అతనొక బాధ్యత గల ప్రభుత్వోద్యోగి. కేంద్ర సాయుధ బలగాలలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. తాను చేసే పనిని ఎవరూ తప్పుపట్టరనుకున్నాడో ఏమో… లేదా…. తాను CRPF లో చేస్తున్నా…. కాబట్టి చట్టం…. నా చుట్టం అనే ధీమానో ఏమో తెలియదు ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.
ఒకరికి తెలియకుడా ఒకరిని, ఎవరికీ విడాకులు ఇవ్వకుండానే ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య ఫిర్యాదుతో మొత్తం వ్యవహారం బయట పడటంతో హైదరాబాద్ వనస్ధలిపురం పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
హైదరాబాద్ సహారా ఎస్టేట్ లోని గందార అపార్ట్ మెంట్ లో నివసించే CRPF కానిస్టేబుల్ ఎడ్ల శంకరయ్య(39) 2011 లో ఒక మహిళను వివాహం చేసుకుని ఆమెను వదిలేశాడు. 2016 లో శారద (38) అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.
2017 లో వీరికి ఒక పాప పుట్టింది. అయితే శంకరయ్యకు ఉద్యోగ రీత్యా బదిలీ వేరే ప్రాంతానికి బదిలీ కావటంతో భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో అప్పటి నుంచిభార్య భర్తలు విడివిడిగా జీవించ సాగారు.
ఈసమయంలోనే శంకరయ్యకు సహారా రోడ్డులో బ్యూటీ పార్లర్ నిర్వహించే మంజులా రాణి అనే మహిళ పరిచయం అయ్యింది. ఈ పరిచయం మరింత పెరిగి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలను కున్నారు. అంతకు ముందు తనకు జరిగిన రెండు పెళ్లిళ్ల విషయం చెప్పకుండా మంజులా రాణిని గతేడాది నవంబర్ 30న తిరుపతిలో పెళ్లి చేసుకుని ఆమెతో కాపురం చేస్తున్నాడు.
శంకరయ్య 2వ భార్య శారద కు ఈవిషయం తెలిసి వనస్ధలిపురం పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపి ఆగస్ట్ 20 న శంకరయ్యను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.