×
Ad

Speed Post Rules : అక్టోబర్ 1 నుంచే తెలంగాణ పోస్టల్ సర్కిల్ కొత్త రూల్స్.. ఇకపై స్పీడ్ పోస్టుకు OTP ఆధారిత డెలివరీ.. టారిఫ్ కూడా సవరింపు!

Speed Post Rules : తెలంగాణ పోస్టల్ సర్కిల్ అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో స్పీడ్ పోస్ట్ OTP ఆధారిత డెలివరీని అందించనుంది.

Speed Post Rules

Telangana Speed Post Rules : వచ్చే అక్టోబర్‌లో పోస్టాఫీసు స్పీడ్ ఫోస్ట్ సర్వీసుకు సంబంధించి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి స్పీడ్ పోస్టు పార్శిల్స్ డెలివరీ సమయంలో ఓటీపీ తప్పనిసరి కానుంది. తెలంగాణ పోస్టల్ సర్కిల్ 6వేల కన్నా ఎక్కువ పోస్టాఫీసులలో స్పీడ్ పోస్ట్ కోసం OTP ఆధారిత డెలివరీని అందుబాటులోకి తీసుకురానుంది. 2012 తర్వాత మొదటిసారిగా స్పీడ్ పోస్ట్ రేట్లను సవరించింది. ఈ కొత్త ఫీచర్లలో విద్యార్థులకు డిస్కౌంట్లు, సురక్షిత డెలివరీ వంటి ఆప్షన్లు ఉన్నాయి.

స్పీడ్ పోస్ట్ పార్శిల్‌లను స్వీకరించేవారికి వారి రిజిస్టర్డ్ మొబైల్ (Telangana Speed Post Rules) నంబర్‌లకు వన్-టైమ్ పాస్‌వర్డ్ (OTP) అందుతుంది. ఆ సమయంలో తమ పార్శిల్‌లను స్వీకరించేందుకు డెలివరీ సిబ్బందికి ఓటీపీని తెలియజేయాలి. ఆ తర్వాతే డెలివరీలు సరైన వ్యక్తులకు చేరినట్టుగా నిర్ధారించుకోవాలి.

అయితే, స్పీడ్ పోస్ట్‌ను ఆగస్టు 1, 1986న ప్రవేశపెట్టారు. అక్టోబర్ 2012 వరకు టారిఫ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇప్పుడు, 13ఏళ్ల విరామం తర్వాత సవరించిన టారిఫ్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలంగాణ పోస్టల్ సర్కిల్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

స్పీడ్ పోస్ట్ కొత్త టారిఫ్ రేట్లు ఇవే :

ఇటీవలే తపాలా శాఖ ఇన్‌ల్యాండ్ స్పీడ్ పోస్ట్ (డాక్యుమెంట్) టారిఫ్‌ను సవరించింది. విశ్వసనీయత, భద్రత, కస్టమర్ సౌలభ్యం కోసం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. సవరించిన టారిఫ్ ప్రకారం.. స్థానిక ప్రాంతాలలో కొత్త స్పీడ్ పోస్ట్ రేట్లు 50 గ్రాముల వరకు బరువున్న వస్తువులకు రూ. 19, 50 గ్రాముల నుంచి 250 గ్రాముల మధ్య బరువున్న వస్తువులకు రూ. 24, 250 గ్రాముల నుంచి 500 గ్రాముల మధ్య బరువున్న వస్తువులకు రూ. 28 రేట్లు ఉంటాయి. అదనంగా, 50 గ్రాముల వరకు బరువున్న వస్తువు 200 కి.మీ నుంచి 2000 కి.మీ ప్రయాణించే వస్తువులకు సవరించిన టారిఫ్ రూ. 47 వసూలు చేస్తారు.

Read Also : iPhone 16 Pro Max : ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లుచెదిరే ఆఫర్.. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇలాంటి డీల్ మళ్లీ రాదు భయ్యా..!

స్పీడ్ పోస్ట్ వస్తువులకు కూడా జీఎస్టీ (GST) వర్తిస్తుంది. విద్యార్థులకు యాక్సెసిబిలిటీని పెంచేందుకు మంత్రిత్వ శాఖ స్పీడ్ పోస్ట్ టారిఫ్‌పై 10శాతం తగ్గింపును ప్రవేశపెట్టింది. అంతేకాకుండా, కొత్త బల్క్ కస్టమర్లకు 5 శాతం ప్రత్యేక తగ్గింపు ఉంటుందని పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు.

డాక్యుమెంట్లు, పార్శిల్‌లు రెండింటికీ స్పీడ్ పోస్ట్ కింద వాల్యూ ఆధారిత సర్వీసు రిజిస్ట్రేషన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. “రిజిస్ట్రేషన్ సర్వీసు కోసం స్పీడ్ పోస్ట్ వస్తువుకు రూ. 5 నామమాత్రపు ఛార్జీతోపాటు జీఎస్టీ విధిస్తుంది. ఇందులో వస్తువు అడ్రస్ ఆధారంగా ప్రత్యేకంగా డెలివరీ అవుతుంది’’ అని కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులలో పేర్కొంది.

పోస్ట్‌కార్డులు, ఇన్‌ల్యాండ్ లెటర్లు :
దశాబ్దాల క్రితం తపాలా శాఖ ఎల్లో కలర్ పోస్ట్‌కార్డులు, బ్లూ కలర్ ఇన్‌ల్యాండ్ లెటర్లు పోస్టాఫీసులలో బాగా పాపులర్ అయ్యాయి. అయితే, ఈ సాంప్రదాయ లెటర్లకు డిమాండ్ భారీగా తగ్గింది. ఫిజికల్ మెయిల్ కన్నా డిజిటల్ కమ్యూనికేషన్ మార్గాలను ఇష్టపడుతున్నారు. దాంతో పోస్ట్ కార్డులు, ఇన్ ల్యాండ్ లెటర్ల వినియోగం తగ్గుతూ వచ్చింది.

టెలిగ్రామ్‌లు :
అడ్వాన్స్ టెక్నాలజీ కారణంగా 2013లో దేశమంతటా ఈ సర్వీసును నిలిపివేసింది. ఎమర్జెన్సీ మెసేజ్‌లను పంపేందుకు ఉపయోగించే టెలిగ్రామ్‌లను 2013లో దేశంలో శాశ్వతంగా నిలిపివేశారు. ఒకప్పుడు, జనన మరణాలను ప్రకటించేందుకు అలాగే ఉద్యోగ ప్రకటనల కోసం టెలిగ్రామ్‌లను వాడేవారు. అయితే, మరింత అడ్వాన్స్ టెక్నాలజీ రావడంతో టెలిగ్రామ్ వాడకం పూర్తిగా అంతరించిపోయింది.