UPI Payment Alert : పొరపాటున వేరే వ్యక్తికి డబ్బులు పంపారా? కంగారొద్దు.. వెనక్కి తెచ్చుకోవచ్చు.. ఇలా చేయండి..
UPI Payment Alert : భారత దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్నిసార్లు మనం అనుకున్న వారికి కాకుండా వేరే వ్యక్తికి పొరపాటున మనీ ట్రాన్సఫర్ చేస్తుంటాం. అలాంటి సమయంలో కంగారు పడకుండా వేగంగా ఫిర్యాదులు చేస్తే మన డబ్బు మనకు రికవరీ అయ్యే అవకాశం ఉంది.
- Harish Thanniru
- Published on- August 16, 2026 / 10:40 AM IST
upi payment wrong transfer how to get money back
UPI Payment Alert : డిజిటల్ చెల్లింపులు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. చిన్న మొత్తాల నుంచి పెద్ద చెల్లింపుల వరకు ఇప్పుడు ఎక్కువగా యూపీఏ ద్వారానే లావాదేవీలు చేస్తున్నాం. అయితే, యూపీఏలో వేగంగా చెల్లింపు పూర్తవడం ఎంత సౌకర్యమో.. అదే సమయంలో పొరపాటున తప్పుడు వ్యక్తికి డబ్బులు పంపితే అంతే టెన్షన్ కూడా ఉంటుంది. తప్పు యూపీఏ ఐడీ, మొబైల్ నంబర్ లేదా కాంటాక్ట్‌ను ఎంపిక చేయడం వల్ల డబ్బు వేరొకరి ఖాతాలోకి వెళ్లిపోవచ్చు. అయితే, పొరపాటున తప్పు వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బు పంపినంత మాత్రాన ఆ మొత్తం పూర్తిగా పోయినట్లే కాదు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేసి డబ్బును తిరిగి పొందేందుకు ప్రయత్నించవచ్చు.
భారత దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఏడాది జూలై నెలలో యూపీఐ లావాదేవీల పరిమాణం 4.1 శాతం, విలువ 3.3శాతం పెరిగాయి. ఎప్పుడూ లేనివిధంగా 29.88 ట్రిలియన్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇంత భారీ స్థాయిలో లావాదేవీలు జరుగుతున్న నేపథ్యంలో.. పొరపాటున తప్పు వ్యక్తికి డబ్బు పంపే ఘటనలు కూడా ఎదురవుతున్నాయి.
తప్పు యూపీఐ ఐడీకి డబ్బులు పంపితే ఏం చేయాలి?
పొరపాటున వేరే వ్యక్తికి డబ్బు పంపినట్లు గుర్తించిన వెంటనే ఆందోళన చెందకుండా వీలైనంత త్వరగా ఫిర్యాదు చేయాలి. అందుకోసం ముందుగా మీరు.. UPI యాప్‌లో Help ఆప్షన్ చూడండి. మీరు చెల్లింపు చేసిన యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి Help / Support ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ సమస్యను అక్కడ ఉన్న చాట్ అసిస్టెంట్ లేదా ఫిర్యాదు విభాగంలో నమోదు చేయాలి. సంబంధిత లావాదేవీ వివరాలను యాప్ చూపించినప్పుడు.. తప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
లావాదేవీని రిపోర్టు చేయండి..
తప్పుగా జరిగిన లావాదేవీని ఎంచుకున్న తర్వాత.. అందుబాటులో ఉన్న Report / Raise Complaint ఆప్షన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చే Complaint Reference Number ను తప్పకుండా భద్రపరచుకోవాలి. భవిష్యత్తులో ఫిర్యాదు స్థితిని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
సైబర్ మోసమైతే..
మీరు పొరపాటున డబ్బు పంపడం కాకుండా సైబర్ నేరగాళ్ల మాటలు నమ్మి డబ్బు బదిలీ చేసినట్లయితే, ఆలస్యం చేయకుండా 1930కు ఫిర్యాదు చేయాలి. ఇలాంటి సందర్భాల్లో సమయం చాలా కీలకం. కాబట్టి మోసం జరిగినట్లు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం మంచిది.
