UPI Charges : యూపీఐ వినియోగదారులకు కీలక అప్‌డేట్.. 0.4శాతం ఎండీఆర్‌పై కేంద్రం క్లారిటీ ఇదే! రూ.75,000 దాటితే ఎంత?

UPI Charges : యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం MDR అన్ని లావాదేవీలకు వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. రూ.2,000 వరకు వ్యాపారి చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే P2P లావాదేవీలపై ఎలాంటి MDR ఉండదు. రూ.2,000 దాటిన నిర్దిష్ట వ్యాపారి చెల్లింపులకే MDR వర్తిస్తుందని కేంద్రం తెలిపింది.

UPI Charges

UPI Charges : దేశంలో డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ (UPI) కీలకంగా మారింది. టీ కొట్టు నుంచి పెద్ద మొత్తాల కొనుగోళ్ల వరకు చాలామంది యూపీఐ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ (Merchant Discount Rate) వర్తిస్తుందన్న అంశం చర్చనీయాంశంగా మారింది. అయితే అన్ని యూపీఐ లావాదేవీలకు ఈ ఛార్జీ వర్తించదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

Also Read : Apple iPhone 17e : అద్భుతమైన ఆఫర్.. ఆపిల్ ఐఫోన్ 17e ధర భారీగా తగ్గిందోచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో జస్ట్..

రూ.2,000 వరకు ఎలాంటి ఎండీఆర్‌ లేదు..
నిర్దిష్ట వ్యాపారి చెల్లింపుల్లో రూ.2,000కు మించిన లావాదేవీలకే 0.4శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. రూ.2,000 లేదా అంతకంటే తక్కువ విలువ కలిగిన వ్యాపారి చెల్లింపులకు ఎండీఆర్‌ ఉండదు. ఇప్పటికే జీరో-ఎండీఆర్‌ విధానంలో ఉన్న లావాదేవీలకు కూడా ఎలాంటి ఛార్జీ విధించరు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం P2M (Person-to-Merchant) యూపీఐ లావాదేవీల్లో సుమారు 96 శాతం లావాదేవీలు రూ.2వేలలోపే ఉంటాయి.. కాబట్టి తాజా మార్పుతో సాధారణ వినియోగదారులపై ఎలాంటి ఆర్థిక భారం పడదు.

వ్యక్తులకు డబ్బు పంపితే ఎండీఆర్‌ ఉండదు..
వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే P2P (Person-to-Person) యూపీఐ లావాదేవీలకు ఈ ఎండీఆర్‌ వర్తించదు. అంటే స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదంటే ఇతర వ్యక్తులకు రూ.5,000, రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని యూపీఐ ద్వారా పంపినా అదనపు ఎండీఆర్‌ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే, నిర్దిష్ట వ్యాపారి లావాదేవీల్లో రూ.2,000కు మించిన మొత్తంపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుంది. ఉదాహరణకు.. రూ.3,000 చెల్లింపుపై రూ.12, రూ.5,000పై రూ.20, రూ.10,000పై రూ.40ఎండీఆర్‌ ఉంటుంది. అయితే, ఈ మొత్తాన్ని కస్టమర్‌ నుంచి ప్రత్యేక ట్రాన్సాక్షన్‌ ఫీజుగా వసూలు చేయడం కాదని కేంద్రం స్పష్టం చేసింది.

రూ.75,000 దాటితే గరిష్ఠంగా..
లావాదేవీ విలువ పెరిగేకొద్దీ ఎండీఆర్‌ అపరిమితంగా పెరగకుండా గరిష్ఠ పరిమితి విధించారు. రూ.75,000 వరకు 0.4 శాతం లెక్కన ఎండీఆర్‌ వర్తించినా.. ఆ తర్వాత గరిష్ఠంగా రూ.300కే పరిమితం అవుతుంది. అంటే రూ.75,000కు మించిన లావాదేవీలపై 0.4 శాతం చొప్పున ఎండీఆర్‌ పెరుగుతూ ఉండదు.

సగటు యూపీఐ చెల్లింపు రూ.577..
ప్రస్తుతం సగటు P2M యూపీఐ లావాదేవీ విలువ సుమారు రూ.577గా ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. సాధారణంగా వినియోగదారులు చేసే వ్యాపారి చెల్లింపులు రూ.2,000 కంటే తక్కువగానే ఉంటున్నాయి. దీంతో రోజువారీ చిన్న మొత్తాల యూపీఐ చెల్లింపులపై ఈ మార్పు ప్రభావం పరిమితంగానే ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. మరొవైపు.. నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ QR ద్వారా చెల్లింపులు స్వీకరించే నిర్దిష్ట చిన్న వ్యాపారులకు జీరో-ఎండీఆర్‌ విధానం కొనసాగుతుంది. దీంతో చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.

కొన్ని రంగాల్లో ఫ్లాట్‌గా రూ.5..
రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్‌ వంటి కొన్ని నిర్దిష్ట రంగాల్లో రూ.2,000కు మించిన లావాదేవీలకు సాధారణ 0.4శాతం ఎండీఆర్‌ కాకుండా ఫ్లాట్‌గా రూ.5 ఎండీఆర్‌ వర్తిస్తుంది. అదే సమయంలో మ్యూచువల్‌ ఫండ్స్‌, సెక్యూరిటీస్‌, స్టాక్‌ బ్రోకర్లు, డీలర్లకు సంబంధించిన కొన్ని నిర్దిష్ట చెల్లింపులపై 0.02 శాతం ఎండీఆర్‌ ఉంటుంది. దీనికి గరిష్ఠంగా రూ.300 పరిమితి ఉంటుంది. అయితే, ఎండీఆర్‌ అనేది ప్రభుత్వం లేదంటే ఎన్‌పీసీఐ (NPCI) నేరుగా వసూలు చేసే పన్ను కాదని కేంద్రం స్పష్టం చేసింది. పేమెంట్‌ ఎకోసిస్టమ్‌లోని వివిధ భాగస్వాముల మధ్య పంపిణీ అయ్యే ఛార్జీగా దీనిని పేర్కొంది. సాధారణంగా ఈ మొత్తాన్ని కస్టమర్‌ నుంచి ప్రత్యేకంగా వసూలు చేయకుండా.. వ్యాపారికి అందాల్సిన చెల్లింపు మొత్తంలోనే సర్దుబాటు చేస్తారు.

రూ.1500 కోట్ల ప్రోత్సాహక పథకం..
జీరో-ఎండీఆర్‌ డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆర్థిక సహకారం అందిస్తోంది. 2025 మార్చిలో తక్కువ విలువ కలిగిన యూపీఐ P2M లావాదేవీలకోసం రూ.1500 కోట్ల ప్రోత్సాహక పథకాన్ని కేంద్రం ఆమోదించింది. అందువల్ల అన్ని యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం కొత్త ఫీజు విధించారన్న ప్రచారం సరైంది కాదని కేంద్రం స్పష్టం చేసింది. రూ.2,000 వరకు ఉన్న నిర్దిష్ట వ్యాపారి చెల్లింపులు, వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే P2P బదిలీలు, అలాగే జీరో-ఎండీఆర్‌ కేటగిరీలోని లావాదేవీలపై ఈ ఛార్జీ వర్తించదని వివరించింది.