Post Office FD : రూ. 1,000 పెట్టండి.. 5 ఏళ్లు ఆగండి.. ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో ఎంత వడ్డీ వస్తుందంటే?

Post Office FD : రూ.1,000తో మొదలయ్యే పోస్టాఫీస్ 5 ఏళ్ల టైమ్ డిపాజిట్‌పై 7.50శాతం వడ్డీ, పన్ను ప్రయోజనాలు, పెట్టుబడి నిబంధనలు, వడ్డీ రేటును ఎవరు నిర్ణయిస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published on- September 21, 2026 / 08:02 PM IST

Post Office FD

Post Office FD : మీ డబ్బులు భద్రమేనా? మీ భవిష్యత్తు కూడా భద్రంగా ఉండాలంటే ఇప్పటినుంచే ఇన్వెస్ట్ చేయడం అలవాటు చేసుకోండి. పెట్టుబడి అనగానే పెద్ద మొత్తంలో అనుకోవద్దు.. తక్కువ మొత్తంలో పెట్టుబడితో అధిక లాభాలు పొందే చాలా పథకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో పోస్టాఫీసు సేవింగ్స్ పథకాలు.. పైగా ప్రభుత్వ పథకాలు కావడంతో వీటికి గ్యారెంటీ కూడా ఉంటుంది. మీరు కూడబెట్టిన పైసా కూడా ఎక్కడికి పోదు.

పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన పనిలేకుండా మీ సేవింగ్స్ సురక్షితంగా పెంచుకోవచ్చు. పోస్టాఫీస్ అందించే పథకాల్లో టైమ్ డిపాజిట్ (TD) పథకం కూడా ఒకటి. దీన్నే సాధారణంగా పోస్ట్ ఆఫీస్ FD అని కూడా అంటారు. ఇందులో ఒకేసారి డబ్బు డిపాజిట్ చేసి.. ఎంచుకున్న టెన్యూర్ పూర్తయ్యే వరకు (Post Office FD) పెట్టుబడిని కొనసాగించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లను 1, 2, 3, 5 ఏళ్ల కాలానికి ఓపెన్ చేయొచ్చు. ఇందులో 5 ఏళ్ల కాలపరిమితి టీడీపై ప్రస్తుతం సంవత్సరానికి 7.50శాతం వడ్డీ లభిస్తుంది. సాధారణ పెట్టుబడిదారులతో పాటు సీనియర్ సిటిజన్లకు కూడా ఇదే వడ్డీ రేటు వర్తిస్తుంది. అంటే.. 60 ఏళ్లు పైబడిన వారికి ఈ పథకంలో ప్రత్యేకంగా అదనపు వడ్డీ ఉండదు.

రూ. 1,000తోనే పెట్టుబడి :
పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ (TD)లో పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. కేవలం రూ. 1,000తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత పెట్టుబడిదారులు తమ ఆర్థిక సామర్థ్యానికి అనుగుణంగా మరింత మొత్తాన్ని డిపాజిట్ చేయవచ్చు. డిపాజిట్‌పై వడ్డీని ప్రతి ఏడాది చెల్లిస్తారు. క్యాష్ లేదా చెక్ ద్వారా పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. నామినేషన్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది.

Read Also : Vivo Y600K Turbo : వివోనా మజాకా.. కొత్త వివో Y600K టర్బో వస్తోందోచ్.. ధర, ఫీచర్లపై భారీ అంచనాలు..!

ఐదేళ్ల టైమ్ డిపాజిట్ పథకంలో మరో ముఖ్యమైన ప్రయోజనం పన్ను ఆదా. అర్హత కలిగిన పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను ప్రయోజనం పొందవచ్చు. అయితే, వర్తించే నిబంధనలు, పరిమితులు, వ్యక్తిగత పన్ను పరిస్థితిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి.

వడ్డీ రేటును ఎవరు నిర్ణయిస్తారు? :

బ్యాంకు FDలతో పోలిస్తే.. పోస్టాఫీస్ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్ల విధానం భిన్నంగా ఉంటుంది. ఇందులో వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుంది. సాధారణంగా ప్రతి 3 నెలలకు ఒకసారి రేట్లను రివ్యూ చేస్తారు.

అవసరాన్ని బట్టి వడ్డీల్లో మార్పులు చేస్తారు. నేరుగా ఆర్బీఐ రెపో రేటుతో లింక్ చేసి ఉండవు. అందుకే పెట్టుబడి పెట్టే ముందు ప్రస్తుత వడ్డీ రేటు, పన్ను నిబంధనలు, మెచ్యూరిటీ నిబంధనలు వంటి అంశాలను పరిశీలించడం చాలా ముఖ్యం.

Note : మీరు ఎందులోనైనా పెట్టుబడి పెట్టాలని చూస్తున్నారా? పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు మీ ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.