విశాఖలో కిడ్నాప్ కలకలం…. గంటలోనే చేధించిన పోలీసులు

  • Publish Date - November 1, 2020 / 03:22 PM IST

police rescue 6 year old boy from kidnappers : విశాఖలోని, గాజువాక ఆటోనగర్‌లో ఆరేళ్ల బాలుడి కిడ్నాప్‌ ఒక్కసారిగా కలకలం రేపింది. రాజస్తాన్‌కు చెందిన నరేష్‌ యాదవ్‌ అనే వ్యక్తి విశాఖకు వలస వచ్చి పరిశ్రమ నడుపుతున్నారు. వ్యాపార అవసరాల కోసం ఓ వ్యక్తి వద్ద 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నారు.

అయితే అప్పుతీసుకున్న తర్వాత దేశంలో ఏర్పడ్డ లాక్‌డౌన్‌, కరోనా వైరస్‌ కారణంగా వ్యాపారం సరిగా నడవలేదు. అప్పు తిరిగి చెల్లించడంలో కొంత జాప్యం జరిగింది. ఈ క్రమంలోనే డబ్బులు ఇచ్చిన వ్యక్తి , తన డబ్బు తిరిగి చెల్లించమని నరేష్ యాదవ్ పై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాడు. అయినప్పటికీ నరేష్‌ చెల్లించకపోవడంతో.. అతని ఆరేళ్ల కుమారుడిని ఆదివారం ఉదయం కిడ్నాప్‌ చేశాడు.


వెంటనే తండ్రి నరేష్‌ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. గంట వ్యవధిలోనే కేసును ఛేదించారు. దుండుగుల నుంచి బాలుడిని క్షేమంగా తీసుకువచ్చారు. కిడ్నాప్ కు సంబంధించి ఐదుగురుని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు.