అప్పుల భారంతో కుటుంబం ఆత్మహత్య

  • Publish Date - November 2, 2020 / 06:14 PM IST

5 Members of Family found dead in their residence :  అసోంలోని కోక్రాఝూర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ తో వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది.

అసోం-పశ్చిమ బెంగాల్ సరిహద్దులోని తుల్సిబిల్ పట్టణంలో సోమవారం ఉదయం ఈ ఉదంతం వెలుగు చూసింది. తుల్సిబిల్ లో నివసించే నిర్మల్ పాల్(45) అతని భార్య మల్లిక(40) వారి ముగ్గురు కుమార్తెలు పూజ(25) నేహ(17) దీప(15) అయిదుగురు సీలింగ్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉండటం స్ధానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.



నిర్మల్ పాల్ గ్యాస్ సిలిండర్లు యూనిట్ ను నడిపేవాడు. అయితే వ్యాపారంలో నష్టాలు రావటంతో భారీగా అప్పులు చేసాడు. దాదాపు రూ.25 నుంచి రూ.30 లక్షల వరకు అప్పు చేసి ఉంటాడని సమీప బంధువులు పేర్కోన్నారు.



తన సబ్ ఏజెన్సీల ద్వారా గ్యాస్ సిలిండర్ లను సరఫరా చేస్తానని చెప్పి ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించాడని తెలిసింది. ఆ తర్వాత కరోనా వైరస్ వ్యాపించటం… లాక్ డౌన్ అమలవటం… ఆయిల్ కంపెనీల పాలసీల వలన వ్యాపారం దెబ్బతిన్నదని తోటి వ్యాపారస్తులు తెలిపారు.

వ్యాపారం సక్రమంగా నడవక పోవటంతో ఆర్ధికంగా నష్టాలు పెరిగి పోయాయి. నిర్మల్ పాల్ పెద్ద కుమార్తె పూజ స్ధానికంగా ఉన్న ప్రయివేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది. అప్పులు తీరే మార్గం కనపడక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని స్ధానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.