కర్ణాటకలో ఒక ప్రైవేట్ బస్సు అగ్ని ప్రమదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిరియూరు తాలూకా, కస్తూరి రంగప్పన్నహళ్లి వద్ద బెంగుళూరు-పూణే జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుఝూమున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
చిత్రదుర్గకు 40 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఒక ప్రైవేట్ బస్సు ఇంజన్ లో మంటలు చెలరేగాయి. ఇది గమనించిన డ్రైవర్ , కండక్టర్ బస్సును పక్కకు ఆపి బస్సు దిగి పరారయ్యారు. బస్సులో నిద్ర పోతున్న ప్రయాణికులు నిద్ర లేచే లోపే బస్సులొ పొగ కమ్ముకుంది.
కొందరు కిటికీ అద్దాలు పగలగొట్టుకుని కిందకు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. బయటకు రాలేక ఐదుగురు ప్రయాణికులు సజీవ సమాధి అయ్యారు. వారిలో నిశ్చిత(3) సమృధ్ధ(5) స్పర్శ(8) కవిత(29), శిల్ప ఉన్నారు. మరో 30 మంది అస్వస్ధతకు గురయ్యారు.