వివాహితపై సామూహిక అత్యాచారం..తూ.గో.జిల్లాలో దారుణం

  • Publish Date - August 5, 2020 / 05:46 PM IST

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. వివాహితపై ముగ్గురు కామాంధులు అత్యాచారం చేశారు. ఈ విషయం బయటకు చెపితే చంపేస్తామని చెప్పి బెదిరించటంతో బాధితురాలు రెండు నెలలపాటు తనకు జరిగిన అన్యాయాన్ని భరించింది. చివరకు తల్లి తండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందిన వివాహిత తన భర్త, పిల్లలతో కాపురం ఉంటోంది. గతంలో తాము ఇల్లు కట్టుకోగా…ఆ ఇంటి నిర్మాణ సమయంలో తాపీ మేస్త్రీలుగా పని చేసిన చేశెట్టి బాలాజీ, మంతెన లచ్చ, తీడ లోవరాజులు ఆ వివాహితపై కన్నేశారు.

ఇంటి నిర్మాణం పూర్తయినప్పటికీ ఆమె కు ఫోన్ చేసి తమ కోరిక తీర్చమని వేధించేవారు. ఆమె వారి వేధింపులు మౌనంగా భరిస్తూ వచ్చింది .కానీ ఎవరికీ చెప్పుకోలేదు. సుమారు రెండు నెలల క్రితం బాధితురాలి మావగారు అనారోగ్యం పాలవటంతో ఆమె భర్త తండ్రి వద్దే ఆస్పత్రిలో ఉండి చికిత్స చేయించాడు.

వివాహిత భర్త ఆస్పత్రిలో ఉంటున్నాడని,ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకున్న కీచకులు ముగ్గురు ఓ రోజు అర్ధరాత్రి ఆమె ఇంటికి వచ్చారు. ఒంటరిగా ఉన్న ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎవరికైనా చెపితే చంపేస్తామని చెప్పి బెదిరించి వెళ్లిపోయారు. దాదాపు 2నెలల పాటు తనపై జరిగిన లైంగిక దాడికి తనలో తానే కుమిలిపోయింది.

ఈవిషయాన్ని చివరికి తన తల్లితండ్రులకు చెప్పింది. వారి సహకారంతో మంగళవారం, ఆగస్టు 4వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వివాహిత కేసు పెట్టిందని తెలియటంతో నిందితులు పరారయ్యారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.