9వ తరగతి విద్యార్థిని మార్ఫింగ్‌ ఫొటోలతో బ్లాక్‌మెయిల్, పోలీసులకు తండ్రి ఫిర్యాదు

  • Publish Date - July 15, 2020 / 01:55 PM IST

కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బ్లాక్ మెయిల్, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడం వాటిని అడ్డు పెట్టుకుని కొందరు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తే మరికొందరు లైంగిక కోరికలు తీర్చాలని వేధిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో అలాంటి దారుణం ఒకటి వెలుగుచూసింది. 9వ తరగతి చదివే విద్యార్థినికి చేదు అనుభవం ఎదురైంది. చివరికి అమ్మాయి తండ్రి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.

బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్ మెయిల్:
తన కూతురు ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసి సోషల్ మీడియాలో వైరల్‌ చేయడమే కాకుండా తొలగించేందుకు డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారంటూ ఆమె తండ్రి సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ స్కూల్ లో బాలిక 9వ రగతి చదువుతోంది. ఆమె ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్‌ చేసిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు జూన్‌ 27న సాయంత్రం వాట్సాప్‌లో పంపించారు. అంతేకాదు ఆమె పేరుపై ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా తెరిచి అందులోనూ ఆ ఫొటోలను పోస్ట్‌ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారు షాక్ తిన్నారు.

సోషల్ మీడియాతో జాగ్రత్త:
వెంటనే ఆ వ్యక్తులతో మాట్లాడారు. వాటిని తొలగించాలని కోరారు. డబ్బులిస్తేనే ఫొటోలు తొలగిస్తామని ఆ వ్యక్తులు బెదిరింపులకు దిగారు. దీంతో బాలిక కుటుంబసభ్యులు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బాలిక ఫొటోలు మార్ఫింగ్ చేసి డబ్బు డిమాండ్ చేసిన వ్యక్తులు ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చారు. ఆ నెంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇటీవల మోసాలు, నేరాలు పెరిగిపోయాయి. కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియా వేదికగా మోసాలకు, వేధింపులకు పాల్పడుతున్నారు. అందుకే సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మన పర్సనల్ ఫొటోలను, వివరాలను ఫేస్ బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో షేర్ చేసుకోకపోవడమే మంచిది అంటున్నారు. అంతేకాదు అపరిచిత వ్యక్తులతో అస్సలు స్నేహం చేయొద్దని సూచించారు. ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఏమాత్రం భయపడకుండా, పరువు పోతుందేమోనని ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.