ఫిర్యాదు చేసేటప్పుడు ఈ వివరాలు ఉండాలి.
♦ యూపీఐ లావాదేవీపై ఫిర్యాదు చేసే సమయంలో కింది వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి.
♦ యూటీఆర్ నంబర్ లేదా ట్రాన్సాక్షన్ ఐడీ
♦ లావాదేవీ జరిగిన తేదీ, సమయం
♦ బదిలీ చేసిన మొత్తం
♦ డబ్బు వెళ్లిన వ్యక్తి యూపీఐ ఐడీ లేదంటే మొబైల్ నంబర్
♦ లావాదేవీకి సంబంధించిన స్క్రీన్‌షాట్లు
♦ సంబంధిత యూపీఐ యాప్ లేదా బ్యాంక్ వివరాలు
♦ ఈ వివరాలు అందుబాటులో ఉంటే ఫిర్యాదు ప్రక్రియను సులభంగా కొనసాగించవచ్చు.
డబ్బు పంపే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
♦ యూపీఐ చెల్లింపు చేయడానికి ముందు కొన్ని సెకన్లు జాగ్రత్తగా ఉంటే తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించుకోవచ్చు.
♦ పేరు, యూపీఐ ఐడీ చెక్ చేయండి.. డబ్బు పంపే వ్యక్తి పేరు, యూపీఐ ఐడీ సరైనవేనా అని ఒకటికి రెండుసార్లు పరిశీలించండి.
♦ హడావుడిగా చెల్లించవద్దు.. తొందరలో తప్పు కాంటాక్ట్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చెల్లింపు చేసే ముందు వివరాలను ప్రశాంతంగా పరిశీలించండి.
♦ మొత్తాన్ని చెక్ చేయండి: యూపీఐ పిన్ నమోదు చేసే ముందు స్క్రీన్‌పై కనిపించే మొత్తాన్ని మరోసారి పరిశీలించండి.
♦ పిన్ ఎవరితోనూ పంచుకోవద్దు.. యూపీఐ పిన్, ఓటీపీ వంటి రహస్య వివరాలను ఎవరితోనూ చెప్పకండి.
♦ తెలియని వ్యక్తుల సూచనలతో చెల్లింపులు చేయవద్దు.. రివార్డ్, రీఫండ్, కేవైసీ అప్‌డేట్ వంటి పేర్లతో ఎవరైనా డబ్బు పంపాలని ఒత్తిడి చేస్తే అప్రమత్తంగా ఉండాలి.
ఒక్క క్లిక్ సౌకర్యం.. ఒక్క తప్పుతో సమస్య!
యూపీఐ చెల్లింపులు మనకు ఎంతో సౌకర్యాన్ని అందిస్తున్నాయి. కానీ, చెల్లింపు చేయడానికి ముందు కొన్ని సెకన్లు తీసుకుని పేరు, యూపీఐ ఐడీ, మొత్తం చెక్ చేయడం చాలా ముఖ్యం. పొరపాటున తప్పు వ్యక్తికి డబ్బు వెళ్లిపోయినా వెంటనే సంబంధిత యూపీఐ యాప్‌లో ఫిర్యాదు చేయాలి. సైబర్ మోసం జరిగితే 1930కు వీలైనంత త్వరగా సమాచారం ఇవ్వాలి.
యూపీఐ యాప్‌ల హెల్ప్‌లైన్ నెంబర్లు..
♦ ఫోన్ పే : 08068727374
♦ పేటీఎం : 01204456456
♦ గూగుల్ పే : 18004190157
♦ భీమ్ యూపీఐ : 180012001740
♦ వీటిలోనే కాకుండా ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) వెబ్ సైట్ లో కూడా ఫిర్యాదు చేయొచ్చు.
