38 year old woman kills s son-in-law to death in Hyderabad : అక్రమ సంబంధాల మోజులో నేరాలు పెరిగిపోతున్నాయి. ఒక నేరం.. ఆనేరం తప్పించుకోటానికి ఇంకో నేరం… ఇలా ప్రజల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. చేసేదే తప్పుడు పని అని తెలుసు….. ఆ తప్పుడు పని కప్పిపుచ్చుకునేందుకు ఒక అమానుషం…..ఆత్మహత్య…. ఆతర్వాత మరో హత్య….చివరికి జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది ఒంటరి మహిళకు.
హైదరాబాద్ మీర్ పేటలో నివాసం ఉండే వల్లూరి బాబురావు, అనితలకు ముగ్గురు కుమార్తెలు. 10 ఏళ్ల క్రితం బాబురావు కుటుంబాన్నివదిలేసి వెళ్లి పోవటంతో అనిత (38) క్యాటరింగ్ పని చేస్తూ ముగ్గురు కూతుళ్లతో ఒంటరిగా జీవనం సాగిస్తోంది.
ఈ నేపధ్యంలో నెల్లూరు కు చెందిన పేరం నవీన్ కుమార్(32) అనే వ్యక్తి అనితకు పరిచయం అయ్యాడు. ఒంటరిగా జీవిస్తున్న అనిత… అతడితో వివాహేతర సంబంధం కొనసాగించింది. ఈ క్రమంలో అనిత ఇంటికి తరచూ వచ్చిపోతున్న నవీన్ కన్ను, ఆమె పెద్ద కూతురు వందన (19)పై పడింది. కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే ఇంక శాశ్వతంగా ఇంట్లోనే ఉంటాకనుక…. మన బంధాన్ని ఎవరూ తప్పు పట్టరని అనితను ఒప్పించి 2019 నవంబర్ లో వందనను వివాహం చేసుకున్నాడు.
అనుకున్నట్లుగానే తల్లీ కూతుళ్ళతో సన్నిహితంగా మెలగసాగాడు నవీన్ కుమార్. ఇది నచ్చని వందన నవీన్ తో గొడవపడింది. అయినా వీరిద్దరి అక్రమ సంబంధం కొనసాగుతుండటంతో మనస్తాపానికి గురై సూసైడ్ నోట్ రాసి వందన ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్ పేట పోలీసులు దర్యాప్తు చేశారు.
సూసైడ్ నోట్ ఆధారంగా అనిత, నవీన్ లను అరెస్టు చేశారు. తన కుమార్తె మరణానికి, తాను జైలుకు వెళ్ళటానికి..కుటుంబానికి దూరం కావటానికి నవీనే కారణమని అనిత మనసులో పగ పెంచుకుంది. బెయిల్ పై బయటకు వచ్చిన అనిత, నవీన్ లు విడిపోయి వేరు వేరుగా జీవించసాగారు.
అనిత పార్శిగుట్టలో, నవీన్ రామాంతపూర్ లోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారు. కాగా అనిత అడ్రస్ తెలుసుకున్న నవీన్ ఆమెను బుధవారం రాత్రి ఇంటికి రమ్మని పిలిచాడు. మనసులో భావం బయటపడకుండా, అనిత నవీన్ ఇంటికి వచ్చింది. వందన ఆత్మహత్య కేసు నుంచి తనను తప్పించాలని ….రాజీ కుదుర్చుకునే వీలుగా మాట్లాడాలని నవీన్ ఆమెను కోరాడు. ఈ విషయంలో ఇద్దరు గొడవ పడ్డారు. అప్పటికి ఆ విషయం ఆపి ఇద్దరూ నిద్ర పోయారు.
తెల్లవారుఝామున నవీన్ నిద్రలో ఉండగా, అనిత వంటింట్లో ఉన్న కత్తి తీసుకుని వచ్చి అతడిపై విచక్షణా రహితంగా పొడిచి చంపింది. నవీన్ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత, నేరుగా ఉప్పల్ పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయింది. దీంతో ఉప్పల్ ఎస్సై రంగస్వామి ఘటనా స్ధలానికి వచ్చి నవీన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.