొందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీకి వెళ్ళాడు.
తండ్రి జీతంతో విమానం టికెట్ కొని.. :
పిచాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లడం అంత సులభం కాదు. ఆ సమయంలో తండ్రి వార్షిక జీతం ఇచ్చి విమాన టికెట్ కొన్నాను’’ అని చెప్పారు. అమెరికాలో నివసిస్తున్నప్పుడు పిచాయ్ చాలా కష్టపడాల్సి వచ్చింది.
అమెరికాకు వచ్చినప్పుడు ISD కాల్ కోసం నిమిషానికి 2 డాలర్లు వసూలు చేసేవారు. అధిక ఛార్జీల కారణంగా ఇంటితో కూడా మాట్లాడలేకపోయారు. అమెరికాలో జీవితంలో మొదటిసారి కంప్యూటర్ చూసినట్టు చెప్పారు. సుందర్ పిచాయ్ మెటీరియల్ ఇంజనీర్‌గా ప్రారంభించి 2004లో గూగుల్‌లో మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌గా చేరారు.