క్రెడిట్‌ స్కోరును గుడ్డిగా నమ్మొద్దు : బ్యాంకులకు ఆర్థికమంత్రి సూచన

రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్‌ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించారు.

  • Publish Date - February 28, 2020 / 02:36 AM IST

union Finance Minister nirmala Sitaraman

రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్‌ స్కోరు (రుణ చెల్లింపుల చరిత్ర)ను గుడ్డిగా నమ్మొద్దని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు సూచించారు.

రుణగ్రహీతలకు సంబంధించి క్రెడిట్‌ స్కోర్ ను గుడ్డిగా నమ్మొద్దని, కేవలం ఓ సూచికగానే పరిగణించాలని ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సూచించారు. కస్టమర్లతో శాఖల స్థాయిలో అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టాలని కోరారు. గురువారం ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ బ్రాంచ్‌ బ్యాంకింగ్‌కు మళ్లీ మళ్లాలన్నారు. గతంలో మాదిరిగా శాఖల స్థాయిలో కస్టమర్లతో అనుసంధానత ఇప్పుడు లేదన్నారు. 

ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచాలి
డేటా విశ్లేషణ, బిగ్‌ డేటా వినియోగాన్ని కోరుకుంటున్నప్పటికీ.. శాఖల స్థాయిల్లో కస్టమర్లు మీ నుంచి వ్యక్తిగత స్పందనను కోరుకుంటారని బ్యాంకు అధిపతులకు తెలిపారు. ఆర్‌బీఐ కానీ, ప్రభుత్వం కానీ క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలను గుడ్డిగా అనుసరించాలంటూ ఎటువంటి ఆదేశాన్ని జారీ చేయలేదన్నారు. కస్టమర్లతో వ్యక్తిగత అనుసంధానత, డేటాను వినియోగించుకోవడం అవసరమన్నారు. శాఖల స్థాయిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆందోళనలను విని, వారిలో ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన పెంచాలని బ్యాంకు ఉన్నత ఉద్యోగులకు సూచించారు.    

రుణాల పంపిణీని మరింత పెంచాలి 
రుణాల పంపిణీని మరింత పెంచాలని బ్యాంకుల అధిపతులను మంత్రి సీతారామన్‌ అన్నారు. వ్యవస్థలో తగిన డిమాండ్‌ లేదంటూ వారు చెప్పినా.. రుణ వితరణ పెంపు దిశగా తగిన విధానాలను చేపట్టాలని ఆమె కోరారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా చేపడుతున్న ఆందోళనలు, ఢిల్లీలో జరిగిన హింసాత్మక చర్యలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయలేవని మంత్రి సీతారామన్‌ అన్నారు. సౌదీ అరేబియాలో ఇటీవల తాను భేటీ అయిన ఇన్వెస్టర్లు భారత్‌లో మరిన్ని పెట్టుబడులకు ఆసక్తిగా ఉన్నట్టు చెప్పారని తెలిపారు. ఇప్పటికైతే కరోనా వైరస్‌ ప్రభావం మన దేశంపై లేదన్నారు. వచ్చే రెండు నెలల్లో పరిస్థితి మెరుగుపడకపోతే పరిశ్రమకు చేదోడుగా పరిష్కార చర్యలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు.

పెండింగ్ లో ఉన్న రుణ దరఖాస్తులను పరిష్కరించాలి
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం (పీఎంఈజీపీ) కింద పెండింగ్‌లో ఉన్న 1.18 లక్షల దరఖాస్తులను మార్చి 15వ తేదీలోగా పరిష్కరించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం కోరింది. రుణ సాయంతో స్వయం ఉపాధి కింద వ్యాపార సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడమే పీఎంఈజీపీ పథకం ఉద్దేశ్యం. ఎంఎస్‌ఎంఈ రంగ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రభుత్వరంగ బ్యాంకుల చీఫ్‌లతో నిర్వహించిన సమావేశంలో ఎంఎస్‌ఎంఈ రుణాల పునరుద్ధరణపై కూడా చర్చించారు.