కోవిడ్ టెస్ట్ కు తీసుకెళ్తే పారిపోయిన ఖైదీ

  • Publish Date - July 17, 2020 / 01:39 PM IST

వరంగల్ సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీకి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. ఆ ఖైదీని ఆస్పత్రిలో చూపించటానికి తీసుకు వస్తే పోలీసుల కళ్లు గప్పి పరారయ్యాడు. హన్మకొండకు చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.

అతనికి కరోనా లక్షణాలు బయట పడటంతో జైలు సిబ్బంది అతడిని గురువారం ఉదయం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తీసుకువచ్చారు. అతని వద్ద శాంపిల్స్ సేకరించి కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్కడ ఎస్కార్ట్ కూడా ఏర్పాటు చేసారు. అయినప్పటికీ ఖైసర్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకుని పారిపోయాడు.

దీంతో జైలు సిబ్బంది మట్టెవాడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఖైసర్ కోసం గాలిస్తున్నారు. 14 చోరీలు చేసిన ఖైసర్‌ గత నెలలోనే పట్టుబడి వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.